- ఎంపీ ధర్మపురి అరవింద్
- రైతు హామీల సాధన కోసం ధర్నాచౌక్ వద్ద భాజపా పార్టీ ప్రజా ప్రతినిధుల దీక్ష
- కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసింది
- ముస్లింలను ఒకలా, హిందువులను మరోలా చూస్తున్నారు
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు రుణమాఫీలేదు, రైతు భరోసా లేదు
- ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేదు
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 1000 మందిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
- రైతుల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- రుణమాఫీ పూర్తిగా సాధ్యం కాదని తెలిసిన కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చారు
- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే పూర్తిగా అమలు చేశారు : ఎంపీ ఈటెల రాజేందర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 1000 మందిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని భాజపా శాసనసభ పక్షనేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సోమవారం రైతు హామీల సాధన కోసం భాజపా పార్టీ ప్రజా ప్రతినిధులు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, గోడెం నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్వాయి హరీశ్‌బాబు దీక్షలో కూర్చున్నారు.
ఈ సంధర్బంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రుణమాఫీ పూర్తిగా సాధ్యం కాదని తెలిసిన కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదని, ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. కేవలం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే పూర్తిగా అమలు చేశారని, రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని అన్నారు. రూ.లక్ష రుణమాఫీకి రూ.24 వేల కోట్లు అవసరం ఉంటే, కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు.
అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, ఇప్పుడు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని మండిపడ్డారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేత అయినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఎన్నో స్కాములను,అవినీతిని బట్టబయలు చేశారని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో కేవలం పేదల ఇళ్లను మాత్రమే కులుస్తున్నారని ఆరోపించారు. ముస్లింలను ఒకలా, హిందువులను మరోలా చూస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం హిందువుల ఇళ్లను మాత్రమే హైడ్రా కూలుస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు రుణమాఫీలేదు,రైతు భరోసా లేదని వ్యాఖ్యనించారు. ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేదని ఎంపీ అరవింద్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒక ఎకరానికి కోటి సంపాదిస్తున్నాడట, కోటి సంపాదన ఎలా సాధ్యమో తెలుసుకునేందుకు ప్రభుత్వం నుండి ఒక టీంను ఆయన ఫాంహౌస్‌కు కూడా పంపాలని కోరారు. పరిశీలించడానికి రేవంత్ టీంను ఏర్పాటు చేయాలని తెలిపారు.
కేసీఆర్ అధికారం నుండి దిగిపోయాక ఆయన మాటలను చాలా మిస్ అవుతున్నానని, ఉద్యమ సమయంలో ఆయన పులిలా ఉన్నారు.. ఇప్పుడు పిల్లి లాగా అయ్యారని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణను నట్టేటా ముంచారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అగ్రికల్చర్ పాలసీ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు అల్లం, పసుపుకు తేడా తెలియదని, ఆయన కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్‌లాగే వరి మాత్రమే వేసుకునే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా కాదు, బీమా కూడా అందట్లేదని ఆరోపించారు. మాజీ ప్రధాని ఇందిరమ్మను కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఇంకా బద్నాం చేస్తున్నారని, ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూళ్లను ప్రారంభిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటే, కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు కూడా పడుతుందని జోష్యం చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని చూసి ఇప్పటి పరిస్థితుల్లో ఎవరూ ఓటు వేయరని అన్నారు. బీజేపీ నేతలు అంతా ఇలాగే కలిసికట్టుగా బలమైన అపొజిషన్‌గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మనదేనని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు.