Saturday, July 5, 2025
spot_img

రీమ్యాక్స్ పేరుతో రియల్ మోసగాళ్లు..

Must Read
  • పలు రకాల పేర్లతో కంపెనీల ఏర్పాటు..
  • హైదరాబాద్‌, పీలోనూ బ్రాంచీల ఏర్పాటు..
  • భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తూ ఆకట్టుకుంటారు..
  • అధిక వడ్డీ ఆశచూపి ప్రీ లాంచ్ మోసాలు..
  • ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి..? నిఘా సంస్థలు నిద్రబోతున్నాయా..?
  • ఇంత విచ్చలవిడిగా మోసాలకు పాల్పడుతున్న వీరి వెనుక ఎవరున్నారు..?
  • పొంతనలేని వ్యాపారాలు.. అంతం లేని దోపిడీలు..
  • ఏ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఉండవు.. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో మభ్య పెడతారు..
  • రీమ్యాక్స్ కంపెనీపై ఫిర్యాదు చేసిన ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ ఎన్. బాలకృష్ణ..

జరిగే మోసాలు జరిగిపోతూనే ఉన్నాయి.. కళ్ళముందు కనిపిస్తున్నది సుడిగుండం అయినా నిశ్చలంగా ఉన్న సరస్సు అని భావిస్తున్నారు అమాయకులు.. వెనుకా ముందు ఆలోచించకుండా అందులో దూకేస్తున్నారు.. తీరా పీకల్లోతు మునిగిపోయాక ఏదైనా ఆధారం దొరుకుతుందేమో..? అని వెతుకుతారు.. క్షణాల్లో నిండా మునిగిపోతారు.. ఇది ప్రస్తుతం జరుగుతున్న భయంకర వాస్తవం.. ఎవరెన్ని జాగ్రత్తలు చెప్పినా.. ఎన్నెన్ని ఉదాంతాలు వెలుగులోకి వస్తున్నా.. ఎన్నెన్ని సంఘటనలు కలిచివేస్తున్నా.. మార్పు రావడంలేదు.. సగటు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మనిషికి నిజాల కంటే ఎక్కడో కనిపిస్తున్న ఆశ అనేదే లాగేస్తూ ఉంటుంది.. తమ కలలు నిజాలవుతాయి అన్న నమ్మకమే బలంగా పనిచేస్తూ ఉంటుంది.. అందుకే ఎప్పుడూ వారు మోసపోతూనే ఉంటారు.. అగాధంలోకి జారిపోతూనే ఉంటారు.. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూనే ఉంటారు.. ఇలాంటి వారు ఉన్నంత కాలం మోసగాళ్లు రెచ్చిపోతూనే ఉంటారు.. పంజా విసురుతూనే ఉంటారు.. వికృతానందం పొందుతూనే ఉంటారు.. అక్రమాల ఇటుకలతో విలాసవంతమైన జీవన భవనాలు కట్టుకుని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు.. చట్టాలు, న్యాయస్థానాల్లోని లొసుగులే ఇలాంటి వారికి తిరుగులేని ఆయుధాలు.. అవినీతి రాజకీయ నాయకులు, లంచగొండి అధికారులు, గతితప్పిన సిస్టం వీరికి సైన్యంగా పనిచేస్తూనే ఉంటారు.. అలాంటి చరిత్రనే మీ ముందుకు తీసుకుని వస్తున్నాం.. ఇప్పటికైనా అమాయకుల్లో మార్పు వస్తుందనే నమ్మకంతో..

రీమ్యాక్స్ వరల్డ్ క్లాస్ రియాల్టీ, రీమ్యాక్స్ రియాలిటీ సొల్యూషన్స్, రీమ్యాక్స్ రియాలిటీ అడ్వైజర్స్, రీ మ్యాక్స్ సెంట్రల్, రీమ్యాక్స్ ఆంధ్ర ప్రదేశ్.. వినడానికి ఈ పేర్లు చాలా గొప్పగా, ఎవరికీ అర్ధంకానంత అద్భుతంగా కనిపిస్తున్నాయి కదూ..? అలాగే వినిపిస్తున్నాయి కూడా.. అయితే ఈ అద్భుతం వెనకాల అంతులేని దారుణాలు దాగివున్నాయి.. ఇలాంటి గమ్మత్తుగా ఉండే పేర్లతో రీమ్యాక్స్ అనే సంస్థ హైదరాబాద్ మహానగరంలో దాదాపు 10 బ్రాంచ్ లు.. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని బ్రాంచీలు ఏర్పాటు చేసింది.. ఇంతవరకు బాగానే ఉంది.. ఆకర్షణీయమైన పేర్లతో కంపెనీలు ఏర్పాటు చేసి నీతి నిజాయితీగా వ్యాపారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ సామాన్యులను, అమాయకులను టార్గెట్ చేస్తూ.. వారినే ఎక్కువుగా ఫోకస్ చేస్తూ.. నిర్దయగా తడిగుడ్డుతో గొంతులు కోస్తున్నారు.. అదే ఇప్పుడు అభ్యంతరకరమైన విషయం.. అందుకే మేము ఈ కంపెనీ మీద ఫోకస్ చేస్తున్నాం..

ఈ కంపెనీ యాజమాన్యం రీమ్యాక్స్ రియాలిటీ పేరుతో గొలుసు కట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు.. ఏ అంశంలోనూ వీరి వ్యాపారానికి, వీరు చెప్పే మాటలకు, వీరు చూపించే వివరాలకు, వీరు ప్రదర్శించే బ్రోచర్లకు, అడ్వర్టైజ్ మెంట్లకు ఎలాంటి పన్థాన ఉండదు.. కేవలం మాయ చేస్తారు అంతే.. వీరికి సొంత లేఅవుట్ భూమి ఉండదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇతరులకు సంబంధించిన వెంచర్లల్లో భూములు మావే అని చెబుతూ వాటినే సామాన్య జనానికి చూపిస్తూ బురిడీ కొట్టించి అడ్డంగా మోసం చేస్తున్నారు..

అంతే కాకుండా భవిష్యత్తులో భారీ ప్రాజెక్టు చేయబోతున్నాం.. మీ పెట్టుబడికి అత్యధిక వడ్డీ రేటు ఇస్తాం అని నమ్మబలుకుతూ ఫ్రీ లాంచ్ పేరుతో నట్టేట ముంచుతున్నారు రీమ్యాక్స్ మోసగాళ్లు..

ఇదండీ ఈ మోసగాళ్లు చెబుతున్న కహానీలు.. వినడానికి ఎంత గొప్పగా ఉన్నాయి.. మనకు తెలియకుండానే వీరి వలలో చిక్కుకుని పోతాం.. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది..

కాగా సదరు రీమ్యాక్స్ కంపెనీపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చేశారు పోలీస్ అధికారులు.. ఎఫ్.ఐ.ఆర్. నెంబర్ :348/2025, తేదీ : 13-06-2025 కాగా 318(4), 336(3), 340(2) బీ, ఎన్. ఎస్. సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఈ కంపెనీ యాజమాన్యంపై ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ ఎన్. బాలకృష్ణ ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. దీనిమీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

కాగా ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఎన్, బాలకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఒకసారి చూస్తే.. ఆదిబట్ల మున్సిపల్ పరిధి లోని కొంగర‌ కలాన్ లో సర్వే నెం. 349/పీ, 350/పీ, 351/పీ, 352/పీ, 353/పీ, 354/పీ, 355/పీ లలో రీమ్యాక్స్ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ కంపనీ వారు.. డ్రీమ్ క్యాచ్ అపార్ట్‌మెంట్ పేరు మీద ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, అన్ని రకాల లాండ్ అలాట్‌మెంట్‌, నిర్మాణ అనుమతులు వున్నాయని మోసపూరిత మాటలు చెప్పి, ప్రీ లాంచింగ్ పేరుతో 40 లక్షల రూపాయల విలువ చేసే ప్లాట్ లను కేవలం రూ. 12 లక్షలకే అమ్మబడును అని నమ్మబలికి, వందలాది కస్టమర్ల నుండి కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని తెలిసింది. ఇట్టి విషయం నాకు గత వారం రోజుల కింద తెలియడంతో నేను ఈ విషయం గురించి ఆరా తీయగా ఈ యొక్క ప్రాజెక్టులకు సంబందించి బ్రజేష్ అనే వ్యక్తి భాద్యత వహించినట్లుగా వారి బ్రోచర్ లో పేర్కొన్నారు.. కానీ పైన పేర్కొన్న సర్వే నెంబర్ లలో గల స్థలం నందు, ఈ రోజు వరకు ప్రాజెక్ట్ కు సంబందించి ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు.. పైగా రీమ్యాక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయం నుండి కానీ, హెచ్.ఎం.డీ.ఏ. , రేరా నుండి కానీ ఎటువంటి ల్యాండ్ అలాట్ మెంట్, నిర్మాణ అనుమతులు పొందటం కానీ జరగలేదు. పైన పేర్కొన్న కంపెనీ వారు ఎటువంటి అనుమతులు పొందకుండానే, కస్టమర్లను మోసం చేసి డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో, ల్యాండ్ అలాట్ అయి అన్నీ
రకాల ప్రభుత్వ అనుమతులు వున్నట్లు నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్స్ ని సృష్టించి ప్రీ లాంచింగ్ పేరుతో కస్టమర్ల నుండి కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు తెలియ వచ్చినది.

కావున ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించాలని, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేనప్పటికీ, అన్నీ రకాల అనుమతులు వున్నట్లు ఫోర్జరీ డాక్యుమెంట్స్ ని సృష్టించి, ఫ్రీ లాంచింగ్ పేరుతో, సామాన్య ప్రజలు కూడా కొనొచ్చు అని నమ్మకం కలిగించి, వందలాది కస్టమర్ల నుండి కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేసిన రీమ్యాక్స్ కంపెనీ యాజమాన్యం పై చీటింగ్, ఫోర్టరీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోగలరు అని మనవి. అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకొంటారు..? వీరి చేతిలో మోసపోయిన అమాయకులకు ఎలాంటి న్యాయం చేకూరుస్తారు అన్నది వేచి చూడాలి..

సో రీమ్యాక్స్ సంస్థ వారు చేస్తున్న, చేయబోతున్న మోసాల పరంపరను వరుస కథనాలతో పూర్తి ఆధారాలతో సహా మీముందుకు తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS