Sunday, November 24, 2024
spot_img

ప‌ర‌మాత్మునికే పంగ‌నామాలు..

Must Read

(శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గ‌మ‌ర్న‌మెంట్‌)

  • రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్
  • ఎండోమెంట్‌ చట్టాలు తుంగలో తొక్కిన గత సర్కార్
  • డివిజన్‌ బెంచ్‌ తీర్పు.. మళ్లీ సింగిల్‌ బెంచ్‌ ముందుకు రిట్‌ పిటిషన్‌
  • పిటిష‌న్ దారుల‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం
  • ఇండస్ట్రీయ‌ల్‌కు భూములు అప్ప‌గించిన బీఆర్ఎస్ స‌ర్కార్‌
  • భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్న మాజీ మంత్రి కేటీఆర్‌?
  • ఈ స్కాంలో జయేష్‌ రంజన్‌, టీఎస్‌ఐఐసీ, ఎండోమెంట్ కమిషనర్‌?
  • వెలుగులోకి టీఎస్‌ఐఐసీ, ఎండోమెంట్‌ అధికారుల చిత్ర, విచిత్రాలు
  • భారీ కుంభకోణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెలికితీయాలని డిమాండ్
  • ఎండోమెంట్ భూమికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌ని గ‌త బీఆర్ఎస్‌ స‌ర్కార్‌

తెలంగాణలో భూబకాసురులకు దేవుడి మీద భయం, భక్తి లేదు. ‘నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది’ అన్నట్టు అధికారం అడ్డం పెట్టుకొని ఎంతకాడికైన దిగజారుతారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఖాళీ జాగ దొరికితే ప్రభుత్వ, అసైన్డ్ భూములు, చెరువులు, కుంటలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. అయితే అదీ సరిపోక దేవుడి మాన్యాన్ని కూడా వదులుతలేరు. రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నో అరాచకాలకు తెరలేపింది. ఉదయం లేచింది మొదలు అన్నీ అవినీతి, అక్రమాలతోనే గడిపారు. ఇప్పుడు తాజాగా భారీ స్కామ్ ఒకటి బయటకొచ్చింది. కేసీఆర్ సుపుత్రుడు కేటీ రామారావు ఆధ్వర్యంలో దేవుడి మాన్యాన్ని మింగేశారు. 1,148 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ ను దిగ‌మింగి, కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ‘డబ్బుకు లోకం దాసోహం’ అన్న చందంగా పైసలకు కక్కుర్తి పడి అధికారం అడ్డం పెట్టుకొని దేవుడికే శఠగోపం పెట్టారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. వ్యవస్థలను మ్యానేజ్‌ చేసి, వాటిని తమ జేబు సంస్థలుగా వాడుకొని భగవంతుడికే పంగనామాలు పెట్టారు. ఆ దేవుడి పేరున ఉన్న ల్యాండ్‌ ను అప్పనంగా కొట్టేసి వేల కోట్ల రూపాయాలను వెనకేసుకున్నారు. ఇందుకోసం ఎండోమెంట్‌ చట్టాలను తుంగలో తొక్కి యధేచ్ఛగా యవ్వారాలను కానిచ్చేశారు. నవ్విపొదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు ఏ మాత్రం ఇజ్జత్‌ లేకుండా వందల ఎకరాల దేవుని మాన్యాన్ని అక్రమంగా టీఎస్‌ఐఐసీకి బదలాయించి సుమారు రూ.3 వేల కోట్లు తప్పుడు పద్ధతుల్లో దండుకోవడం శోచనీయం. బీఆర్‌ఎస్‌ సర్కార్‌, యువరాజు ఐటీ మంత్రిగా ఉన్న టైంలో జరిగిన ఈ వేల కోట్ల స్కాంపై ఆదాబ్‌ ప్రత్యేక కథనం.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం సీతారాంపూర్‌ లోని సర్వే నెంబర్లు 1663 నుంచి 1673లలో శ్రీ సీతారామచంద్ర స్వామివారికి వందల ఎకరాల భూమి ఉండేది. అనేక మంది దాతలు చాన్నాళ్ల క్రితమే ఆలయ అభివృద్ధి, దూప, దీప, నైవేధ్య అవసరాల కోసం ఈ భూమిని దానం చేశారు. ఈ భూములే సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అవసరాలు కూడా తీర్చేవి. అయితే ఈ భూములపై 2006లో అప్పటి రాష్ట్ర సర్కార్‌ కర్ర పెత్తనం చేసేందుకు ప్రయత్నించి భంగపడింది. ఈ భూములకు సంబంధించి 2006లో హైకోర్టులో రిట్‌ ఫిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ ను విచారించిన అప్పటి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేసును దేవాలయ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. ‘తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య’ అన్న చందంగా.. దెబ్బకు అప్పటి సర్కార్‌ నోట్లో పచ్చి వెలగకాయ పడినట్లు కావడంతో సీతారామచంద్ర స్వామి వారి భూముల జోలికెళ్లకుండా గప్‌ చుప్‌ అయిపోయింది.

ఆలయ భూముల అక్రమ బదలాయింపు :

ఇక గత ప్రభుత్వాలు హైకోర్టు ఆదేశాలతో సీతారామచంద్ర స్వామివారి భూముల జోలికి వెళ్లకపోగా.. బీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయ భూములను అప్పనంగా కొట్టేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టేయడం గమనార్హం. అందులో భాగంగానే ఆలయానికి సంబంధించిన 1148.12 ఎకరాల భూమిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్ ఇన్ ఫాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ కి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని టీఎస్‌ఐఐసీ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ముందు 2020లో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ పరిశీలించిన న్యాయస్థానం 2006లో ఇదే వ్యవహారంపై ద్వి సభ్య ధర్మాసనం తీర్పు వెలువరించిందని.. అందువల్ల తాము ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అవసరమైతే పిటిషన్‌ దారులు సీజే ధర్మాసనం ముందుకు వెళ్లాలని సూచించింది. అలా కాకుండా భూసేకరణకు ప్రయత్నిస్తే అది కోర్టు ధిక్కారంగా భావిస్తామని తెలియజేసింది.

బీఆర్ఎస్ హయాంలో హైకోర్టు ఆదేశాలు బేఖాతర్‌ :

‘దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు’ అన్న చందంగా కేసీఆర్ సర్కార్ చేసిన పాపం వారికే తగిలింది. 2006లో డివిజన్‌ బెంచ్‌ సీతారామచంద్రస్వామి వారి భూములను టీఎస్‌ఐఐసీ భూసేకరణ చేయొద్దని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. వాటిని ఖాతర్‌ చేయకుండా ల్యాండ్‌ ఆక్విజేషన్‌ కు పూనుకోవడం జరిగింది. అందులో భాగంగానే టీఎస్‌ఐఐసీ దేవాలయానికి సంబంధించిన మొత్తం భూమిని సేకరించి అందులో ఉన్న సాగుదారులు, ఆక్రమణదారులకు పరిహారం చెల్లించడం విస్మయం కల్గిస్తోంది. ఇందుకుగాను ఎకరాకు రూ.21 లక్షల చొప్పున పరిహారంగా నిర్ణయించి అందులో సగం సాగు, ఆక్రమణదారులకు ఇంకో సగం ఆలయ నిర్వాహకులకు చెల్లించడం గమనార్హం. ఇక టీఎస్‌ఐఐసీ స్వాధీనం చేసుకున్న 1,148.12 ఎకరాల భూమిని ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పార్క్‌ వారికి బదలాయించే ప్రక్రియను చేపట్టడడం విశేషం. అత్యంత ఖరీదైన ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్‌ లో రూ.3వేల కోట్లు పలుకుతుందని అంచనా. ఆశ్చర్యం ఏమిటంటే.. భూమి సేకరణ చేసుకోవడానికి ఇప్పటి వరకు ఎలాంటి కోర్ట్‌ ఉత్తర్వులు లేవు. కోర్టు ఉత్త‌ర్వులు లేకుండా ఎండోమెంట్ చ‌ట్ట‌ప్ర‌కారం దేవుడి మాన్యాన్ని స్వాధీన ప‌రచుకోవ‌డానికి ప్ర‌భుత్వానికి కానీ, మ‌రి ఏ ఇత‌ర సంస్థ‌ల‌కు కానీ అధికారం లేద‌ని స్ప‌ష్టంగా చ‌ట్టంలో ఉంది.. కానీ, చ‌ట్టాన్ని అతిక్ర‌మించి ఇంతటి విలువైన ల్యాండ్‌ ను హైకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టి టీఎస్‌ఐఐసీ స్వాధీనం చేసుకొని పరాధీనం చేయ‌డం శోచనీయం.

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ లోని పెద్దల సహకారంతో భారీ ఎత్తున పారిశ్రామిక వేత్త‌ల నుండి పార్టీ ఫండ్ రూపంలో, లోపాయికారి ఒప్పందాల‌తో వారికి కేటాయించార‌ని బ‌హిరంగ విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌, దేవాదాయ-ధర్మాదాయ శాఖ కమిషనర్‌ కనుసన్నల్లో ఈ తంతు జరిగిందనే వాదనలున్నాయి. ఈ భారీ స్కామ్ బయటకు రావాలంటే కాంగ్రెస్ ప్ర‌భుత్వం విచారణకు ఆదేశిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీ మరిన్ని దందాలు చేసినట్లు అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించింది. ఈ తంతులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముట్టాయో పూర్తి ఆధారాలతో మరో కథనంలో మీ ముందుకు తేనుంది ఆదాబ్‌ హైదరాబాద్‌.. మా అక్షరం.. అవినీతి పై అస్త్రం.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS