Thursday, November 14, 2024
spot_img

దివిస్ నుండి కాపాడండి మ‌హాప్ర‌భో

Must Read
  • ఆరెగూడెం గ్రామ రైతుల నిరసన
  • నష్టపరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలి
  • 15ఏళ్లుగా కాలుష్యంతో చచ్చిపోతున్నాం
  • దివిస్ విషతుల్యంతో దెబ్బతింటున్న వ్యవసాయం
  • గీత కార్మికుల వృత్తి ఆగమాగం.. రోడ్డున పడ్డ కుటుంబాలు
  • కంపెనీకి తొత్తులుగా మారిన కాలుష్య నియంత్రణ అధికారులు
  • ఫార్మా కంపెనీ కాలుష్యంపై సుప్రీం కోర్టుకు రైతులు

దివిస్ ఫార్మా కంపెనీతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరెగూడెం పరిసర ప్రాంతం రైతులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అటు వ్యవసాయం ఇటు కల్లు గీత కార్మికుల వృత్తి ఆగమాగం అవుతుందని వాపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ పరిధిలో గల దివిస్ ల్యాబ్స్ పరిశ్రమ నుండి వెలువడే వ్యర్థాల వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యం భూగర్భంలోకి విడుదల చేయడంతో భూగర్భ జలాలు పూర్తిగా కాలుష్య కాసారాలుగా మారడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కాగా గత పదిహేను సంవత్సరాలుగా ఆరెగూడెం పరిసర ప్రాంతాలు పూర్తిగా కలుషితం కావడంతో వ్యవసాయ పంటలు సరిగ్గా పండక అన్నదాతలు వాపోతున్నారు. వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాక ఆర్థికంగా నష్టపోతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఆరెగూడెం గ్రామ గీత కార్మికులు సైతం ఉపాధి కోల్పోతున్నారు. దివీస్ ల్యాబ్స్ కాలుష్యంతో, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం కావడంతో కల్లు కూడా కలుషితం అయిపోయింది. దీంతో ఎవరు కలుషితమైనా కల్లును త్రాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ప్రాంతంలో సుమారు వెయ్యికి పైగా గీత కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయారు.

కాలుష్య నియంత్రణ అధికారుల కక్కుర్తి :

దివిస్ ఫార్మా ల్యాబ్స్ కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కొమ్ముకాస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దివిస్ పరిశ్రమ యజమాన్యంతో కుమ్మక్కై రిపోర్టులు పరిశ్రమకు అనుకూలంగా ఇస్తున్నారు. ఫిర్యాదులు చేసిన రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నారు. దివిస్ ల్యాబ్స్ పరిశ్రమ నుండి ఎటువంటి కాలుష్యం లేదంటూ తప్పుడు నివేదికలు ఇస్తుండడం గమనార్హం. పైసలకు కక్కుర్తి పడి రైతుల, గీత కార్మికుల ప్రయోజనాలు దెబ్బ తీస్తూ కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై అవుతూ వస్తున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా దివిస్ విస్తరణకు పర్మిషన్ :

దివిస్ ల్యాబ్స్ పరిశ్రమ స్థాపించి 34 ఏళ్లు అవుతున్న 2006 తర్వాత పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చట్టం అమలులోకి వచ్చి 18సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్కసారి కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఉత్పత్తుల మిక్సింగ్ పేరుతో 2020లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీవో అడ్డం పెట్టుకొని అడ్డదారిలో అనుమతులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు జారీ చేయడం జరిగింది. దీనిపై స్థానిక రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఎలా దివిస్ ల్యాబ్స్ విస్తరణకు పర్మిషన్ ఇస్తారంటూ మండిపడుతున్నారు.

దివిస్ ల్యాబ్స్ తో సూరజ్ కుమార్ కుమ్మక్కు :

దివిస్ ల్యాబ్స్ తో సూరజ్ కుమార్ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నివేదిక ఇచ్చాడని ఆరోపిస్తూ రైతులు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దివిస్ ల్యాబ్స్ కాలుష్యంపై ఏర్పాటైన కమిటికి అధ్యక్షత వహించిన, గతంలో పని చేసిన రెవెన్యూ డివిజనల్ అధికారి సూరజ్ కుమార్ దివిస్ ల్యాబ్స్ కు అనుకూలంగా వ్యవహరించాడు. కాలుష్య ప్రభావిత ప్రాంతాలలో నీటి నమూనాలు సేకరించకుండా గతంలో దివిస్ ల్యాబ్స్ కాలుష్యంపై ఫిర్యాదులు చేసిన వారికి సమాచారం ఇవ్వకుండా పరిశ్రమకు అనుకూలంగా రెవెన్యూ డివిజనల్ అధికారి అవినీతిపై పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అయితే పర్యావరణ సామాజిక కార్యకర్త… సూరజ్ కుమార్ అవినీతిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ఉన్నతాధికారులకు కంప్లైంట్స్ ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో తెలంగాణ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దిస్ ల్యాబ్స్ పరిశ్రమ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు,గీత కార్మికులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం దీనిపై కోర్టులో విచారణ కొనసాగుతుంది.

కాలుష్య నియంత్రణ మండలి ఆఫీస్ ముట్టడి :

దివిస్ ల్యాబ్స్ పరిశ్రమ ద్వారా బయటకు వస్తున్న కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి ఆఫీసర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు, రైతులు హైదరాబాద్ తరలివచ్చి కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర కార్యాలయ ముట్టడి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వచ్చిన రైతులు, గీత కార్మికులు ఆఫీస్ ముందు ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారి చేసి కమిటి ఏర్పాటు చేసి దివిస్ ల్యాబ్స్ పై నివేదిక ఇవ్వాలని కోరడంతో కలెక్టర్ చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి సూరజ్ కుమార్ అధ్యక్షతన కమిటి ఏర్పాటు చేయడం జరిగింది.

మరోవైపు దివిస్ కంపెనీకి సంబంధించి అన్నింటికి తప్పుడు రిపోర్టు ఇస్తున్నారు అధికారులు. చౌటుప్పల్ ఆర్డీవో ఏకపక్షంగా రూపొందించి ఇచ్చిన తప్పుడు రిపోర్టును దివిస్ ల్యాబ్స్ యాజమాన్యం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎక్కడ చూసిన అదే చూపుతున్నారు. వివిధ సందర్భాలలో న్యాయస్థానాలకు దివిస్ ల్యాబ్స్ కాలుష్యంపై నమోదైన కేసులకు ఇచ్చే రిపోర్టులలో ఇదే నివేదిక ఇస్తు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాలుష్యం విడుదల చేసే ఈ కంపెనీ అధికారులను డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

దివిస్ కాలుష్యంతో సకలం సత్తెనాశ్ :

యాదాద్రి భువనగిరి జిల్లా లింగోజిగూడెం గ్రామ పరిధిలో ఉన్న దివిస్ ల్యాబ్స్ పరిశ్రమ వదిలే కాలుష్యంతో సకలం సత్తెనాశ్ అవుతున్నాయని ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాలోని గ్రామాల‌న్ని దివిస్ బారిన ప‌డి తీవ్ర అనార్యోగానికి గుర‌వుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దివిస్ కంపెనీ ఇచ్చే అమ్యమ్యాలకు అలవాటుపడిపోయారు. స్థానిక రాజకీయ నాయకులు కూడా మాముళ్ల మ‌త్తులో జోగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పరిశ్రమ ద్వారా వెలువడే కాలుష్య భూతం వల్ల రైతులు, అమాయక ప్రజల ఘోడు ఎవరికీ ప‌ట్ట‌వా అని నిలదీస్తున్నారు. మనుషులే కాదు పశు పక్షాదీలు కూడా తీవ్ర అవస్థలు పడే పరిస్థితి దాపురించింది. కాలుష్యం మూలంగా మూగ‌జీవాలు కూడా ఇబ్బందుల‌కు గుర‌వుత‌ున్నాయి. అటు అధికారులు ఇటు పాలకులు కంపెనీకి అమ్ముడుపోతూ జిల్లాలోని మండ‌ల‌, గ్రామ ప్ర‌జ‌ల బాధ‌లు ప‌ట్టించుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణకు పట్టు:

దివిస్ ల్యాబ్స్ కు అడ్డదారిలో జారీ చేసిన పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఎస్ఇఐఏఏ కమిటి ద్వారా అడ్డదారిలో దివిస్ ల్యాబ్స్ కు భారీ విస్తరణకు జారి చేసిన పర్యావరణ అనుమతులు రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతున్నారు. ఆ తర్వాత పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ప్రజలు అసమ్మతితో తిరిగి అనుమతులు జారి చేయాలని ఆరెగూడెం గ్రామ ప్రజలు, రైతులు, గీత కార్మికులు కోరుతున్నారు. దివిస్ ల్యాబ్స్ పరిశ్రమల కాలుష్యంతో నష్టపోయిన ఆరెగూడెం గ్రామానికి నష్టపరిహారంగా రూ. 100 కోట్లు చెల్లించాలని స్థానికులు కోరుతున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ కు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికలతో జాతీయ హరిత ట్రిబ్యునల్ ను తప్పుదోవ పట్టించినందున ఎన్.జి.టి తీర్పుపై రైతులు దివిస్ ల్యాబ్స్ కాలుష్యంపై సుప్రీం కోర్టులో కేసు వేయనున్నట్లు తెలుస్తోంది.

దివిస్ ల్యాబ్స్ వదులుతున్న కాలుష్యంతో ఏళ్లుగా నష్టపోతున్నామని తమ ఆవేదన చెబుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు, గీత కార్మికులు, ఆరెగూడెం ప్రజలు వాపోతున్నారు. ఇకనైన రాష్ట్ర నియంత్రణ మండలి అధికారులు, ప్రభుత్వం స్పందించి విషం చిమ్ముతున్న దివిస్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు న్యాయం జరిగే వరకు కొట్లాడుతామని హెచ్చరిస్తున్నారు.

Latest News

గ్రూప్ 03 పరీక్షకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ టీజీపీఎస్సీ ప్రతిపాదించిన ప్రతి సూచనను అధికారులు తప్పకుండా పాటించాలి 33 పరీక్షా కేంద్రాల్లో 9,478, మందికి గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ, అభ్యర్థులు ఉదయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS