- సమగ్ర వివరాల సేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి
- ప్రభుత్వం ఎలాంటి ప్రామాణిక పద్ధతులు అవలంబిస్తున్నదో ప్రజలకు వివరించాలి
- బీహార్ ప్రభుత్వం నిర్దిష్ట విధానాలను అవలంబించకపోవడం వల్ల పాట్నా హైకోర్టు అక్కడి రిజర్వేషన్‌ల పెంపు చట్టంను కొట్టివేసింది
- బీహార్ లాంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా అన్ని పద్ధతులను సమగ్రంగా ఆచరణలో పెట్టడం చాలా అవసరం
- కులగణనపై పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో కులసంఘాలకు చెందిన ప్రతినిధుల నిర్మాణాత్మక సూచనలు
తెలంగాణ రాష్ట్రంలో కులసర్వే నిర్వహించే ముందు సమగ్రంగా అన్ని పక్షాలతో రాష్ట్రప్రభుత్వం చర్చలు, సమావేశాలు నిర్వహించాలని అఖిలపక్ష కులసంఘాల ప్రతినిధులు సూచించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్, తెలంగాణ బి.సి. ఉద్యోగుల ఫెడరేషన్‌లు సంయుక్తంగా కులగణనపై పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాన్ని చేపట్టాయి.
ఈ కార్యక్రమంలో పబ్లిక్ హియరింగ్ జ్యూరీ ప్యానెల్‌గా జస్టిస్ వి.చంద్రకుమార్, బి.సి. కమిషన్ పూర్వ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ పూర్వ ప్రొఫెసర్ బి.ఎల్. విశ్వేశ్వరరావులు వ్యవహరించారు. ప్రధాన సమన్వయ కర్తలుగా ప్రొఫెసర్ మురళీమనోహర్, దేవుల సమ్మయ్యలు వ్యవహరించారు. పబ్లిక్ హియరింగ్‌లో పెద్దఎత్తున బి.సి. , ఎస్సీ, ఎస్టీ, తదితర కులసంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని, తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఈ సంధర్బంగా పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు.
రాష్ట్రప్రభుత్వం చేపట్టబోయే ఇంటింటి సమగ్ర కులసర్వేకు సంబంధించిన ప్రశ్నావళిలో ఉండే అంశాలను బహిర్గతం చేసి, అఖిలపక్ష కులసంఘాలతో చర్చించి, సమగ్ర వివరాల సేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలని కులసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎలాంటి ప్రామాణిక పద్ధతులు అవలంబిస్తున్నదో ప్రజలకు వివరించాలని కోరారు. బీహార్ ప్రభుత్వం రాత్రింబవళ్లు కష్టపడి సమగ్ర కులసర్వే నిర్వహించడం జరిగిందని తెలిపారు. నిర్దిష్ట విధానాలను అవలంబించకపోవడం వల్ల పాట్నా హైకోర్టు అక్కడి రిజర్వేషన్‌ల పెంపు చట్టంను కొట్టివేసిందని పలువురు పబ్లిక్ హియరింగ్‌లో గుర్తుచేశారు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా ముందస్తుగానే అన్ని పద్ధతులను సమగ్రంగా ఆచరణలో పెట్టడం చాలా అవసరమని పలువురు సామాజికవేత్తలు, న్యాయ నిపుణులు సూచించారు. ఎన్యుమరేటర్స్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో ఎన్యుమరేటర్స్‌కు శిక్షణ, వారు పాటించాల్సిన గైడ్ రూపకల్పనలో అవలంబించాల్సిన పద్ధతుల మీద కూడా పబ్లిక్ హియరింగ్‌లో పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
బీహార్ రాష్ట్ర ప్రభుత్వ శాఖ జి.ఎ.డి. ద్వారా కులసర్వేను నిర్వహించడం వలన పలు విమర్శలు, న్యాయపరమైన ఇబ్బందులను బీహార్ ప్రభుత్వం ఎదుర్కొందని పలువురు న్యాయవాదులు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన కులసర్వే కమిషన్‌ను నియమించాలని, అందుకు అందుబాటులో ఉన్న కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం-1952 ద్వారా సాధ్యమవుతుందని అన్నారు. సేకరించబడే వివరాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేశించడం, తులనాత్మకంగా పరిశీలించడం, తదితర అంశాలపై కృషిచేయడానికి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని పలుపురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పబ్లిక్ హియరింగ్‌లో వ్యక్తమైన అన్ని అభిప్రాయాలను పబ్లిక్ జ్యూరీప్యానెల్ వెంటనే ఒక నివేదిక రూపకల్పన చేసి, ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సభకు అధ్యక్షత వహించిన దేవళ్ల సమ్మయ్య, సమన్వయకర్త కె.మురళీమనోహర్‌లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సుదర్శన్‌రావు, ప్రొఫెసర్ బాగయ్య, డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్, సతీష్ కొట్టె, వినోద్ కుర్వ, డా. వేణుయాదవ్, డా. తుల్జారాం సింగ్, డా. విజయ్‌కుమార్, కె.పి. మురళీకృష్ణ, వితోబా, నరహరి, నిమ్మల వీరన్న, సి.హెచ్.ఉపేంద్ర, విజయేందర్‌సాగర్, పిల్లి రాజమౌళి, కొన్నె శంకర్‌గౌడ్, అనిల్‌కుమార్, తుమ్మనాపల్లి శ్రీనివాస్, చింతగింజ శ్రీహరిరావు, శివశంకర్ యాదవ్, డా. శోపరి శంకర్ ముదిరాజ్, పొన్నం దేవరాజ్‌గౌడ్, ఎం.సేనాపతి, తదితర సుమారు 150 కుల సంఘాల ప్రతినిధులు, వివిధ రంగాల విషయ నిపుణులు, సామాజికవేత్తలు పెద్దఎత్తున పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.