- సైన్యాన్ని చూసి వణికిపోయిన బాధితులు
- పోల్చుకోలేక వదిలిపెట్టమని ప్రాధేయపడిన ఇల్లాలు
- బాధితులకు అండగా ఉంటామన్న హోంమంత్రి
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సవిూప బైసరన్ లోయలో సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ముష్కరులు మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడులు చేయడంతో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రూరమైన దాడిలో బయటపడిన బాధితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఉగ్రదాడి సమాచారం అందుకున్న సైనికులు ఘటనా స్థలానికి వెళ్లి.. వారిని రక్షించడానికి ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న పర్యటకులు.. వారు కూడా ఉగ్రవాదులే అనుకొని భయంతో వణికి పోయారు. సైనికుల దుస్తుల్లో రావడం వల్ల పర్యాటకులు ముందుగా ప్రమాదాన్ని గుర్తించలేదు. అందుకే సాయం చేయడానికి వచ్చిన అసలు భారత సైపనికులను చూసి కూడా వణికిపోయారు. ఉగ్రవాదులు మళ్లీ ఆర్మీ దుస్తుల్లో తమపై దాడి చేయడానికి వచ్చారేమో అనుకొని సైనికులను చూసిన ఓ మహిళ తన చిన్నారిని ఏవిూ చేయొద్దని బోరున విలపిస్తూ.. చేతులు జోడించి వారిని వేడుకుంది. ఇతర పర్యటకులు కూడా భయంతో తమ పిల్లలను దాచడానికి ప్రయత్నించారు. ఓ సైనికుడు వారికి ధైర్యం చెప్తూ.. తాము భారత ఆర్మీ నుంచి.. మిమ్మల్ని రక్షించడానికే ఇక్కడికి వచ్చామని భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ విూడియాలో వైరల్‌గా మారాయి. ఉగ్రవాద దాడిలో తన భర్త మరణాన్ని చూసి షాక్‌కు గురైన ఆ మహిళ అందులో నుంచి బయటకు రాలేకపోతున్నారని.. ఆ బాధలో రోదిస్తూనే ఉన్నారని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. కశ్మీర్‌లో పౌరులపై జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడుల్లో ఇది ఒకటి.






పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ’లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ’ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ మారణహోమానికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దుండగులు అతి సవిూపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్‌కు చేరుకున్నారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.