దేశంలో పలు విమానాలకు బాంబు బెదరింపులు రావడం కలకలం రేపుతుంది. గతకొన్ని రోజులుగా దేశంలో అనేక విమానాలకు, రైళ్ళకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా శనివారం దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో సంస్థకు 05 విమానాలకు, విస్తార సంస్థకు చెందిన 03 విమానాలతో పాటు మరికొన్ని విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు, సిబ్బంది వాటిని అత్యవసరంగా దించేశారు.
ఢిల్లీ నుండి లండన్ బయల్దేరిన విస్తారా విమానానికి శనివారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించారు. పారిస్ – హాంగ్ కాంగ్, ఢిల్లీ- పారిస్ విస్తారా విమానాలకు కూడా ఈ తరహా బెదిరింపులు రాగా..ఆ విమానాలను అత్యవసరంగా దించేశారు.
దుబాయి నుండి జైపూర్ కు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బెదిరింపులు రావడంతో ఆ విమానాన్ని జైపూర్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బెంగుళూరు నుండి ముంబయికి వెళ్తున్న ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించారు.