( ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ పాల్కే పురస్కారం ప్రకటించిన శుభ వేళ )
మాజీ రాజ్యసభ సభ్యుడు, పద్మభూషణుడు, ప్రముఖ బహుభాషల సినీ నటుడు మిథున్ చక్రవర్తికి 2022 సంవత్సరానికి “దాదాసాహెబ్ పాల్కే” అవార్డును 2024 సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సముచితంగా, సంతోషంగా ఉన్నది. 16 జూన్ 1950న కోల్‌కతాలోని హిందూ కుటుంబంలో శాంతారాణి – బసంత్ కుమార్ చక్రవర్తి దంపతులకు జన్మించిన “గౌరంగ చక్రవర్తి” ఇంతింతై వటుడింతై అన్న చందాన నటుడిగా శిఖరాగ్ర స్థానానికి ఎదిగి ఏకంగా సినీ ప్రరిశ్రమలోనే అత్యున్నత భారత పురస్కారం దాదాసాహెబ్ పాల్కే కిరీటాన్ని చేజిక్కించుకోవడం హర్షదాయకం. ఓరియంటల్ మిషనరీ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించి, స్కాటిష్ చర్చి కళాశాలలో బి. ఎస్‌సి. రసాయనశాస్త్రం పట్టా పొందారు. అనంతరం “పూణే ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్”లో చేరి పట్టా స్వంతం చేసుకున్నారు.
సినీ రంగంలో “డిస్కో డ్యాన్సర్” ప్రభంజనం:
యువకుడిగా నక్సలైట్ భావాలతో ఎదిగిన మిథున్ కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకొని 1976లో మృణాల్ సేన్ దర్శకత్వంలో ‘మృగయా’ సినిమాలో నటించి చలనచిత్ర రంగ ప్రవేశం చేసి తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డుకు ఎంపికైనారు. అదే సంవత్సరం ‘దో అంజానే’ సినిమాలో కూడా నటించారు. 1978లో ‘నాది తేకే సాగరే’ అనే బెంగాలీ బ్లాక్ బస్టర్ సినిమాతో నటించి చలనచిత్ర రంగంలో సుస్థిర స్థానం దక్కించుకున్నారు. అదే వరుసలో ‘మేరా రక్షక్’, ‘సురక్ష’, ‘తరానా’, ‘పతిత’, ‘ఉన్నీస్ బీస్’, ‘హమ్ పాంచ్’, ‘హమ్ సే బడ్కర్ కౌన్’, ‘కలంకిణి కంకబాటి’ లాంటి విజయవంతమైన సినిమాల్లో తొలి మూడేండ్లలో అభినం చేసి ఉత్తమ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1982లో ‘డిస్కో డ్యాన్సర్’ సినిమాతో డ్యాన్సర్‌గా తన అసాధారణ ప్రతిభను కనబర్చి ప్రపంచవ్యాప్తంగా ‘ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ సూపర్‌హిట్’ సినిమాతో స్టార్‌డమ్ మూటగట్టుకున్నారు. చలనచిత్ర ప్రస్థానంలో చక్రవర్తి ‘షౌకీన్’, ‘అశాంతి’, ‘తఖ్‌దీర్ కా బాద్‍షా‘, ‘స్వామి దాదా’, ‘ముజే ఇన్సాఫ్ చాహియే’, ‘హమ్ సే హై జమానా’, ‘పసంద్ అప్నీ అప్నీ’, ‘ఘర్ ఏక్ మందిర్’, ‘జాగీర్’, ‘కసమ్ పైదా కర్నే వాలేకి’, ‘ప్యార్ ఝుక్తా నహీ’, ‘గులామీ’, ‘ఆంధా తూఫాన్’, ‘ప్యారీ బెహనా’, ‘కర్మ యుధ్’ లాంటి అనేక ప్రజాధరణ పొందిన సినిమాల్లో నటించి మెప్పించారు. 1986లో ‘స్వర్గ్ సే సుందర్’, ‘జాల్’, ‘దిల్వారా’, ‘ముద్ధత్’, ‘షీషా’, ‘పతి పత్ని ఔర్ తవైఫ్’, ‘హమ్‌సే నా టక్రానా’, ‘అగ్నిపథ్’, ‘త్రినేత్ర’, ‘తహదార్ కథ’ (ఉత్తమ నటుడిగా అవార్డు), ‘దలాల్’, ‘ఫూల్ ఔర్ అంగార్’, ‘ఆద్మీ’ లాంటి పలు సినిమాల్లో నటుడిగా ప్రభంజనం సృష్టించారు.
సినీ కెరీర్‌లో ఒడుదుడుకులు:
వాణిజ్య సినిమాల్లో విజయపరంపర కొనసాగించిన మిథున్ దాదా 1990-06 మధ్య చిన్న బడ్జెట్ సినిమాల్లో నటించి విజయం పొందలేకపోయారు. తన హోమ్ బ్యానర్ ‘మిథున్స్ డ్రీమ్ ఫాక్టరీలా’ ద్వారా వందలాది సినిమాలు నిర్మించారు. స్వామి వివేకానందలో నటించి జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డు పొందారు. 2000-03 మధ్య బెంగాలీ సినిమాలపై దృష్టి పెట్టి ‘తిత్లీ’, ‘ఫెరారీ ఫౌజ్’, ‘సంత్రాష్’ లాంటి సినిమాల్లో నటించి ప్రశంసలు పొందారు. 2005 తర్వాత హిందీ సినీ రంగం వైపు తరలిన మిథున్ కొన్ని విఫల సినిమాల అనంతరం మణిరత్నంతో ‘గురు’ సినిమా ద్వారా పునరాగమనం పొందారు. 2010లో నటించిన ‘గోల్‌మాల్-3’ సినిమాతో భారీ విజయం పొందారు. అదే ఊపులో 2020-14 మధ్య ‘హౌజ్‌ఫుల్’, ‘ఓఎంజీ’, ‘ఖిలాడీ 786’, ‘కిక్’ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
తెలుగు, తమిళ, కన్నడ చిత్రరంగాల్లో ప్రవేశం:
2015లో ‘గోపాల గోపాల’ తెలుగు విజయవంతమైన సినిమాలో నటించి మెప్పించారు. అదే క్రమంలో ‘విభు పూరి’, ‘ది విలన్’ (కన్నడ సినిమా), ‘యాగవరాయినుం నా కాక్క’ (తమిళం) లాంటి బహుభాషా సినిమాల్లో తన సత్తా చాటుకున్నారు. 2019-23 మధ్య ‘తాష్కంట్ ఫైల్స్’, ‘12 ఓ క్లాక్’, ‘ది కాశ్మీరి ఫైల్స్’, ‘బెస్ట్ సెల్లర్’ ద్వారా వెబ్ షో, ‘కాబూలీ వాలా’ లాంటి సినిమాల్లో నటనను కొనసాగించారు.
టెలివిజన్ డ్యాన్స్ షోలు, రాజకీయాలు :
‘డ్యాన్స్ బంగ్లా డ్యాన్స్’ అనే బెంగాలీ రియాలిటీ షో, ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ అనబడే కాన్సెప్ట్‌కు ఊపిరి పోశారు. జీ టీవి, సోనీ టీవీలతో పాటు పలు ప్రాంతీయ భాషా టీవీలు డ్యాన్స్ ఆధారిత రియాలిటీ షోలకు ఊపిరి పోస్తూ పలు షోలకు న్యాయనిర్ణేతగా నిలిచారు మన మిథునుడు. అనేక బహుళజాతి కంపెనీల ఉత్పత్తులైన పానాసోనిక్, గోడాడీ, ఛానెల్ 10, మణప్పురం గోల్డ్ లాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ టిఎంసి అభ్యర్థిగా రాజ్యసభకు 2014లో నామినేట్ అయిన మిథున్ 2016లో రాజీనామా చేశారు. 2021లో భాజపాలో చేరి కొనసాగుతున్నారు.
జాతీయ అవార్డుల పంట:
తన సుదీర్ఘ సినిమా ప్రస్థానంలో జాతీయ చలన చిత్ర అవార్డులు మూడు (4 నామినేషన్లు), ఫిలిమ్ ఫేర్ అవార్డులు నాలుగు (7 నామినేషన్లు), స్క్రీన్ అవార్డులు ఒకటి (3 నామినేషన్లు), ఐఐఏఫ్‌ఏ అవార్డుల్లో 3 నామినేషన్లు పొందిన ఘనత మన నట చక్రవర్తిది. మిథున్ చక్రవర్తి జీవన ప్రస్థానం ఆధారంగా హిందీ, బెంగాలీ, భోజ్‌పురి, ఇంగ్లీష్ భాషల్లో పలువురు రచయితలు ప్రఖ్యాత రచనలు చేసారు.
వ్యక్తిగతం:
1979లో నటి హెలెన్ ల్యూక్‌ను వివాహమాడిన వెంటనే విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది మరో నటి యోగితా బాలిని వివాహమాడిన మిథున్‌కు నలుగురు సంతానం. ఫిబ్రవరి 2024లో ఛాతి నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది డిస్చార్జ్ అయిన మిథున్ రానున్న రోజుల్లో ఆయురారోగ్యాలతో భరతమాతకు తనదైన కళ ద్వారా మరింత సేవ చేయాలని కోరుకుందాం.
08 అక్టోబర్ 2024న జరుగనున్న 70వ నేషనల్ ఫిలిమ్ అవార్డుల ప్రదానోత్సవంలో దాదాసాహెబ్ పాల్కే పురస్కారం అందుకోనున్న 74 ఏండ్ల మిథున్ చక్రవర్తికి శుభాకాంక్షలను మనస్పూర్తిగా తెలియజేద్దాం. కంగ్రాచ్యులేషన్స్ “మిథున్ దాదా” ఫర్ “దాదాసాహెబ్ పాల్కే” అవార్డు.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037