జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఏంఏం) పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో ఈ నెల 26న నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తేజస్వి యాదవ్, దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొంటారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జెఎంఎం నేతృత్వంలోని కూటమి విజయం సాధించడం ద్వారా సోరెన్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమైంది. జెఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), సీపీఐతో కూడిన కూటమి 81 స్థానాల్లో 56 సీట్లు గెలుచుకుంది.