- ఈ నెల 06 నుండి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన సర్వే
- కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది
- సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది
- నవంబర్ 30 లోపు సమాచార సేకరణ పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం
- సర్వేకు ప్రజలందరూ సహకరించాలి
- రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుల గణనకు ప్రజలందరూ సహకరించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. కామారెడ్డి బహిరంగ సభలో కర్ణాటక సీఎం సిద్దిరామయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 04 ఫిబ్రవరి 2024 రోజున జరిగిన మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ కులగణన చేపట్టాలని కేబినెట్ తీర్మానించిందని అన్నారు.
రాష్ట్రంలో కులగణన చేయడం కోసం జి.ఓ. ఏంయెస్. నెం. 26, 15.03.2024 ప్రకారం బీసీ సంక్షేమ శాఖ ద్వారా 150 కోట్ల రూపాయలను విడుదల చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.జి.ఓ.ఏంయెస్. నెం. 199, ప్రకారం 06.09.2024న నిరంజన్ ను ఛైర్మన్ గా, రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మిలను మెంబర్స్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. కులగణన చేయడం కోసం జి.ఓ.ఏంయెస్. నెం. 18, తేది. 10.10.2024 ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ను నోడల్ డిపార్ట్మెంట్ గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసిందని తెలిపారు. ఈ నెల 06 నుండి 85,000 ఎన్యూమరేటర్లతో, ప్రతి పదిమంది ఎన్యూమరేటర్లకు ఒక పరిశీలకుడు ఉంటారని,నవంబర్ 30 లోపు సమాచార సేకరణ పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని,ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.
రాహుల్ గాంధీ మాట ప్రకారం జరుగుతున్న సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పథకాలను అందించడం కోసం, భవిష్యత్తు ప్రక్రియ పూర్తి చేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని వెల్లడించారు.ప్రతి తెలంగాణ బిడ్డ ఈ సర్వేలో భాగస్వాములై సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖలో పేర్కొన్నారు.