Friday, September 27, 2024
spot_img

సింగరేణి విశ్రాంత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలి

Must Read

భారతదేశంలో అత్యధిక వృద్ధి రేటుతో పాటు అధిక లాభాలు గడుస్తున్న సంస్థలలో సింగరేణికే ప్రథమ స్థానం దక్కుతుంది. దీనికి కారణం కార్మికుల కాయకష్టమే. ఊపిరాడని స్థితిలో,విష వాయువులు, అధిక ఉష్ణోగ్రత ఉన్న భూగర్భ,ఓపెన్ కాస్ట్ గనుల్లో పని చేసిన కార్మికులకు ఉచిత గృహ వసతి,ఉచిత గ్యాస్, ఉచిత కరెంటుతో పాటు ఎన్నో ప్రోత్సాహకాలు లాభాల వాటా, బోనస్ లాంటివి లభించడం వలన దర్జాగా బ్రతుకుతున్నారు. కానీ ఆనాడు దర్జాగా బ్రతికిన విశ్రాంత కార్మికులు నేడు అతి తక్కువ పెన్షన్, ఆకాశానికి చేరుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా, కరువు భత్యం లేకపోవడం అత్యంత బాధాకరం. 1995 నుంచి 2022 సంవత్సరాల మధ్య ద్రవ్యోల్బణం రేటు 460.53% గా పేర్కొనబడింది. అంటే ఈ కాలాల మధ్య సగటు వార్షిక ద్రవ్యోల్బణం రేటు 6.59% అని తెలుస్తుంది. కానీ 26 సంవత్సరాల క్రితం ప్రవేశ పెట్టిన కోల్ మైన్స్ పెన్షన్ స్కీం ప్రకారం కనీస పెన్షన్ 350 రూపాయలుగా ప్రకటించబడింది. ఎన్నో ఆందోళనల ఫలితంగా మార్చి నెలలో కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుగా కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ వారు ప్రకటించారు. ఈ పెరుగుదల వలన రిటైర్డ్ కార్మికుడు, అతని భార్య ఆకలి తీరదు. పూట గడవని పరిస్థితులలో కుటుంబ పోషణ కొరకు వయస్సు,శరీరం అనుకూలించకున్నను, సూపర్వైజర్ స్థాయి ఉద్యోగులు కూడా అడ్డా కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. చేతకాని వారు బిచ్చగాడిగా సంచరించడం చూస్తే మనస్సు చివుక్కుమంటుంది. పెన్షన్ పెరుగుదల కొరకు విశ్రాంత ఉద్యోగ సంక్షేమ సంఘాలు చేసే సూచనలు, సలహాలను కోల్ మైన్స్ పెన్షన్ ఫండ్, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారు అమలు పరచుట లేదు. కోల్ మైన్స్ పెన్షన్ తీసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే ఆసరా పెన్షన్ రావడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ నికర లాభాలు 4701 కోట్ల రూపాయలు, ఇందులో 2,412 కోట్లలో 33 శాతం (796 కోట్లు) లాభాల బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివలన సగటున ఒక్కో కార్మికుడికి ఒక లక్ష తొంభై వేల రూపాయలు గత ఏడాది కన్నా ఇరవై వేల రూపాయలు అధికంగా చెల్లిస్తున్నారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఐదు వేల రూపాయలు బోనస్ గా ప్రకటించడంతో వారి సేవలు కంపెనీ గుర్తించడం గొప్ప పరిణామం. నూతన ఒరవడి, సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు సింగరేణి సంస్థ కానీ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య స్థితి,సామాజిక, ఆర్ధిక భద్రత కొరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.గుప్పెడు పెన్షన్ తో బిక్కు బిక్కు మంటు జీవిస్తున్న వీరికి సముచిత గౌరవం ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వారు 70,80 సంవత్సరాలు చేరుకోగానే బేసిక్ పై పది శాతం, ఇరవై శాతం పెరుగుదల ఉంది.కొన్ని చమురు రంగ సంస్థలు పదవి విరమణ ఉద్యోగులను సత్కరించేందుకు”రిటైర్డ్ ఎంప్లాయిస్ రికగ్నిషన్ స్కీం” ప్రారంభించి వివిధ వయస్సులో ఉన్న విశ్రాంత ఉద్యోగులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ఇస్తున్నారు. కావున దేశానికి వెలుగునిచ్చిన సింగరేణి విశ్రాంత బొగ్గు గని కార్మికుల త్యాగాలను గుర్తించి అతి తక్కువ పెన్షన్ తో జీవిస్తున్న వారి కుటుంబాలలో పండుగలలో పస్తులు ఉండకుండా వీరికి కూడా కొద్దో గొప్పో ఆర్థిక ప్యాకేజిని “అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం” జరుపునే అక్టోబర్ ఒకటో తేదీ నాడు ప్రకటించి సింగరేణి రిటైర్డ్ కార్మికులను ఆర్థికంగా ఆదుకుని గౌరవించాలి.

ఆళవందార్ వేణు మాధవ్
ఉప ప్రధాన కార్యదర్శి,సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం
8686051752,హైదరాబాద్

Latest News

నేడు తిరుమలకు జగన్

నేడు వైసీపీ అధినేత జగన్ తిరుమల వెళ్లనున్నారు. సాయింత్రం 04 గంటలకు రేణిగుంట నుండి రోడ్డు మార్గాన బయల్దేరి, రాత్రి 07 గంటలకు తిరుమల చేరుకుంటారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS