(తెలంగాణలోని సర్కారు బడుల్లో కంప్యూటర్, యోగా, క్రీడలకు శిక్షణ పేరుతో స్కెచ్)
- ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందిన సంస్థ
- సీఎస్ఆర్ ఫండ్ ద్వారా సర్వీస్ చేస్తామని బుకాయింపు
- ప్రతి స్కూల్ లో ఇద్దరి చొప్పున వాలంటీర్ల నియామకం
- నెల నెలా రూ.15 నుంచి 18వేలు వేతనమంటు బురిడీ
- నిరుద్యోగులకు ఉపాధి ఆశ చూపుతూ డబ్బులు డిమాండ్
- ఒక్కొక్కరి వద్ద సుమారు 1లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూల్..?
- జీతాల కోసం నెలకు రూ. 5 నుండి రూ. 6కోట్ల వరకు ఖర్చు
- రూ. 1 నుంచి రూ. 2 కోట్ల వరకు సంస్థ చెల్లింపులు
- మిగతాది డోనేషన్ల రూపంలో వసూల్ చేస్తామన్న ఫౌండర్ ఎండి బాబర్
- అక్రమ మార్గంలో రాబడి పొందాలనుకున్న గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ
‘కోటి విద్యలు కూటి కొరకే’ అంటారు పెద్దలు.. ఈ డైలాగ్ అందరికీ తెలిసిందే.. కానీ ‘కోట్లు సంపాదించేందుకు విద్య’ అని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఓ అపర మేధావి. ‘చదువుకున్నోడికన్నా పలానోడు మేలు’ అన్నట్టు ఇతగాడు చదువుకున్న తెలివినీ ఈ రకంగా వాడుకున్నాడు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శిక్షణ నైపుణ్యాలను అందిస్తామనే మాయ మాటలతో ప్రభుత్వాన్నే బురిడి కొట్టించాడు. రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో కంప్యూటర్ విద్య, ఇంటర్‌నెట్ సర్వీసెస్, యోగా, మెడిటేషన్, ఖోఖో, కబడ్డీ, ఫుట్‌బాల్ వంటి ఉచిత ట్రైనింగ్ ఇస్తామని అభ్యర్థన చేసుకోగా ప్రభుత్వ పాఠశాలలకు ఎంతోకొంత మేలు జరుగుతున్న ఉద్దేశంతో సర్కార్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ మెమో నెం. 253/prog.II/A2/2024, dt. 10-09-2024) జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారం పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ప్రొసిడింగ్ (నెం. Rc.No.1232/TSS/T4/2024) విడుదల చేశారు. ప్రభుత్వం ఇచ్చిన దుర్దుదేశంతో గ్లోబల్ ఫౌండేషన్ మోసానికి తెరలేపింది..
ప్రభుత్వం నుంచి అణాపైస మాకొద్దు అంటూ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఉచిత సేవలను పిల్లలకు అందిస్తామని చెప్పారు. తమ సంస్థకు కొందరూ డోనేషన్లు చేస్తారని చెప్పి బుకాయించాడు ప్రబుద్దుడు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ పాఠశాలలో వాలంటీర్ల రిక్రూట్మెంట్ చేసుకుంటామని తెలిపింది. తమ సొంత నిధుల నుంచే వారికి నెల నెలా జీతాలు చెల్లించుకుంటామని నమ్మబలికాడు. అయితే ఒక్కో బడిలో ఇద్దరు చొప్పున తెలంగాణ అంతటా వాలంటీర్ల నియామకం చేపట్టింది. “అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు” అన్న చందంగా సర్కారు నుంచి అన్ని పర్మిషన్స్ తీసుకున్నాడు. అసలు ట్వీస్ట్ ఇక్కడే మొదలైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ. ఇదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద, మధ్య తరగతి పిల్లలకు ఏదైనా సేవ చేయాలనే పేరుతో కంప్యూటర్, ఇంటర్నెట్ సర్వీసెస్, యోగా, మెడిటేషన్, కబడ్డీ, ఖోఖో, ఫుట్ బాల్ వంటి వాటిపై ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయమై గవర్నమెంట్ ను కూడా అప్రోచ్ అయింది సదరు సంస్థ. అయితే ఇందులో ప్రభుత్వం నుంచి అణాపైస అక్కర్లేదు, సీఎస్ఆర్ ఫండ్ ద్వారా మేమే అన్ని సమకూర్చుకుంటాం, రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ లో ఇద్దరి చొప్పున వాలంటీర్లను నియమించుకొని వారి ద్వారా విద్యార్థులకు కోచింగ్ ఇస్తామని చెప్పింది. వారికి సంబంధించిన నెల నెలా జీతం కూడా తామే చెల్లించుకుంటామంటూ మాయదారి ముచ్చట్లు ఒళ్లించింది. ఇతర సంస్థల నుండి సేవ పేరుతో డోనేషన్లు తీసుకుంటామని సంస్థ ఫౌండర్ మహ్మద్ బాబర్ వెల్లడించారు. అసలు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్రీ కోచింగ్ ఎలా సాధ్యం.. ఇతగాడికి ఏం లాభం.. ఇతగాడికి అంతలా ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది.. ఇతనికి ఉన్న ఆదాయ సంస్థలు ఏంటి..? ప్రభుత్వ బడిలో ట్రైనింగ్ ఇస్తే ఒరిగేదేంటి అని ఆరా తీస్తే… సీన్ కట్ చేస్తే భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ద్వారా వాలంటీరీలకు చెల్లించే నెలవారి జీతాల ఖర్చు దాదాపు రూ. 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఉంటుంది. ఈ సంస్థకు ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం ఎలా సమకూరుతుంది. సంస్థ సొంతంగా సుమారు రూ. కోటి నుండి రూ. 2 కోట్ల వరకు వెచ్చిస్తుందని ఫౌండర్ ఎం.డి బాబర్ తెలిపాడు.. మిగతాది డోనేషన్ల రూపంలో ఇతరత్రా సంస్థల నుండి సేకరిస్తామని ఆదాబ్ ప్రతినిధికి తెలిపారు.
ప్రభుత్వం నుంచి అణాపైస అక్కర్లేదు అంతా తామే చూసుకుంటామన్నప్పుడే వీళ్ల రంగు బయటపడింది. ఇదేలా అనే కోణంలో ఆలోచించిన ఓ జిల్లా విద్యాశాఖ అధికారి అసలు విషయం పసిగట్టాడు. గ్లోబల్ సంస్థ ఆడుతున్న నాటకాలను ఎండగట్టి.. గవర్నమెంట్ ఇచ్చిన అనుమతులను సదరు జిల్లాలో నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఆదాబ్ సేకరించిన వివరాలు చూస్తే.. గ్లోబల్ పౌండేషన్ సంస్థ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్, ఆటలు ఉచిత ట్రైనింగ్ అని చెప్పి భారీ మోసానికి తెర లేపింది. ప్రతి బడిలో ఇద్దరు వాలంటీర్లను నియమించుకునే క్రమంలో వాళ్ల వద్ద నుంచి దాదాపు రూ.1లక్ష నుంచి 2లక్షల వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సీఎస్ఆర్ ఫండ్ ద్వారా నిధులు సమకూర్చుకోని ఉచిత సేవలు అందిస్తామని సదరు సంస్థ ఇతర ఇతరత్రా సంస్థల ద్వారా భారీగా డబ్బులు రాబట్టుకున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి పొందిన పర్మిషన్ చూపెడుతూ అక్రమ మార్గాల ద్వారా కోట్లల్లో ఫండ్ సమకూర్చుకోవాలనే దురుద్దేశంతో ఈ కొత్త వ్యవహారానికి తెరలేపినట్లు తెలుస్తుంది.. గవర్నమెంట్ సాక్షిగా పేదలకు ఉచిత విద్య పేరుతో అమాయకులకు టోకరా పెట్టినట్టు తేలింది. ఈ సంస్థ సేవ పేరుతో అమాయకులను, ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు నయా దందాకు తెరలేపినట్లు తేటతెల్లం అవుతుంది. గ్లోబల్ ఫౌండేషన్ సంస్థపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా, ఈ సంస్థను నమ్మి.. మోసపోవద్దని పలువురు మేధావులు హెచ్చరిస్తున్నారు.