- అక్రమ పార్కింగ్ పై చర్యలు మరిచారు..
- వాహనదారులకు తప్పని ట్రాఫిక్ తిప్పలు
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా దాదాపు 9 ఏళ్ల క్రితం మూసి వేసిన తార్నాక జంక్షన్ ను పునరుద్దరణ చేసే క్రమంలో 15 రోజుల పాటు ట్రయల్ రన్ కోసం శుక్రవారం తార్నాక జంక్షన్ ను ట్రాఫిక్, జీహెచ్ఎంసి అధికారులు ఓపెన్ చేశారు. దీంతో ఇంత కాలం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లాలాపేట వైపు వేళ్ల వాహనదారులు రైల్వే డిగ్రీ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన యూ టర్న్ నుంచి రాకపోకలు సాగించేవారు. తార్నాక జంక్షన్ పునరుద్ధరణతో వీరు ఇక నుంచి తార్నాక సిగ్నల్ మీదుగా నేరుగా వెళ్లుతున్నారు. కాగా సిగ్నల్ టైమింగ్స్ వలన తార్నాక చౌరస్తాకు ఇరు వైపుల వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోయి రోడ్లపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీనిపై పలువురు వాహనదారులు మాట్లాడుతూ రోడ్డు విస్తరణతో పాటు పుట్పాత్ ల నిడివి తగ్గించాలనీ అధికారులకు సూచిస్తున్నారు. వాహనాల రాకపోకలు ట్రాఫిక్ ను నల్లకుంట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పర్యవేక్షించారు.
అక్రమ పార్కింగ్ పై చర్యలు మరిచారు..
జిహెచ్ఎంసి అధికారులు, ట్రాఫిక్ పోలీసుల అలసత్వం కారణంగా తార్నాక సిగ్నల్ ఓపెన్ చేసిన రోజే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓ పక్క ఫుట్ పాత్ కబ్జాలు, మరోపక్క తాజా కిచెన్ ముందు యూ టర్న్ ను అధికారులు క్లోజ్ చేయడంతో ట్రాఫిక్ లో వాహనదారులకు చుక్కలు కనిపించాయి. తార్నాక చౌరస్తాకు ఆనుకొని పెట్రోల్ బంకులు, పలు హోటల్ లు ఉన్నాయి. ముఖ్యంగా తార్నాక చౌరస్తాలో డెక్కన్ పామ్ రెస్టారెంట్, సన్మాన్ హోటల్ ముందు హోటల్ నిర్వాహకులు ఫుట్ పాత్ ని కబ్జా చేసి ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. రెస్టారెంట్ ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయడంతో దాదాపు 300 నుంచి 400 మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. గతంలో “ఆదాబ్ హైదరాబాద్” దినపత్రికలో తార్నాక జంక్షన్ ఓపెన్ అయితే ఈ హోటల్ ల ముందు చేస్తున్న అక్రమ పార్కింగ్ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్య ఉంటుందని ముందుగానే హెచ్చరించడం జరిగింది. కానీ అధికారులు అక్రమ పార్కింగ్ లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు ఫుట్ పాత్ కబ్జాలపై, రోడ్లపై అక్రమంగా చేస్తున్న పార్కింగ్ లపై స్పందించి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూడాలని కోరుతున్నారు.