ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నోటిఫికేషన్ అనంతరం వెనువెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టి.. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో వైసీపీ పాలనకు విసిగెత్తిన ప్రజలు మాకు విస్తృత మద్దతు ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలందరికీ అందాలని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. జూన్‌లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభించి, రూ.15 వేల చొప్పున కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు 10 సూత్రాల ఆధారంగా పని చేయాలని, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకూ ప్రణాళికలు చేరాల్సిందేనని అధికారులకు సూచించారు. జీఎస్‌డీపీ, జీవీఏలతో పాటు తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెంచాలని అన్నారు. వచ్చే ఏడాదికి 15 శాతం ప్లస్ జీఎస్‌డీపీ సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలని, అందుకు వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా ఇప్పటికే కూటమి సర్కార్ డీఎస్సీ సిలబస్ విడుదల చేయగా.. వచ్చే నెలలోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయనున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఎలాంటి చిక్కులు, అడ్డంకులు ఉండకుండా జారీ చేసేందుకు, భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 16,371 టీచర్ పోస్టుల్లో.. 6,371 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1,781 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులు, 286 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు, 52 ప్రిన్సిపల్ పోస్టులు, 132 పీఈటీ టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.