- డీఎంఈ జారీ చేసిన మెమో ప్రకారం అన్ని డిప్యుటేషన్లు రద్దు
- ఆదేశాల ప్రకారం డాక్టర్ సురేఖను నీలోఫర్ హాస్పిటల్‌కు పోస్టింగ్
- గాంధీ మెడికల్ కాలేజీలోనే కొనసాగుతున్న డాక్టర్ సురేఖ
- ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ అదే స్థలంలో ఉండిపోవడంపై అనుమానాలు
- ఉన్నతాధికారుల అండ లేకుండా ఇలా జరగడం సాధ్యమేనా?
- వైద్య శాఖ దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యావేత్తల డిమాండ్
వైద్య విద్యారంగంలో నిబంధనల ఉల్లంఘనలు, పైరవీల రాజకీయాలు ఏ స్థాయిలో నడుస్తున్నాయో గాంధీ మెడికల్ కాలేజీలో జరుగుతున్న పరిణామాలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, డాక్టర్ జె.కె. సురేఖ అనే అధికారిణి గాంధీ మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా యథేచ్ఛగా కొనసాగడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి అక్రమాల పర్వం మాత్రమే కాదు, మొత్తం వైద్య విద్యా వ్యవస్థలోని లోపాలను, ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది.
డిప్యుటేషన్ రద్దు: డైరెక్టర్ ఆదేశాలు బేఖాతరు!
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఈ) ఇటీవల జారీ చేసిన మెమో ప్రకారం అన్ని డిప్యుటేషన్లు రద్దు చేయబడ్డాయి. ఈ ఆదేశాల ప్రకారం డాక్టర్ సురేఖ నీలోఫర్ హాస్పిటల్‌కు పోస్ట్ చేయబడాలి. కానీ, ఆమె ఇప్పటికీ గాంధీ మెడికల్ కాలేజీలోనే పాతుకుపోయి, తన పదవిని అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ఒక అధికారిణి కొనసాగడం వెనుక ఎలాంటి అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారుల అండదండలు లేకుండా ఇది సాధ్యం కాదని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
“ఘోస్ట్ ఫ్యాకల్టీ” ఆరోపణలు: విభాగం స్తంభన, విద్యార్థుల భవితవ్యం అంధకారం!
డాక్టర్ సురేఖపై “ఘోస్ట్ ఫ్యాకల్టీ” ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె కేవలం బయోమెట్రిక్ హాజరు వేసి వెళ్లిపోతున్నారని, పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. దీని ఫలితంగా మైక్రోబయాలజీ విభాగం పూర్తిగా స్తంభించిపోయిందని, కోవిడ్-19 సీక్వెన్సింగ్ వంటి అత్యవసర పనులు సైతం నిలిచిపోయాయని సమాచారం. ఆమె అందుబాటులో లేకపోవడం వల్ల ఎంబీబీఎస్ విద్యార్థుల అభ్యాసం తీవ్రంగా దెబ్బతింటోంది. తరగతులు సక్రమంగా జరగకపోవడం, ప్రాక్టికల్ డిస్కషన్లలో ఆమె పాల్గొనకపోవడం వల్ల విద్యార్థులు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా, పీజీ విద్యార్థుల థీసిస్ సమర్పణకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్ ఓ డి) స్థానంలో ఉండి నిబద్ధత లేకపోవడం వల్ల ఎందరో విద్యార్థుల భవితవ్యం అంధకారంలో పడుతోంది.
తక్షణ చర్యలు తీసుకోండి : విద్యావేత్తల డిమాండ్!
ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి, ప్రజాధనంతో జీతం తీసుకుంటూ, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్ సురేఖపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇలాంటి అక్రమాలు కొనసాగితే వైద్య విద్యా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని, భవిష్యత్తు తరాలు తీరని నష్టాన్ని చవిచూస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించి, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. లేకపోతే గాంధీ మెడికల్ కాలేజీలో ఈ “పైరవీల జాతర” మరిన్ని అక్రమాలకు ఊతం ఇవ్వడం ఖాయం.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారిని ఆదాబ్ ప్రతినిధి వివరణ కోరకు సంప్రదించగా.. స్పందించలేదు..
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో అవినీతి, అక్రమాలపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..