జిల్లా ఎస్పీ కె. నరసింహ గౌడ్
నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలని, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని అన్నారు. సంభందిత అధికారులు అందరూ సమన్వయంగా పని చేసి రైతులకు నకిలీ వితనాలు సరఫరా జరగకుండా చూడాలి అన్నారు. రాష్ట్రానికి, దేశానికి వ్యవసాయం ముఖ్యమైన ఆధారం అలాంటి వ్యవసాయం చేసే రైతులు ఆరుగాలం కష్టపడి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా విత్తన సంస్థలు, డీలర్లు, వ్యాపారులపై ఉందన్నారు. విత్తన వ్యాపార డీలర్స్ బాధ్యతగా మంచి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు. రైతులకు, వ్యవసాయానికి నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే అలాంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తాము, పిడి యాక్ట్ తప్పదని, షీట్స్ నమోదు చేస్తాం అని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా, ఆంధ్రా ప్రాంతానికి ముఖ్య సరిహద్దుగా ఉన్నది ఇక్కడ నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. ముందస్తు తనిఖీలు, రైతులకు అవగాహన కల్పించడం, డీలర్స్ కు అవగాహన కల్పించడం, సరిహద్దు లలో పటిష్టమైన నిఘా తో నకిలీ విత్తనాలు నివారించాలని ఎస్పీ అన్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి చైతన్య పరచాలని, గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్నవారి పై నిఘా ఉంచాలని ఆదేశించారు. రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి పోలీసు వారికి, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.