- 14 రోజుల రిమాండ్ చంచల్‌గూడ జైలు కు తరలింపు
- మోకిలా పిఎస్ లో ఫిర్యాదు నేపథ్యంలో, యుపీలో అఘోరీ ని అరెస్టు చేసిన పోలీసులు
ఓ మహిళను చీటింగ్ చేసిన కేసులో అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరికి చేవెళ్ల కోర్డు14 రోజుల రిమాండ్ విధించింది. మోకిలా సీఐ వీరాబాబు వివరాల ప్రకారం.. శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అలియాస్ అఘోరి మాత (28) గతంలో చెన్నై, ఇండోర్‌లలో లింగ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు.ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా తనను తాను ఆధ్యాత్మిక దేవిగా ప్రచారం చేసుకుంటూ… పూజలు,మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాడు. ఇందులో భాగంగానే శంకర్ పల్లి మండలం ప్రొద్దటూరులోని ప్రగతి రిసార్ట్స్ లో నివాసం ఉంటున్న మహిళ(సినీ నిర్మాత)తో సోషల్ మీడియా ద్వారా స్నేహం పెంచుకున్నాడు. తనను ఒక ఆధ్యాత్మిక రక్షకుడిగా చూపిస్తూ ఆమెను ప్రభావితం చేసి.. ఆమె కుటుంబాన్ని దుష్ట శక్తుల నుంచి రక్షించేందుకు తంత్ర పూజలు చేయాల్సిన అవసరం ఉందని నమ్మబలికాడు. ఈ నెపంతో అతను మొదట రూ.5 లక్షలు, ఆ తర్వాత బెదిరింపుల ద్వారా మరో రూ. 4.80 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత బాధితురాలిని మరోసారి కత్తులు, తుపాకీలతో బెదిరించి మరో రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. అంతేకాదు తాంత్రిక శక్తులతో ఆమెను చంపేస్తానని హెచ్చరించాడు. భయపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో చీటింగ్, బెదిరింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఇందులో భాగంగానే ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. నిందితుడిని మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసి.. బుధవారం విచారణ కోసం తీసుకొచ్చారు. నార్సింగి ఏసీపీ ఆఫీసుకు తీసుకొచ్చారు. అక్కడ దాదాపు 5 గంటల పాటు విచారించిన పోలీసులు.. అతడి వద్ద నుంచి రూ.5,500, హ్యుందాయ్ ఐ20 కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ టెస్టులు చేయించి.. చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముంది హాజరు పరిచారు.విచారించిన న్యాయమూర్తి నిందిడుడికి 14 రోజుల రిమాండ్ విధించారు.దీంతో పోలీసులు అఘోరిని చంచల్ గూడా జైలుకు తరలించారు.
అయితే తన వెంట తన భార్య వర్షిణీని సైతం పంపాలని అఘోరి మాత తెగ గొడవ చేసిందని తన వెంట రాక పోతే జైల్లో ఆత్మార్పణం అంటూ బెదిరించినా పోలీసులు బెండు తీస్తామని చెప్పడంతో మాతకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అరెస్టు, రిమాండ్, జైల్ కి తరలింపు చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే పదికి పైగా కేసులు ఉన్న మాతను కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే తాను చేసిన మోసాలు బయటపడుతాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అతనిపై పెట్టిన కేసుల నుండి ఇప్పుడిప్పుడే బయట పడటం కూడా సాధ్యం కాదని అంటున్నారు. ఇక వర్షిణీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని, ఆమె కోరిక మేరకు అయితే తల్లిదండ్రులకు, లేదా హోంకి తరలిస్తామని తెలిపారు.