14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ఈమని శివనాగిరెడ్డి
ద్రవిడ భాషల్లో తెలుగే ప్రాచీనమని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్ లో నిర్వహించిన 14వ తెలుగు సాహితి సదస్సులో ఆదివారం నాడు ‘తెలుగు భాష ప్రాచీనతకు శాసనాలే ఆధారాలు’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. సా.శ.పూ. 3వ శతాబ్ది కి చెందిన భట్టిప్రోలు రాతి బుద్ధదాతుపేటిక ప్రాకృత శాసనంలో ఉన్న అనేక వ్యక్తుల పేర్లు తెలుగులో ఉన్నాయని, అవి శాసనాల్లోకి ఎక్కాయంటే అంతకుమునుపే ఆ భాష వాడుక భాషగా ఉండేదని, తద్వారా తెలుగు ప్రాచీనత ఇప్పటికి 2500 సంవత్సరాలు పూర్వానికి వెళుతుందన్నారు.
తన ప్రసంగంలో ఆ తర్వాత వెలువడిన సా.శ.పూ. రెండోవ శతాబ్ది కొత్తూరు, కోటిలింగాల నాణేలు, సా.శ.1వ శతాబ్ది అమరావతి, ధూళికట్ట, నాగార్జునకొండ విజయ శాతకర్ణి శాసనాలు,సా.శ. 3వ శతాబ్ది నాగార్జునకొండ అడివి శాంతసిరి శాసనం,సా.శ.4వ శతాబ్ది కొండముది,సా.శ.5వ శతాబ్ది విష్ణుకుండినుల కీసరగుట్ట, తుమ్మలగూడెం శాసనాలు, సా.శ.6వ శతాబ్ది తొట్ట తొలి పూర్తి నివిడి గల రేనాటి చోళ ఎరికల్ ముత్తురాజు ధనుంజయని కలమల్ల శాసనంలో తెలుగు పదాల, క్రమవికాసాన్ని శివనాగిరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రముఖ సిని మాటల రచయిత బుర్ర సాయి మాధవ్, తానా పూర్వ అధ్యక్షుడు డా.తోటకూరి ప్రసాద్, ప్రముఖ సాహితీవేత్త కాత్యాయనీ విద్మహే శివనాగిరెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వంగూరి ఫౌండేషన్ చైర్మన్ వంగూరి చిట్టెంరాజు, హోస్టన్ తెలుగు సాహితీ సమితి అధ్యక్షులు తిప్పిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి శివనాగిరెడ్డిని సత్కరించారని ఆయన చెప్పారు.