- పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
- జలదిగ్భందంలో పలు గ్రామాలు
- ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న జంపన్న వాగు
- అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు
- సహయక చర్యల్లో అధికారులు, ఎన్‌డీఆర్ఎఫ్
తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనాన్ని దెబ్బతీశాయి. బుధవారం రాత్రి నుంచి కొనసాగుతున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగిపొర్లుతూ రహదారులను ముంచెత్తుతున్నాయి. పలు గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షపాతం తీవ్రంగా ఉండటంతో జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలోని మేడారం వద్ద వంతెనను ఆనుకొని వరద ప్రవాహం కొనసాగుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మేడారం-ఎటురునాగారం రహదారి పై వాహన రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి.
అదేవిధంగా మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. కొండప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కిందివాగుల్లోకి చేరడంతో వరద మరింత ఉధృతమవుతోంది. తక్కువ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అప్రమత్తమై వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ములుగు జిల్లాలో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని మోహరించారు. ముంపు పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా వర్షాలు రోడ్లను చెరువుల్లా మార్చేశాయి. మల్కాజిగిరి, కూకట్‌పల్లి, మియాపూర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయి గంటల తరబడి జామ్‌లు ఏర్పడ్డాయి. ఇక వాతావరణ శాఖ హెచ్చరించింది – వచ్చే 48 గంటల్లో కూడా తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం వర్ష బీభత్సంతో అల్లకల్లోలంగా మారగా, అధికారులు వరద ప్రభావం తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పిలుపునిస్తున్నారు.