తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10 ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్దీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించారని నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ జీవోను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సుజోయ్పాల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులకు తొలగించవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని తెలిపింది. రాష్ట్రంలో ఇక నుండి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.