- మాంచెస్టర్ వేదికగా నేటినుండి నాలుగో టెస్ట్
- ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో 1-2తో వెనుకంజలో నిలిచిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 11 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ వేదికగా టీమిండియా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడం కీలకం. ఓడినా.. డ్రా అయినా సిరీస్ గెలిచే అవకాశాలను టీమిండియా కోల్పోతుంది. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం కోసం టీమిండియా గత 18 ఏళ్లుగా నిరీక్షిస్తోంది. 2007లో చివరిసారిగా భారత్.. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. అయితే మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత్‌కు మెరుగైన రికార్డ్స్ లేవు. ఈ మైదానంలో భారత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఐదు మ్యాచ్‌లు డ్రా చేసుకొని నాలుగింటిలో ఓడిరది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే 89 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది.
1936లో మహరాజ కెప్టెన్సీలో భారత్ మాంచెస్టర్‌లో టీమిండియా తొలి మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి గెలవలేదు. నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా ఓటమిపాలైతే.. ఒకే వేదికగా 10 ప్లస్ మ్యాచ్‌లు ఆడి ఒక విజయం సాధించిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంటుంది. ప్రస్తుతం భారత్ మాంచెస్టర్‌తో పాటు బార్బోడస్ వేదికగా తొమ్మిదేసి మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయం సాధించలేదు. మరే జట్టు కూడా ఇలాంటి ఫీట్ నమోదు చేయలేదు. ఈ జాబితాలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక భారత్‌తో సమంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా.. కరాచీ వేదికగా 9 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడి 4 డ్రా చేసుకుంది. బంగ్లాదేశ్ డాకా వేదికగా 9 మ్యాచ్‌లు ఆడి ఏడిరటిలో ఓడి 2 డ్రా చేసుకుంది. బార్బోడస్‌లో భారత్ 9 మ్యాచ్‌లు ఆడి ఏడింటిలో ఓడి 2 డ్రా చేసుకుంది. మాంచెస్టర్‌లో భారత్ 9 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడటంతో పాటు ఐదింటిలో ఓటమి తప్పించుకుంది. శ్రీలంక లండన్ వేదికగా 9 మ్యాచ్‌లు ఆడి మూడింటిలో ఓడి 6 డ్రా చేసుకుంది.