- డీజీపీని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
- అధికారులపై దాడి చేస్తే నోరుమెదపని వారు, అరెస్టులు చేస్తే ఎలా ఖండిస్తారు..
- దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి
వికారాబాద్ జిల్లాలో అధికారులు, ఉద్యోగులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంగళవారం రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను కలిసి వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో అధికారులపై జరిగిన దాడిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ, అధికారులపై భౌతికంగా దాడి చేసి గాయపర్చినప్పుడు నోరు మెదపని వారు, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తే ఖండించడం ఎంత వరకు సరైనదని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేసే ఉద్యోగులపై దాడులు చేయడం సరైన పద్దతి కాదని అన్నారు.
గ్రామంలో ఫార్మా కంపెనీ విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, కడా ప్రత్యేకాధికారి, తహశీల్దార్, ఇతర అధికారులపై రైతుల ముసుగులో పథకం ప్రకారమే కొందరు దాడి చేసినట్టుగా కనిపిస్తుందన్నారు. దాడి చేసిన వారిని, దాడి వెనుకాల ఉన్న వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందించారన్నారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తేలేదని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టుగా డీజీపీ చెప్పారని జేఏసీ నాయకులు తెలిపారు. జిల్లా కలెక్టర్ గ్రామానికి వచ్చినప్పుడు తమ అభిప్రాయాన్ని రైతులు, గ్రామస్తులు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉందన్నారు. కానీ అదే కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించడం, మిగతా అధికారులపై భౌతిక దాడులకు దిగడం, వాహనాలను ధ్వంసం చేయడం సరైన పద్దతి కాదని తెలిపారు. అధికారులపై భౌతిక దాడులు చేసే సంస్కృతిని ఎవరూ కూడా సహించరన్నారు. డిజిపిని కలిసిన వారిలో జేఏసీ నాయకులు కె.రామకృష్ణ, ఎస్.రాములు, రమేష్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్‌సింగ్ చౌహాన్, రాధ, తెలంగాణ నిర్మల, చంద్రశేఖర్‌గౌడ్, రాబర్ట్ బ్రూస్, పుష్పలత, తిరుపతి, విజయ్‌కుమార్, హరీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.