- భూమనకు సవాల్ విసిరిన టిడిపి
- మందీమార్బలం లేకుండా వెళ్లాలని భూమనకు సూచన
- భారీగా కార్యకర్తలతో రాకుండా అడ్డుకున్న పోలీసులు
- తోక ముడిచాంటూ భూమన ఎదురుదాడి
టీటీడీ గోశాల వ్యవహారంపై వైసీపీ రాజకీయ రచ్చకు దిగింది. పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోశాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావుడి చేయకుండా గోశాలకు వెళ్లాలని పోలీసులు భూమనకు సూచించారు. ఆయన మాత్రం తనను పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఛాలెంజీపై తాను స్పందించానని, తనను రమ్మని వాళ్లే నిర్బంధించడం ఎంత వరకు న్యాయమని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలని అన్నారు. తాను ఒక్కడినే రావడానికి సిద్ధమని.. టీడీపీ నేతలు వెళ్లిపోయాక అనుమతిస్తే ఏం ఉపయోగమని అన్నారు. పోలీసుల బలగాలతో నిర్బంధించడం దారుణమన్నారు. కాగా అంతకుముందు పద్మావతి పురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. గోశాలకు వెళ్లేందుకు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి సిద్ధమయ్యారు. దీంతోవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై పడుకుని పోలీసులు తీరుపై నిరసన తెలిపారు. గోశాలల్లో మూగ జీవాల మృతిపై రాజకీయ రగడ జరుగుతోంది.
వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసుల సూచించారు. గోశాలలో గోవుల మృతికి సంబంధించి కూటమి ప్రజా ప్రతినిధులు.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సవాళ్లపై పోలీసు శాఖ గురువారం ఈ ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు. శాంతి ర్యాలీ పేరుతో వందలాది కార్యకర్తలతో కాకుండా గన్ మెన్ లతో గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడవచ్చని కూటమి ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
అయితే అర్ధరాత్రి నుంచే తనను, తమ నేతలను హౌస్ అరెస్టు చేశారని మాజీ ఛైర్మన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. యాబై మందికి పైగా పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని, తిరుపతి ఎస్వీ గోశాలలోని నిజాలు నిగ్గుతేల్చాలని బయలుదేరితే పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎస్పీతో కూడా ప్రభుత్వం అబద్దం చెప్పిందని భూమన పేర్కొన్నారు. తమని గోశాల వద్దకు పంపలేదని, అందుకే రోడ్డుపై బైఠాయించామని భూమన చెప్పారు. ఎస్వీ గోశాలపై కూటమి నేతలు, భూమన పరస్పర సవాళ్లతో తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. గోశాల రావాలని సవాల్ విసిరిన వెంటనే నేను సిద్దం అంటూ చాలెంజ్ స్వీకరించాను. నాతో సహా మా నేతలందరినీ హౌస్ అరెస్టు చేశారు. యాబై మందికి పైగా పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు. నిజాలు నిగ్గుతేల్చాలని బయలుదేరితే పోలీసులతో అడ్డుకున్నారు. మమ్మల్ని వెళ్ళకుండా అడుగుఅడగునా అడ్డుకున్నారు. నాకు ఫోన్ చేసి గోశాలకు రావాలని ఎమ్మెల్యేలు కోరారు, వస్తానని వారికీ చెప్పాను. నాకు సవాల్ విసిరిన పల్లా శ్రీనివాస్ రాకుండా తోకముడిచారని అన్నారు. గురువారం ఉదయం గోశాల వద్దకు కూటమి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, కలికిరి మురళీ మోహన్, ఆరణి శ్రీనివాసులతో పాటు బోర్టు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తదితరులు వెళ్లారు. అక్కడి నుంచే భూమన కరుణాకర్ రెడ్డికి వారు ఫోన్ చేశారు. అసత్య ఆరోపణలు చేయడం కాదని, క్షేత్రస్థాయికి రావాలని కోరారు. పోలీసులు సూచనల మేరకు ఐదుగురితో రావాలని భూమనను కోరారు. గోశాలకు వస్తానని భూమన వారికి తెలిపారు. ఈ నేపథ్యంలో గోశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.