- విశాఖలో 99 పైసలకే ఎకరం ఎలా ఇస్తారు
- తెరపైకి లోకేశ్ బినావిూల డొల్ల కంపెనీలు
- భూ పందేరాలపై విచారణ చేయించాలి
- వైఎస్సార్‌సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి
విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్‌కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఆయన బినావిూలే సూత్రధారులని వైఎస్సార్‌సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విూడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను సృష్టించి, వాటికి ప్రభుత్వం ద్వారా కారుచౌకగా విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెబుతున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోందన్నారు. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. గత వారం రోజులుగా దీనిపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ డొల్ల కంపెనీ హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో రెండు నెలల కిందటే రిజిస్టర్ అయ్యింది. అటువంటి కంపెనీకి 56 ఎకరాల భూమిని కట్టబెడతారనే దానిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అవినీతిపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, దీనిపై రాష్ట్రంలోని ఒక్క మంత్రి కూడా ధైర్యంగా ప్రజల ముందకు వచ్చి వివరణ ఇవ్వలేదన్నారు. ఇద్దరు డైరెక్టర్లు తప్ప ఒక్క ఉద్యోగి కూడా లేని ఈ కంపెనీకి ఎకరం రూ.50 కోట్ల విలవైన భూములు, అంటే దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇటువంటి సూట్‌కేస్ కంపెనీలను పెద్ద ఎత్తున రిజిస్టర్ చేయించడం, వాటికి కారుచౌకగా ఖరీదైన భూములను కట్టబెట్టించడం చేయిస్తున్నారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ప్రభుత్వమే బినావిూలను ముందు పెట్టి, ఆస్తులను దోచేస్తోందని ఆరోపించారు.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే టీసీఎస్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. తరువాత కోవిడ్ కారణంగా టీసీఎస్ ఏపీకి రావడం ఆలస్యం అయ్యింది. 2022లో టీసీఎస్‌కు చెందిన చంద్రశేఖరన్ ఏపీకి వచ్చి ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. తరువాత ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిరది. టీ-సీఎస్‌తో ప్రభుత్వ సంప్రదింపులు కొనసాగాయి. టీ-సీఎస్‌కు విశాఖలో 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే విక్రయిస్తూ కూటమి ప్రభుత్వం ఈనెల 21వ తేదీన జీవో జారీ చేసింది. ఈ భూముల విలువ వేలకోట్ల రూపాయలు ఉంటుంది. కనీసం వాటి మార్కెట్ విలువపై కొంతశాతం తగ్గించి విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేదని అన్నారు. అలా కాకుండా 99 పైసలకు విక్రయించడం చూస్తే, దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రజాసంపదను ప్రైవేటు- సంస్థలకు ఇచ్చే సమయంలో ప్రోత్సహాకరంగా విధానాలు ఉండాలే తప్ప, పూర్తిగా ఉచితంగా దారాదత్తం చేసేలా ఏ ప్రభుత్వమైనా వ్యవహరిస్తుందా అని ప్రశ్నించారు. ఈ కేటాయింపులను ప్రశ్నిస్తే, పరిశ్రమలను, ఐటీ సంస్థలను అడ్డుకుంటున్నారని మాపైన దుష్పచ్రారం చేస్తున్నారని వెంకట్ రెడ్డి అన్నారు.
ఉర్సా ప్రతినిధిలు పెందుర్తి విజయ్‌కుమార్, ఆయన కుమారుడు పెందుర్తి కౌశిక్, మరో వ్యక్తి అబ్బూరి సతీష్. వీరు అమెరికాలోని తన సొంత ఇంట్లో ఒక కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీని చూపించి ఇటీవల దావోస్‌లో తెలంగాణలో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ ఎంఓయు చేసుకున్నారు. తరువాత ఎపీలో కూడా ఇదే తరహాలో మరో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ స్కామ్‌ను నడిపించారు. గతంలో ఐఎంజీ భారత్ పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బిల్లీరావుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ఏరకంగా ప్రయత్నించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా ఉర్సా సంస్థను తెరవిూదికి తీసుకువచ్చారని ఆరోపించారు. డొల్ల కంపెనీలకు విలువైన భూములను దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? వైఎస్సార్‌సీపీ హయాంలో అనేక కంపెనీలను ప్రోత్సహించాం, విూలా ఉచితంగా భూములను ధారాదత్తం చేయలేదన్నారు. . తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి విశాఖలో 161 స్టార్ట్ అప్ ఐటీ- కంపెనీలు ఉంటే, వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా 425 కంపెనీలు ఏర్పాటయ్యాయి. తెలుగుదేశం దిగిపోయే నాటికి ఐటీ- ఉద్యోగులు ఏపీలో 27643 మంది ఉంటే వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో 75,551 మందికి పెరిగారు. మేం అడ్డుకునే వారిమే అయితే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కంపెనీలు ఎలా పెరిగాయి, ఉద్యోగులు ఎలా పెరిగారు? ఉర్సా, లులూ వంటి సంస్థలకు కారుచౌకగా భూములను కట్టబెట్టడం ద్వారా, పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం అని అన్నారు.