- భూభారతితో పారదర్శక విధానం
- దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలు తీరుస్తాం
- అక్కన్నపేట సదస్సులో మంత్రి పొన్నం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని.. అలాంటి తప్పులు మళ్లీ జరగొద్దనే రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో భూ భారతి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో భాగంగానే భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గురువారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి అంటేనే ఆత్మగౌరవం. అలాంటి భూమి వివాదాల్లో ఉండకుండా సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టం తీసుకొచ్చామని, రైతులకు భూ భారతి ఎంతగానో ఉపయోగ పడుతోందన్నారు. ధరణిలో 30 లక్షల మంది భూ సమస్య ఉందని పిటిషన్ పెట్టుకున్నారు. ఆ సమస్యలు భూ భారతి ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. త్వరలోనే గౌరవెల్లి కాలువల నిర్మాణం పూర్తవుతుందని.. ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని హావిూ ఇచ్చారు. ప్రాజెక్ట్ భూ సేకరణ సమయంలో కొంత మంది రైతులకు నష్టం జరిగిన వారిని ఆదుకుంటామని భరోసా కల్పించారు. భూ భారతి చట్టాన్ని అందరి ఆమోదంతోనే అమలు చేశామని మంత్రి అన్నారు.

కొంతమంది వీఆర్వోలు కేసీఆర్ చెప్పిన పనులు చేయలేదని అర్దరాత్రికి రాత్రి వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారన్నారు. త్వరలో రెవిన్యూ వ్యవస్థలో జీపీఏ వ్యవస్థను తీసుకొస్తామని అన్నారు. కొత్త చట్టం తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడాలి కాని భారంగా మారకూడదన్నారు. గత ప్రభుత్వంలో కబ్జా చేసిన ప్రభుత్వ భూములను.. అక్రమ పట్టాలను రద్దు చేస్తామన్నారు. భూభారతిపై రైతులు అవగాహన కల్పించేందుకే అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని.. భూభారతి చట్టంలో తహశీల్దార్ నుంచి సీసీఎల్‌ఏ స్థాయి వరకు సమస్యలు పరిష్కరించేందుకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. భూమి రిజిస్ట్రేషన్ కు ముందు తప్పనిసరిగా భూ సర్వే చేసి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుదంని.. భూభారతి పోర్టల్ లో అన్ని సమస్యలకు స్వయంగా దరఖాస్తు చేసుకునేలా రూపొందించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నామని, ఒక్క రూపాయి ఫీజు లేకుండా భూ సమస్యలను పరిష్కరిస్తామని.., అధికారులనే క్షేత్రస్థాయికి పంపిస్తున్నామన్నారు. నెలాఖరులోగా నాలుగు మండలాల్లో అన్ని వివరాలు సేకరించి, జూన్ 2న పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నా రు. మే1వ తేదీ నుంచి మరో 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుని భూభారతిని అమలు చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఏమైనా సూచనలు వస్తే నియమనిబంధనల్లో మార్పులు, చేర్పులు చేస్తామన్నారు.

గత ప్రభుత్వం అనాలోచనతో 2020 ధరణి చట్టాన్ని తీసుకొచ్చి… ప్రజలకు అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ధరణి చట్టాన్ని తీసుకొచ్చిన మూడేళ్ల వరకు నియమ నిబంధనలు రూపొందించలేదని… విధివిధానాలు స్పష్టంగా తెలియజేయలేదని.. కేసీఆర్ నోట ఏది వస్తే ఆ మాట ప్రకారమే నడుచుకుందన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి చేసేందుకు ఇందిరమ్మ రాజ్యంలో 2025లో భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు. అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తప్పులు చేస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సాదాబైనామాల కింద ఆన్‌లైన్‌లో ఉన్నటు-వంటి అర్హత గల దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు.