కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించిన నిఘా వర్గాలు
మరికొన్ని నెలల్లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉగ్ర కలకలం రేగింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడినట్టు నిఘా సంస్థలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే బీహార్ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి కీలక పట్టణాలు, సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా పట్నా, గయా, భాగల్పూర్, ముజఫర్‌పూర్ వంటి ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉగ్రవాదులు రాష్ట్రాన్ని టార్గెట్ చేయవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ధార్మిక ప్రదేశాలు, రాజకీయ సభలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. నిఘా సంస్థలు అందించిన వివరాలను బట్టి, ఉగ్రవాదుల కదలికలపై అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద చలనం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.