అమెరికాలో మరోసారి ఖలిస్థానీ మద్దతుదారుల రెచ్చగొట్టింపు చర్యలు
కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలోని ప్రముఖ శ్రీ స్వామినారాయణ్ హిందూ ఆలయం ఖలిస్థానీ మద్దతుదారుల లక్ష్యంగా మారింది. ఆలయం వెలుపలి గోడలపై భారత వ్యతిరేక నినాదాలు, ఖలిస్థానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలేను పొగడ్తలతో కూడిన రాతలను స్ప్రే పెయింట్‌తో రాశారు. ఈ విద్వేషపూరిత చర్య స్థానిక హిందూ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఆలయ నిర్వాహకులు ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నెవార్క్ పోలీస్ విభాగం దీనిని సాధారణ విధ్వంసం కాకుండా, ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసిన దాడిగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొంది. భారతీయ సమాజం మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను సహించబోమని స్పష్టం చేసింది. నిర్వాహకుల ప్రకారం, ఈ ఏడాదిలో అమెరికాలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల్లో ఇది నాలుగోది. దీనితో, అక్కడి హిందూ సమాజంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి.