నేటి డిజిటల్ యుగంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంటోంది. ఇందులో భాగంగా, మెద్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పోలీసు అధికారుల కోసం ‘కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ యుగం’పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో AI మరియు డిజిటల్ నిపుణుడు సంజయ్ వర్మ గారు గెస్ట్ ట్రైనర్‌గా పాల్గొని, ఆధునిక సాంకేతికతను ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్ ఉదాహరణలతో వివరించారు.
ఈ సెషన్‌లో సోషల్ మీడియా వేదికగా పోలీస్ శాఖ ఎలా ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ చేయవచ్చు, అధికారిక సమాచారం ఎలా పంచుకోవాలి, ఫేక్ న్యూస్‌ను ఎలా ఎదుర్కోవాలి, AI టూల్స్‌ను ఉపయోగించి విచారణను ఎలా వేగవంతం చేయాలో ముఖ్యంగా చూపించారు. డీప్‌ఫేక్, ఫిషింగ్ స్కామ్‌లు, డిజిటల్ ఫోరెన్సిక్ టూల్స్, సోషల్ మీడియా అనాలిసిస్, వాయిస్ రికగ్నిషన్ వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు. “పోలీసులకు టెక్నాలజీ ఇప్పుడు ఒక ఆయుధం లాంటిది. దాన్ని సమర్థవంతంగా వాడటం నేర్చుకోవాల్సిన అవసరం ఈ శిక్షణ ద్వారా స్పష్టమైంది,” అని సంజయ్ వర్మ గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ పి. మధుకర్ స్వామి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించగా, లక్ష్మణ్ డీఎస్పీ గారు, ఇన్‌స్పెక్టర్లు కిరణ్, రవి, చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమం ఏర్పాట్లలో పాలుపంచుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణతో పోలీస్ అధికారులు డిజిటల్ ప్రపంచంలో తమ బాధ్యతలను నూతన దృక్పథంతో నిర్వర్తించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.