లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కు శుభవార్త. ఆ జట్టు స్టార్ పేసర్ అవేశ్ ఖాన్ తిరిగి జట్టులోకి చేరనున్నాడు. మోకాలి నొప్పితో బాధపడుతున్న అవేశ్.. తాజాగా బీసీసీఐ నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో పాస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడిని ఐపీఎల్లో ఆడటానికి అనుమతి లభించింది. నికార్సైన బౌలర్లు లేక వెలవెలబోతున్న లక్నోకు తాజాగా అవేశ్ తిరిగి రావడం చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఐపీఎల్లో ఆడిన విశేష అనుభవం అతని సొంతం. ఇక జాతీయ జట్టు తరపున గత నవంబర్ లో ను బరిలోకి దిగాడు. సౌతాఫ్రికా పర్యటనలో తను ఆడాడు. ఆ తర్వాత గాయంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలోనే రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ ఆడిన చివరి మ్యాచ్ కు కూడా తను దూరమయ్యాడు. కుడి మోకాలిలో గాయం తిరగ బెట్టడంతో తను క్రికెట్ కు కొంతకాలంగా దూరమయ్యాడు. ప్రస్తుతం తను తిరిగి రావడంతో లక్నో ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. మెగావేలంలో లక్నో పిక్ చేసిన చాలామంది ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా బౌలర్లు దూరం కావడం పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. స్పీడ్ స్టర్ మయాంక్ యాదవ్ మోకాలి గాయంతో బాధ పడుతూ చాలాకాలంగా క్రికెట్ దూరమయ్యాడు. ఈక్రమంలోనే అతనికి కాలి బొటనవేలికి గాయం అయింది. మరో పేసర్ ఆకాశ్ దీప్ ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డాడు. వెన్నునొప్పితో సతమతమవుతున్న అతడు, ఇంకా కోలుకోలేదు. మరో పేసర్ మోసిన్ ఖాన్ మోకాలి గాయంతో ఏకంగా ఐపీఎల్ కే దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ ని రీప్లేస్ మెంట్ గా టీమ్ యాజమాన్యం తీసుకుంది. ఇక ఐపీఎల్ ఈ సీజన్ లో లక్నో తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో వికెట్ తేడాతో పరాజయం పాలైంది. 209 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, లక్కు కలిసి రాక ఓడిపోయింది. తమ జట్టులో సరిపడనన్ని బౌలింగ్ వనరులు లేకపోవడంతో ఓటమి చెందామని జట్టు సహాయక కోచ్ లాన్స్ క్లూజనర్ వ్యాఖ్యానించాడు. అవేశ్ రావడంతో జట్టు బౌలింగ్ లైనప్ కాస్త గాడిన పడుతుందని, రీప్లేస్ మెంట్ గా వచ్చిన శార్దూల్ ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. ఢిల్లీపై రెండు వికెట్లతో తను రాణించాడని పేర్కొన్నాడు. ఈనెల 27న సన్ రైజర్స్ హైదరాబాద్ తో హైదరాబాద్ లో లక్నో తలపడుంది. ఈ మ్యాచ్ లో అవేశ్ ఆడే చాన్స్ ఉంది. ఇక అవేశ్ ఎప్పుడు జట్టుతో చేరతాడో అనే దానిపై స్పష్టత లేదు. తొలి మ్యాచ్ లో సన్ బ్యాటింగ్ చూశామని వారిని అడ్డుకోవాలంటే, అటు బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేయడంతోపాటు, ఇటు బ్యాటర్లు విశేషంగా రాణించాల్సి ఉంటుందని క్లూజనర్ తెలిపాడు. జట్టుకు ప్రధాన బౌలర్లు దూరమైనప్పటికీ, యువ ప్లేయర్లకు ఇది చక్కని అవకాశమని, తమను తాము నిరూపించుకునేందుకు వచ్చిన చాన్స్ ను ఉపయోగించుకోవాలని సూచించాడు.