- రాజకీయంగా దుమారం లేపిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు
- కొండా సురేఖ వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రథోడ్
- కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి : హరీష్ రావు
- కేటీఆర్ గురించి కొండా సురేఖ మాట్లాడింది ఆక్షేపణియం : సబితా ఇంద్రారెడ్డి
- కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తాం : సత్యవతి రథోడ్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. కొండా సురేఖ వ్యాఖ్యల పై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు.
కొండా సురేఖ వ్యాఖ్యలకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ” సురేఖమ్మ మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది.. కేటీఆర్ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణియం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి”.. మీరు చేసిన ఆరోపణల వల్ల కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడతారు కదా.? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించారా అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
ఎంగిలి పూల బతుకమ్మ రోజు తాము చీరలు ఇస్తే, కొండా సురేఖ బజారు మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలు బాధ పడే విధంగా కొండా సురేఖ మాట్లాడారని, పరువునష్టం దావా వేస్తామని అన్నారు.