Thursday, November 21, 2024
spot_img

కటకటాల్లోకి కారు పార్టీ నేతలు..?

Must Read

(అవినీతిలో ఫస్ట్‌ అరెస్ట్ ఎవరిదీ ..?)

  • బీఆర్ఎస్ అవినీతిపై క్లారిటీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం
  • రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు
  • కేటీఆర్,హరీశ్ రావులతో పాటు కేసీఆర్‌పై కూడా కేసులుంటాయా ?
  • ఏ క్షణంలోనైనా కారు పార్టీ ముఖ్య నేతలు కటకటాల్లోకి వెళ్లాల్సిందేనా
  • ఇందులో ఎవరిపాత్ర ఎంత.? ఎవరెవరు ఎందులో ఇరుక్కోబోతున్నారు.
  • ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకోబోతోంది..తెలంగాణలో ఎం జరుగుతోంది..

తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్‌ చేయడమే కాదు..కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కార్‌ హయాంలో.. వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై జరుగుతోన్న మేధో మధనం ప్రక్రియ తుది దశకు వచ్చిందని తెలుస్తోంది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుందన్నది పొంగులేటి మాటల సారంశంగా ప్రచారం జరుగుతోంది… కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణితో పాటు పలు విభాగాలలో లెక్కకు మించి కుంభకోణాలు జరిగాయని, అవినీతికి, కుంభకోణాలకు పాల్పడ్డ వారిపై ప్రభుత్వం చర్యలకు సిద్దమైందని..అందులో ముఖ్యమైన నాయకులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

వారిని అరెస్ట్ చేయాలా..లేక జీవిత కాలం జైల్లో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుందని.. వారి ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుందని పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణలో ఎం జరిగింది..ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.

హరీశ్ రావుతో పాటు కేసీఆర్‌పై కూడా కేసులు?

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవివీతి జరిగిందని అధికారంలోకి రాకముందు నుంచి ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్‌.. పవర్‌లోకి రాగానే దానిపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించింది. కాళేశ్వరంపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్.. తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొదటి దఫా బీఆర్ఎస్ సర్కార్‌లో.. హరీశ్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేయగా, రెండోసారి దఫా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు.

పీసీ ఘోష్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. తమకేం తెలియదని.. సీఎంగా ఉన్న కేసీఆర్ ఆదేశాలను పాటించామని ఇంజనీర్లు, అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలపై.. హరీశ్ రావుతో పాటు.. కేసీఆర్‌పై కూడా కేసులు నమోదు చేసే అవకాశం లేకపోలేదన్న గుసగుసలు వినబడుతున్నాయి.

కేసీఆర్ పై చర్యలు తప్పవా?

విద్యుత్ కొనుగోళ్లలోనూ బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ సర్కార్‌ భావిస్తోంది….అందుచేత దీనిపైన కూడా విచారణ జరిపించింది. జస్టిస్ నర్సింహా రెడ్డి.. ఆ తర్వాత సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను విచారణ కమిషన్‌ చైర్మన్‌గా నియమించింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి జరిపిన విద్యుత్ కొనుగోళ్లలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. ఐతే విచారణలో భారీ అక్రమాలు బయటపడ్డాయని ప్రభుత్వ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై తుది నివేదిక వస్తే.. తర్వాత అడుగులు పడే చాన్స్ ఉంది. అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆరే విద్యుత్ శాఖను పర్యవేక్షించారు. దీంతో ఆయనపై చర్యలు తప్పవా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి..

ధరణి అక్రమాల్లో మహమూద్ అలీ, కేసీఆర్‌పై కేసులు?

ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన బీఆర్ఎస్ సర్కార్‌.. రాష్ట్రంలో భూములను పెద్దఎత్తున అన్యాక్రాంతం చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి ….ఇక అసైన్డ్ భూముల వ్యవహారం , దేవాలయ భూములు, భూదాన్ భూములతో పాటు.. ప్రభుత్వ భూములను వేల ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు అన్యాక్రాంతం చేశారని… దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. మొదటిసారి బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో మహమూద్ అలీ రెవెన్యూ శాఖకు మంత్రిగా ఉండగా.. రెండవ దఫా సర్కార్‌లో సీఎం కేసీఆరే రెవెన్యూ శాఖకు మంత్రిగా ఉన్నారు. దీంతో ధరణి అక్రమాల్లో మహమూద్ అలీ, కేసీఆర్‌పై కేసులు నమోదు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

గొర్రెల పంపిణీలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు.. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్ పై కేసులు?

ఇక బీఆర్ఎస్ సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గొర్రెల పంపిణీలోనూ పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని.. ఇప్పటికే విచారణలో తేలింది. అప్పుడు పశు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ హయాంలోనే గొర్రెల పంపిణీలో అవినీతి జరిగిందని తేలింది. దీంతో ఆయనపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్‌తో వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం రేపింది. చట్టాలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా.. అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలు.. సినీ, వ్యాపార, రియల్ ఎస్టేట్‌ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న అంశంపై విచారణ ఫైనల్ స్టేజీకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్‌తో బ్లాక్ మెయిల్ చేసి… వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. దీనికి సంబందించిన విచారణ కూడా తుదిదశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు.. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు సంబంధం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతోంది.

ఫార్ములా ఈ- కార్‌ రేసులోనూ భారీ అక్రమాలు..

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా కారు రేసులోనూ భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విచారణ జరిపిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని భావిస్తోంది . ఫార్ములా కారు రేసు కుంభకోణంపై అవసరమైతే ఈడీ విచారణకు కూడా ఆదేశించే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అక్రమాలు నిరూపితం అయితే.. కేటీఆర్‌కు చిక్కులు తప్పవన్న చర్చ జరుగుతోంది. ఇవే కాకుండా దళితబంధులో అక్రమాలు, సచివాలయ నిర్మాణంలో అవినీతి.. సచివాలయానికి కొనుగోలు చేసిన కంప్యూటర్లలో అక్రమాలు లాంటి మరికొన్ని అంశాల్లోనూ తెలంగాణ సర్కార్‌ విచారణ ముమ్మరం చేస్తోంది.

అరెస్టుల పర్వం మొదలైతే.. ముందుగా జైలుకు వెళ్లేది ఎవరు?

ఇలా ఒక్కొక్కటిగా విచారణ పూర్తి చేసి.. అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఐతే అటు పొంగులేటి వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి బాంబులకు భయపడేది లేదని.. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ సెటైర్లు వేశారు. మరి ఏది నిజం.. ఏం జరగబోతోంది.. విచారణలో తేలిందేంటి.. కాంగ్రెస్ సర్కార్‌ ఏం చేయబోతోంది. అరెస్టుల పర్వం మొదలైతే.. ముందుగా జైలుకు వెళ్లేది ఎవరు.. ఏయే కుంభకోణంలో ఎవరెవరు ఇరుక్కుంటారన్న చర్చ.. ఇటు పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు.. సామాన్య జనాల్లోనూ ఆసక్తి రేపుతోంది.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS