తెలంగాణ వరదలపై బండి సంజయ్ ఆందోళన
తెలంగాణలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వరద పరిస్థితి మరింత విషమించింది. సహాయక చర్యల కోసం అవసరమైన ఆర్మీ హెలికాప్టర్లు ఆలస్యమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగారు. బండి సంజయ్ రక్షణ శాఖ ఉన్నతాధికారులను ఫోన్‌లో సంప్రదించి, వరదల తీవ్రత, సహాయక చర్యల తక్షణ అవసరాన్ని వివరించారు. దీనికి స్పందించిన రక్షణ శాఖ అధికారులు, “హెలికాప్టర్లు సిద్ధంగానే ఉన్నా, ప్రతికూల వాతావరణం కారణంగా బయలుదేరలేకపోతున్నాయి. ముఖ్యంగా మేఘగర్జనలు, దట్టమైన మబ్బులు, బలమైన గాలులు అడ్డంకిగా మారాయి” అని తెలిపారు.
అయితే, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నామని, మహారాష్ట్రలోని నాందేడ్, కర్ణాటకలోని బీదర్ వైమానిక స్థావరాల నుంచి హెలికాప్టర్లను పంపే ప్రయత్నం జరుగుతోందని అధికారులు బండి సంజయ్‌కు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్, ఎస్సారెస్పీ, మానేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయని వివరించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తోడ్పడేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. వరద ప్రభావం దృష్ట్యా వీలైనంత త్వరగా హెలికాప్టర్లను పంపేలా చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖ అధికారులను ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణరక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలని బండి సంజయ్ స్పష్టం చేశారు.