Saturday, September 28, 2024
spot_img

ఎవ‌రి కోసం బీసీ ఉద్య‌మం..

Must Read

( ప‌దేళ్ల నుండి లేని బీసీ నినాదం ఉద్య‌కారుల‌కు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది )

  • రాజకీయంగా ఎదిగేందుకా.? లేక ఆర్థికంగా బలపడేందుకా.!
  • నిజంగా బీసీ నేతలంతా ఒక్కటయ్యి రాజ్యధికారం సాధిస్తారా ?
  • బీసీ సీఎం మాట నిజమే అనుకుందాం.. ఏ బీసీని ముఖ్యమంత్రి చేస్తారు.?
  • బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీల స‌మ‌స్య‌లన్నీ నిజంగా తొలుగుతాయా..?
  • ఆర్ కృష్ణయ్య, ఈటెల, తీన్మార్ మల్లన్న, కాసాని వీరేశ్ ,జాజుల శ్రీనివాస్,
    సురేందర్, బొల్ల శివకుమార్, శ్రీనివాస్ గౌడ్, బండ ప్రకాష్, వినయ్ భాస్కర్, రవిచంద్రలు ఏకమవుతారా.?
  • లోలోపల ఎవరి స్వార్థం కోసం వారు ఆలోచిస్తున్నారా.?
  • ప్రధాన పార్టీల నేతలతో బీసీ సంఘాల నేతలు కలుస్తారా..? కలిసి నడుస్తారా ..!
  • జరుగుతున్న బీసీ ఉద్యమం మాటున ఏ మర్మం దాగుంది ?

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీల ఉద్యమం వెనుక ఉన్న ఆంతర్యమేంటో అర్ధంకావడంలేదు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందనీ ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని, 76 ఏళ్ల తరువాత కూడా చట్టసభల్లో వాటా కోసం పోరాడాల్సిన దుస్థితిఏర్పడిందని వారంటున్నారు. రాష్ట్రంలోనూ ఎక్కువ శాతం ఉన్న బహుజనులు తమకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాట్లాడని బీసీలు, తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన 10 ఏండ్లలో ఎప్పుడు గొంతెత్తలేదు. కానీ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కారాలు మీరాలు నూరుతున్నారు.. బీసీ నాయకులకు అవసరం వచ్చినప్పుడు ఒకతీరిగా.. అవసరం తీరాక మరో తీరిగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలలో బీసీలలో అగ్ర నేతలు తక్కువే ఉన్నప్పటికి వాళ్లల్లో వాళ్లకూ పొంతన కుదరకపోవడం సిగ్గనిపిస్తోంది. నిజంగా ఓసీ కులాలకు చెందిన వారికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం ఉంది. అందుకే వారికే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి . రాజ్యాధికారంలో వాటా కన్నా చట్టసభల్లో బీసీలకు 50 శాతం ఇవ్వాలని కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బడుగులకు 21 సీట్లు మాత్రమే ఇచ్చింది. గతంలో అన్యాయం జరిగినా నేటికీ పాలకులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం బాధాకరం అని లీడర్లు అభిప్రాయపడుతున్నారు.

గత ఎన్నికల్లో బీసీల మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గెలిచాక బీసీలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కార్పొరేషన్ చైర్మన్ల పదవులను బీసీలను తక్కువగా ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీలోని బలమైన బీసీ నాయకులను గుర్తించాలంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో బీసీలకు సముచిత స్థానం కల్పించకపోతే తమ ఆగ్రహానికి గురికాక తప్పదని పలువురు నేతలు హస్తం పార్టీకి అల్టిమేటం విధిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం తప్పదని వార్నింగ్ ఇస్తుండడం గమనార్హం. కానీ తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్న దాంట్లో ఏ మాత్రం నిజం లేదని కొందరు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తే అగ్రకులాలకు చెందిన వ్యక్తులే ముఖ్యమంత్రులుగా చేసిన మాట వాస్తవమే. అయితే అందులోనూ ఇద్దరు, ముగ్గురు బీసీలకు కూడా ఛాన్స్ వచ్చింది. రాష్ట్రంలో బీసీ కులాలే ఎక్కువ ఉన్నప్పటికీ వారిలో బాగా తెలివైన, రాజకీయాల్లో రాణించే వ్యక్తులు ఉంటే కదా సీఎం సీటు దక్కేది. అదంతా మరిచి ఎవరికి వారూ ఎక్కడో చోట మీటింగ్ లు పెట్టి బీసీలు బాగుపడాలంటే బీసీల రాజ్యం రావాలె.. అంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది అనే పెద్ద డైలాగ్ లు కొడ్తున్నారు కొందరు. దీని వెనుక అనేక అనుమానాలు రాకపోలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలలో ఉన్న బీసీ లీడర్లంతా ఏకమై బీసీల అధికారం కోసం కొట్లాడితే తప్పులేదు కానీ లోలోపల వాళ్ల స్వప్రయోజనాల కోసం ఆలోచించి ఉద్యమం చేస్తున్నట్టు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

రెడ్డిలంటే కోపమా, కాంగ్రెస్ అంటే నచ్చట్లేదా:

తెలంగాణలో రెండు పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ (యలమ) అతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పుడు లేవనే నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్, కుల గణన చేసి 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీలు నెరవేర్చే వరకు ఓపిక పట్టడం లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. హైకోర్డు ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో 3నెలల్లో కుల గణన చేసి రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అధికార పార్టీ చెబుతుంది. కానీ కొందరు కావాలనే అవేమీ పట్టించుకోకుండా తెలంగాణకు ఓసీ సీఎం రేవంత్ రెడ్డియే లాస్ట్ ఇక ముందు బీసీలదే రాజ్యం, 2028 ఎన్నికల తర్వాత బీసీనే ముఖ్యమంత్రి అవుతారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. జనాభాలో సగ భాగం కంటే ఎకువగా ఉన్న బీసీలకు రాజకీయాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇన్నాళ్లు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, బీసీలంటే అడుక్కునేవారిలా చూశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మొక్కుబడిగా కులగణన చేస్తామంటే ఒప్పుకునేది లేదని, 42 శాతం బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని, రాష్ట్ర క్యాబినెట్‌లోనూ బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇదీలా ఉంటే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బీసీ బిడ్డ అయిన మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. మరోవైపు రాష్ట్రంలో బీసీ కమిషన్ ఛైర్మన్ గా నిరంజన్ ను నియమించింది.

బీసీ ఉద్యమాలతో న్యాయం జరిగేనా:

తెలంగాణలో బీసీలలో 112 కులాలు ఉన్నప్పటికీ అందులో మున్నూరు కాపు, ముదిరాజ్‌, పద్మశాలి, యాదవ, గౌడ, విశ్వ బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, రజకులు ఎక్కువ మంది ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న,కాసాని వీరేశ్ ముదిరాజ్ , మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, బొల్ల శివకుమార్, బండ ప్రకాష్, రవిచంద్ర, మధుసూదనాచారి, కాసాని జ్ఞానేశ్వర్‌, తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగన్ మోహన్, టిజెఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్, టిపిసిసి నాయకులు బీమా లక్ష్మణ్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, రాష్ట్ర నాయకులు లాల్‌కృష్ణ, వివిధ బీసీ సంఘాల నాయకులు వేముల వెంకటేశ్‌, దాసు సురేష్‌, పిడికిలి రాజు, గుజ్జ సత్యం, ఎర్ర సత్యనారాయణ, శ్రీనివాస్‌, జనార్దన్‌, ఎల్.రమణ వంటి మరికొంత మంది ప్రముఖులు, ఇతర బీసీ కులాలకు చెందిన వ్యక్తులు చట్టసభలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల న్యాయమైన వాటా, కులగణన కోసం ఉద్యమాల బాటపడుతున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఈ బీసీ ఉద్యమం ఎంత వరకు సక్సెస్ అవుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలైనా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఈ సామాజిక వర్గంపై ఏం అభిప్రాయం ఉందనేది తెల్వదు. కానీ బీసీలలో మాత్రం ఐక్యత ఉందా, అవసరమోచ్చినప్పుడు పార్టీలు, కులాలకు అతీతంగా అంతా ఒక్కటైతారా కొంత మంది మాత్రమే తెరమీద కనిపిస్తున్నప్పటికీ వీళ్ల అంతర్మథనం ఏంటీ అనేది అంతుచిక్కడం లేదు. రాజకీయంగా బలపడేందుకేనా బీసీ ఉద్యమాన్ని వాడుకుంటున్నారా.. లేక బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఉద్యమాలు చేపడుతున్నారా అనేది తెలియాలి. వాస్తవంగా తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అయితే ఆ కులాలకు చెందిన నిరుపేద, పేదవారికి న్యాయం జరుగుతుందా, బీసీల ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Latest News

చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుంది

మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుందని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన, తదితర...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS