Friday, April 25, 2025
spot_img

గ్రామాలు స్వయం ప్రతిపత్తి సాధించాలి

Must Read
  • గాంధీ మహాత్ముడి ఆశయం కూడా అదే
  • పంచాయితీ నిధులు వాటికే ఖర్చు చేస్తున్నాం
  • జాతీయ పంచాయితీరాజ్‌ దినోత్సవంలో డిప్యూటి సిఎం పవన్‌

గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని గాంధీజీ చెప్పేవారని, తాను నగరాల్లో ఉన్నా.. పల్లెల్లో ఉండాలనే కోరిక ఉండేదని డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకం అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు వాటికే ఖర్చు చేయాలని చెప్పానని.. అలాగే అమలు చేస్తున్నానని అన్నారు. ఈ విషయంలో తనకు సహాయ సహకారాలు అందిస్తున్న శశిభూషణ్‌, కృష్ణ తేజ , ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవ సభ గురువారం అమరావతి లోని సికె కన్వెన్షన్‌ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పవన్‌ కళ్యాణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రావిూణాభివృద్ధిని చూపిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, మౌలిక వసతుల కల్పన వంటి పురోగతిని పవన్‌కు అధికారులు వివరించారు. అంతకుముందు కార్యక్రమంలో పహెల్గామ్‌ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ అందరూ మౌనం పాటించారు.

అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన సందర్భంగా తాను పంచాయతీ రాజ్‌ శాఖను ఇష్టంగా ఎంచుకున్నానని చెప్పారు. నేడు గ్రామాల్లో రోడ్లు, నీరు, ఇతర మౌలిక వసతులు కల్పించడంలొ కీలక పాత్ర వారిదేనన్నారు. ఈ అభివృద్ధి పనులకోసం నగలు తాకట్టు పెట్టి పనులు చేశారని, నిధులు రావడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. దీని వల్ల కాంట్రాక్టర్‌లకు బిల్లులు ఇవ్వలేక పోయామన్నారు. త్వరలో నిధులు వస్తాయని… అందరికీ బిల్లులు చెల్లిస్తామని పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇస్తున్నామన్నారు. పంచాయతీల వ్యవస్థ బలోపేతం చేయడం కోసం తొలుత అధ్యయనం చేశానని, సిఫార్సులు, డబ్బులు లేకుండా బదిలీ ఉండదనే అభిప్రాయం ఉందన్నారు. ఎవరూ పైరవీలు చేయవద్దని తన పేషీ నుంచి ఆదేశాలు స్పష్టంగా ఇచ్చానని చెప్పారు. ఈసారి అన్ని స్థాయిల్లో అవినీతి లేకుండా బదిలీలు జరిగాయన్నారు. తాను సమర్ధవంతంగా పని చేసే అధికారులను వెతికి పట్టుకున్నానని, గతంలో నిర్ల‌క్ష్యానికి గురి కాబడిన వారిని గుర్తించి ప్రతిభ ఆధారంగా పోస్టింగ్‌ ఇచ్చానని చెప్పారు. తనకు అనేక రూపాల్లో సిఫార్సులు వచ్చినా తాను నిబంధనల ప్రకారం వెళతానని చెప్పి అమలు చేశానన్నారు. కొన్ని గ్రామాలు వర్గ పోరు, కులాలపోరు వల్ల నష్టపోయాయని, కూటమికి చెందిన సర్పంచ్‌లు లేకపోయినా.. మేము ప్రజలకోసం ఆలోచన చేశామన్నారు.

పంచాయతీ సర్పంచ్‌, ఎంపిటిసి, జడ్పీటీసీ, ఎంపిపిలకు ఇచ్చే మర్యాద, గౌరవం ఇచ్చామని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి నిధులు కూడా మళ్లించిందని, రూ. 1120 కోట్లు మన ప్రభుత్వం వచ్చాక పంచాయతీల అభివృద్ధికి వినియోగించామని పవన్‌ చెప్పారు. 100 నుంచి పది వేలు, 250 నుంచి 25 వేలు పంచాయతీల కు పెంచామన్నారు. ఉపాధి హావిూ పధకంలో కూలీ అనే పదం వాడకూడదన్నారు. గ్రామాల అభివృద్ధికి వాడే శ్రామికులు అంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు కూడా దీనిపై ఆలోచన చేయాలని, నరేగా శ్రామికులు గానే ఇక నుంచి అందరూ పిలవాలని, ఉపాధి శ్రామికులకు వంద రోజుల పనికల్పించామన్నారు. గ్రామ సభల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి పనులు చేశామని, రూ. 10,690 కోట్లు తొమ్మిది నెలల పాలనలో ఖర్చు చేసి గ్రామాలు అభివృద్ధి చేశామన్నారు. రూ. 1005 కోట్లతో గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి చేశామన్నారు. ఏపీ అభివృద్ధిలో పంచాయతీ రాజ్‌ శాఖ పని తీరు చాలా కీలకమని, ఉద్యోగులు, సిబ్బందికి మేము ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. గ్రావిూణాభివృద్ధిలో మోదీ, చంద్రబాబు నాయకత్వంలో మన ఎపి 24వ స్థానం నుంచి రెండో స్థానంలోకి వచ్చిందన్నారు. చిత్తశుద్ధితో పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయ నేందుకు ఇదే నిదర్శనమన్నారు.

గ్రామాల్లో కలప మొక్కలు పెంచాలని నిర్ణయించామని, ఎపిలో నాలుగో వంతు ఉన్న దేశాల్లో కలప ప్రధాన ఆదాయ వనరుగా ఉందన్నారు. ఏపిలో కూడా కలప పెంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నారు. గ్రామాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడంతో పాటు, ఆదాయం కూడా వస్తుందని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ ఈ దిశగా ఆలోచన చేయాలని సూచించారు. స్వర్ణంధ్ర, ఆత్మ నిర్భర్‌ భారత్‌ సాధించేలా అందరూ కలిసి నడవాలని పిలుపిచ్చారు. చాలా ప్రాంతాల్లో పాఠశాలలకు ఆట స్థలాలు లేవని, రైల్వే కోడూరులో ఒక గ్రామంలో ఆట స్థలం కొని ఇవ్వాల్సి వచ్చిందన్నారు. చాలా గ్రామాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, గ్రామాల్లో అసలు ఎంత భూమి ఉంది… ఎవరెవరు స్వాధీనం చేసుకున్నారో తేల్చలని అధికారులకు సూచించారు. ఎటువంటి రాజకీయ పక్షాల అడ్డంకులు ఉన్నా తనకు చెప్పాలన్నారు. అన్ని గ్రామాల్లో స్థలాల వివరాలు తనకు అందించాలి పవన్‌ కల్యాణ్‌ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Latest News

ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వెతికి శిక్షిస్తాం

వారికి మద్దతు ఇస్తున్న వారిని సైతం వదలబోం కలలో కూడా ఊహించని విధంగా శిక్ష వేస్తాం వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే బీహర్‌ పర్యటనలో ప్రధాని మోడీ ఘాటు హెచ్చరిక ఉగ్రవాది...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS