జిన్‌పింగ్‌తో కీలక సమావేశం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెలాఖరులో చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు రెండు రోజులపాటు ఆయన చైనాలో ఉంటారు. ఈ సందర్భంగా టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. పర్యటన మొదటి రోజే, అంటే ఆగస్టు 31న ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ నేపథ్యంలో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని మోదీ చైనా పర్యటించడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటి సారి. 2018లో చివరిసారి ఆయన అక్కడికి వెళ్లారు. అనంతరం 2019లో జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించారు. అయితే, 2020లో లద్దాఖ్ సరిహద్దులో భారత్-చైనా సైనికుల ఘర్షణలతో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తర్వాత నిరుడు అక్టోబర్‌లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ-జిన్‌పింగ్ భేటీతో ద్వైపాక్షిక చర్చలు తిరిగి మొదలయ్యాయి. ఇటీవల ఇరుదేశాలు విమాన సర్వీసులు, కైలాస్ మానసరోవర్ యాత్రను పునరుద్ధరించేందుకు అంగీకరించడం, సంబంధాల మెరుగుదలకు సంకేతంగా భావిస్తున్నారు.