విద్యార్థుల్లో చదువుతో పాటు వారి ఆసక్తిని గమనించి అనుగుణంగా అనేక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బీసీ గురుకుల విద్యాసంస్థ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా బిసీ గురుకుల విద్యార్థులకు సెలింగ్ క్రీడ ద్వారా శాస్త్రీయ శిక్షణతో పాటు నీటిలో నైపుణ్యం, సహనం, చురుకుదనం వంటి లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో యాచ్ క్లబ్ ఆద్వర్యంలో హుస్సేన్ సాగర్ లో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు బేసిక్ ఫౌండేషన్ కోర్సుకు అర్హత సాధిస్తారు. బేసిక్ కోర్సులో అర్హత పొందిన వారికి మెరుగైన శిక్షణ ఇవ్వడంతో పాటు వారు జాతీయ, అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో పాల్గొన్నే నైపుణ్యం వస్తుంది. 2026 లో జరిగే ఆసియన్ గేమ్స్ , 2028 జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుందని మహాత్మా జ్యోతిబా పూలే బిసీ గురుకుల విద్యాసంస్థల సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు , ఐఎఫ్ ఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బిసీ గురుకుల పాఠశాలలో చదువుతున్న 14 ఏండ్ల లోపు వయసు గల విద్యార్థులలో ఆసక్తి గలవారిని ఈ శిక్షణకు ఎంపిక చేశామని, బాలురు 32, బాలికలు 19మంది శిక్షణకు హాజరు అవుతున్నారని ఆయన తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి 11 తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, బేసిక్ శిక్షణ పూర్తి చేసిన వారిలో బెస్ట్ అనిపించిన వారికి నెక్ట్స్ లెవల్ ట్రైనింగ్ ఉంటుదని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ అందిస్తామని ఆయన వివరించారు.

