దేశవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారిన వీధికుక్కల బెడదపై సుప్రీంకోర్టు మరోసారి స్పందించింది. వీధికుక్కల దాడుల వల్ల రేబిస్ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, గతంలో ఎనిమిది వారాల్లోపు వాటిని షెల్టర్లకు తరలించాలని జస్టిస్ పార్థివాలి, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ తీర్పుపై పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేసి, పునరాలోచించాలని కోరుతూ చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, ప్రజల భద్రతకూ, మూగజీవాల హక్కులకూ మధ్య సమతుల్యత అవసరమని స్పష్టం చేసింది. “సమాజంలో వీధికుక్కలకు ఆహారం పెట్టే జంతు ప్రేమికులు ఉన్నారు, అదే సమయంలో వాటిని చూసి భయపడే ప్రజలు కూడా ఉన్నారు. ఇరువర్గాల భావాలను పరిగణనలోకి తీసుకున్న హేతుబద్ధ పరిష్కారం అవసరం” అని సీజేఐ వ్యాఖ్యానించారు.
వీధికుక్కల దాడులు, ముఖ్యంగా పిల్లలపై జరిగే ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, కానీ విచక్షణారహితంగా వాటిని చంపడం పరిష్కారం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడంలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని గుర్తుచేసింది. మానవ-జంతు సంఘర్షణలా కాకుండా, ఇరువురికి ఆమోదయోగ్యమైన మార్గాన్ని అన్వేషించాలని కోర్టు సూచించింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా పరిశీలన కొనసాగిస్తామని తెలిపి, విచారణను వాయిదా వేసింది.