(రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని సర్వే నెం. 294లోని 7ఎకరాల 22 గుంటలు మాయం)
- పూజారులే అసలు దొంగలు
- అక్రమ మార్గంలో ఏజీపీఏ
- 2016లోనే భూమిని కొట్టేసిన పూజారులు
- అమ్మకానికి పెట్టిన పంతుల్లు
- పట్టనట్లు వ్యవహరిస్తున్న ఎండోమెంట్ అధికారులు
- దేవాదాయ భూములను రక్షించేవారెవరూ..?
‘అందరూ శ్రీవైష్ణవులే కానీ బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి’ అన్నట్టు స్వామిలోరికి నిత్యం పూజలు నిర్వహించే పూజారులే ఆయనకు శఠగోపం పెట్టేశారు. పైసలకు కక్కుర్తి పడ్డ వారు దేవాలయ భూముని చెరబట్టారు. ఆకలైతే అన్నం తినడం మానేశినట్టున్నారు కొందరు వ్యక్తులు. పొద్దున లేస్తే ఏదో ఓ రకంగా డబ్బులు కూడబెట్టాలనే ఆలోచనతోనే ఉంటారు కాబోలు. కోట్లాది రూపాయల విలువ చేసే దేవాదాయ భూమిని కొట్టేశారు. గతంలో మనం రియల్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఇతరత్రా గలీజ్ దందాలు చేసేవారే ఇలాంటి పనులు చేసేవారని తెలుసు. కానీ ఈ వార్త చదివితే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. తల్లిపాలు తాగి ఆమె రొమ్మునే గుద్దేవారు ఉన్నారంటే నమ్మశక్యం కాదు. అలాంటి వారే పూజారులు కొనసాగుతున్న ఆ ప్రబుద్దులు. వృత్తి మాత్రం దేవుడే సేవ అయి ఉండొచ్చు గానీ వాళ్ల అంతర్మథనం చూస్తే ఛీ అనిపిస్తుంది.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం, మంచిరేవుల గ్రామంలోని కోట్ల రూపాయల విలువ చేసే దేవుడి భూమి కబ్జా చేశారు. మంచిరేవులలోని సర్వే నెం. 294లో ఉన్న సుమారు 7ఎకరాల 22 గుంటల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ భూమిని.. ఆ గుడి పూజారులైన జి. నర్సింహాచారి, జి. శ్రీనివాసచారి, జి. వర్థాచారి, జి. కార్తీక్, జి. అచ్చుత్, జి. వంశీ కలిసి ఏజీపీఏ చేశారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని సైనిక్‌పురిలోని పోచయ్య పటేల్ ఇంగు, రతన్ కుమార్ ఇంగు అనే వ్యక్తులకు ఆ నలుగురు పూజారులు అక్రమ మార్గంలో ఏజీపీఏ చేసి అప్పగించారు. ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్న పూజారులు డబ్బుల కోసం దేవాలయ భూమిని అమ్మడం చాలా దారుణం. దశాబ్దాల కాలం నుండి పూజారులుగా జి. నర్సింహా చారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు. అయితే దీనిపై రంగారెడ్డి జిల్లా మండల రెవెన్యూ ఆఫీస్ లోని రికార్డులు పరిశీలించగా ఆ భూమిని వివిధ సర్వేనెంబర్లతో కలిపి మొత్తం సుమారు వందల ఎకరాల భూమి దేవుడి మాన్యంగా తేలింది. అందులో ఇది ఒక సర్వే నెంబర్ లోని భూమి మాత్రమే ఏజీపీఏ చేశారు.. ‘అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు’ వేణుగోపాలస్వామి ఆలయంలో పనిచేసే నలుగురు పూజారులు కలిసి పైసలకు అమ్ముడుపోయి దేవుడి మాన్యాన్ని ఏజీపీఏ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సదరు పూజారులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ఫిబ్రవరి 23, 2016లోనే 7ఎకరాల 22 గుంటల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ భూమిని బాలాపూర్ సబ్ రిజిస్టార్‌లో (ఏజీపీఏ) అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కం జనరల్ ఫవర్ ఆఫ్ అటార్నీ చేయడం జరిగింది. దేవాలయంలో పనిచేస్తున్న పూజారులే ఇతరులకు భూమిని అమ్మడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కోట్లాది రూపాయల విలువ చేసే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ భూమి (దేవుడి మాన్యాన్ని) పూజారులు ప్రైవేట్ వ్యక్తులకు ముట్టచెప్పడంతో స్థానికులు ఆగ్రహిస్తున్నారు. డబ్బులు దండుకొని వారికి ఏజీపీఏ చేసినప్పటికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఎవరూ పట్టనట్లు వ్యవహరించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా నిషేదిత జాబితాలో ఉన్న భూమిని సబ్ రిజిస్టార్ ఏజీపీఏ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కోట్ల రూపాయల ఆలయ భూములను పూజారులే చెరపడుతుంటే ఎండోమెంట్ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భూములు, ఆలయ భూములను కాపాడాల్సిన సర్కారు అధికారులు ఇకనైన మేల్కొని చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. సదరు పూజారులపై చర్యలు తీసుకోవాలని.. వారికి సహకరించి దేవుడి మాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై కూడా చర్యలకు ఉపక్రమించాలని కోరుతున్నారు. అదేవిధంగా దేవాలయ భూమిని రికవరీ చేయాలని సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.