Thursday, November 14, 2024
spot_img

మన జీవితాలకు ఉషాకిరణాలు-ఉపాధ్యాయులు

Must Read

దేవుడు, గురువు ఇద్దరూ ఒకేసారి ఎదురుపడితే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తాను అంటారు ఓ ప్రఖ్యాత హిందీ కవి. మన జీవితాల్లో అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞాన వెలుగులను ప్రసరించేలా చేసేవారు ఉపాధ్యాయులు. కేవలం విద్యాసంస్థల్లో విజ్ఞానపు పాఠాలు బోధించే వారు మాత్రమే కాదు గురువులంటే. మన జీవితాల్లో అక్షరం ద్వారా గానీ, తమ ఆలోచనల ద్వారా గానీ, తమ అనుభవపు అభిప్రాయాల ద్వారా గానీ, ఇంకా ఏరూపంలో అయినా సరే మార్పు తీసుకొచ్చి స్ఫూర్తి ప్రదాతలుగా మన పురోభివృద్ధికి బాటలు వేసిన వారందరూ మనకు ఉపాధ్యాయులే. చరిత్రను మనం గమనిస్తే ఒకప్పటి సాధారణ వ్యక్తులు విఖ్యాత ప్రముఖులుగా రూపాంతరం చెందడంలో కొన్ని పుస్తకాలు కూడా మార్గదర్శనం చేశాయి. అలాంటి పుస్తకాలు కూడా మనకు జీవిత పాఠాలు బోధించే గురువులే. కృష్ణుడి భగవద్గీత, గౌతమ బుద్దుని బోధనలు, బైబిల్ , ఖురాన్ వంటి ఆధ్యాత్మిక గ్రంధాలు సైతం మనకు దారి చూపే దీపాలే. సరిహద్దుల్లో వుండే మనదేశ సైనికులు శత్రువుల నుండి మనల్ని కాపాడితే సరిహద్దు లోపల ఈ దేశాన్ని అంతర్గత శత్రువుల నుండి కాపాడి అభివృద్ధి భారతంగా నిర్మించడంలో కీలకపాత్ర పోషించే అక్షర సైనికులే ఉపాధ్యాయులు. “ఓ ఇంజనీర్ బిల్డింగ్ ప్లాన్ తప్పచేస్తే భవనాలు కూలిపోతాయి.

ఓ డాక్టర్ వైద్యం సరిగ్గా చేయకపోతే కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఓ అధికారి అవినీతి చేస్తే సమాజపు మనుగడలో ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ ఓ ఉపాధ్యాయుడు కేవలం స్వార్థపూరితంగా తమజీతం కోసం మాత్రమే ఆలోచిస్తూ, భావితరాల భవిష్యత్తు గురించి సరిగ్గా పనిచేయకపోతే కొన్ని తరాలే నాశనం అవుతాయి” వంటి సూక్తులు నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రతి సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ 5న ఆయన గౌరవార్థం మరియు కోరిక మేరకు మనమంతా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ఉపాధ్యాయులను సన్మానించుకుంటాం. ఈ దేశ తొలి ఉపరాష్ట్రపతిగా పది సంవత్సరాలు, రెండవ రాష్ట్రపతిగా ఐదు సంవత్సరాలు విశిష్ట సేవలందించిన భారతరత్న రాధాకృష్ణన్. వివేకానంద మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావుల స్ఫూర్తితో భారతదేశ విద్యా వ్యవస్థపై తనదైన శైలిలో చెదరని ముద్ర వేసిన రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా,ప్రొఫెసర్ గా, ఆంధ్రా యూనివర్సిటీ మరియు బనారస్ యూనివర్సిటీ ఉపకులపతిగా, ప్రపంచం గుర్తించిన గొప్ప తత్వవేత్తగా ఆయన జీవన ప్రయాణం కొన్ని తరాలకు స్ఫూర్తిదాయకం. హిందూమతంలోని గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను ప్రపంచానికి అవగాహన కల్పించండంలో ఆయన తన అద్వితీయమైన రచనలతో,ఆలోచనలతో “ది ఇండియన్ ఫిలాసఫీ”ని అందించారు.సాహిత్యంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల బహుమతిని గెలవలేక పోయారు. విజ్ఞానం ఆధారంగా మాత్రమే ఆనందం మరియు సంతోషకరమైన జీవితం సాధ్యమవుతుందంటారు రాధాకృష్ణన్.

తన అద్భుతమైన వాగ్ధాటితో చికాగోలోని ప్రపంచ సర్వమత సమ్మేళనంలో భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన వివేకానందుడు వంటి వారి జీవితంలో తన గురువు రామకృష్ణ పరమహంస ప్రేరణ, మార్గదర్శనం ప్రముఖంగా కన్పిస్తుంది. ఆయన వల్లే వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపించారు. ఆ మిషన్ సాయంతో నేటికి ఎన్నో విద్యాసంస్థల ద్వారా పేదలకు సైతం నాణ్యత గల విద్యను అందిస్తున్నారు. రామకృష్ణ మరియు వివేకానంద గురుశిష్య సంబంధం చరిత్రలో సువర్ణాక్షర లిఖితం. అస్పృశ్యత, అంటరానితనం వంటి మహామ్మారులను దాటి తన మేధస్సుతో యావత్ ప్రపంచానికి విద్యగొప్పతనం చాటిచెప్పిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని తీర్చిదిద్దిన గురువుకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఇచ్చారు. మన స్వాతంత్ర్య సంగ్రామంలో కీలకమైన వ్యక్తిగా చరిత్ర కెక్కిన భారతరత్న సుభాష్ చంద్రబోస్ వివేకానందను తన గురువుగా చెప్పుకున్నారు. నేతాజీ వివేకానంద దేశభక్తి బోధనల ఆచరణతోనే నేటికీ యావత్ భారత జాతికి రియల్ హీరో అయ్యారు. విశ్వమానవుడుగా,ఈ శతాబ్దపు అత్యున్నత వ్యక్తుల్లో ప్రముఖునిగా గుర్తించబడ్డ గాంధీజీ కూడా టాల్ స్టాయ్ రచనలతో,ఆలోచనలతో సత్యం మరియు అహింసలకు ఆకర్షితుడయ్యాడు.

రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వ భారతి విశ్వ విద్యాలయం, శాంతినికేతన్,ప్రకృతి విద్య వంటివి నేటి ఆధునిక భారతదేశపు విద్యావిధానంలో కూడా దిక్సూచిగా వున్నాయి.విభిన్నరంగాల్లో నోబెల్ బహుమతులు గెలిచిన విఖ్యాత ప్రముఖులు, ఒలింపిక్స్ విజేతలు సైతం తమ విజయంలో తాము గురువులుగా భావించే వ్యక్తులకు భాగస్వామ్యం కల్పించారు.చిన్నప్పుడు మా ఉపాధ్యాయుల బోధన,వారి ఉన్నత వ్యక్తిత్వం వల్లనే పెద్ద పెద్ద రాకెట్ కలలు కనడం ఆరంభించి రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా తన ప్రయాణం కొనసాగిందని, ఉపాధ్యాయ వృత్తి అన్నింటిలో కెల్లా అత్యున్నతమైనదంటారు భారతరత్న అబ్దుల్ కలామ్.క్రికెట్ లో భారత్ ను విశ్వ విజేతగా నిలపాలనే సంకల్పంతో ఎన్నో అవాంతరాలను అధిగమించి సుదీర్ఘ క్రీడా ప్రస్థానంలో భారత్ కు వరల్డ్ కప్ అందించిన సచిన్ తన వీడ్కోలు ప్రసంగంలో తన చిన్ననాటి క్రికెట్ కోచ్ అచ్రేకర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.భారతదేశం గర్వించదగ్గ సినీహీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లు నేటి తమ స్థాయికి డైరెక్టర్ బాలచందరే కారణమని సవినయంగా ఎన్నో వేదికల ద్వారా ప్రకటించారు.

పారిస్ లో యునెస్కో ఆధ్వర్యంలో ఐరాస, అంతర్జాతీయ కార్మిక సంస్థ వంటి అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయుల హక్కులు,హోదాలు, బాధ్యతలు వంటి తదితర అంశాలతో కొన్ని నిర్దిష్ట సిఫారసులతో కూడిన సమగ్రమైన పత్రం “స్టేటస్ ఆఫ్ ది టీచర్స్” పేరుతో రూపొందించారు.ఈ సందర్భంగా అక్టోబర్ 5 ను అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మనం దేశంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో, విశ్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బంది హక్కుల కోసం ఎన్నో సంస్థలు ప్రభుత్వాలతో చర్చిస్తున్నాయి.ప్రభుత్వాలు కూడా కొంతమేరకైనా ప్రభుత్వ విద్యా సంస్థల సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తున్నాయి.కానీ ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది గురించి పెద్దగా ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.ఓటు బ్యాంకు రాజకీయాల మధ్య ప్రయివేటు విద్యాసంస్థల సిబ్బంది మధ్య ఐక్యత లేని కారణంగా, అందరికీ సమాన వేతనాలు అందక పోవడం వల్ల ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది బ్రతుకులు ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థిక భద్రతలు లేక నిత్యం జీవన పోరాటంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.లక్షల సంఖ్యలో వున్న ప్రయివేటు విద్యాసంస్థల్లో సిబ్బంది గురించి కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి వారికి కనీసం కొన్ని ప్రత్యేక ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టాలి.రెండవ ఎక్కం అందరికీ ఒకే విధంగా వున్నప్పుడు అది బోధించే ఉపాధ్యాయుల బ్రతుకుల్లో ప్రభుత్వం, ప్రయివేటు అంటూ జీతాల వ్యత్యాసాలు ఎందుకున్నాయి.సమాజంలో గౌరవం,హోదాలో తేడాలు ఎందుకు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం సమాజం మరియు ప్రభుత్వాలు ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిని చూసే దృక్పథం, దృక్కోణం మారి ఉపాధ్యాయులందర్ని సమదృష్టి తోనే చూడాలి. విద్య ఎప్పటికీ వ్యాపారం కాదు.విద్య అనేది కూడా ఓ వ్యవసాయమే.రైతు ఆకలిని తీరుస్తాడు.గురువు అజ్ఞానాన్ని తరిమేస్తాడు.

ఫిజిక్స్ అరుణ్ కుమార్
ప్రయివేటు టీచింగ్ ఫ్యాకల్టీ
9394749536
నాగర్ కర్నూల్

Latest News

దాడి చేసినోళ్ల పాపం పండింది

రైతుల మాటున అధికారులపైదాడి చేసినోళ్ల పాపం పండిందిచెట్లు పేరు చెప్పి కాయలు అమ్ముకునుడు అంటే ఇదే కావొచ్చు..ప్రజలకు సేవ చేద్దామని పెద్ద చదువులు వెయ్యి చేసుకోడానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS