పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలంటున్న వైద్య నిపుణులు
పిల్లలు పాఠశాలల్లోకి అడుగు పెట్టే సమయాన్ని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి అత్యుత్తమ అవకాశంగా ఉపయోగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 4 నుండి 6 సంవత్సరాల వయస్సు మధ్యలో, డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు (డిటిపి), పోలియో వ్యాధులపై బూస్టర్ డోసులు తప్పకుండా వేయించాలనే సూచనలపై వారు దృష్టి సారించారు. శిశువులకు ఇచ్చే ప్రాథమిక టీకాలు కొంతకాలం రక్షణను కలిగించినప్పటికీ, పరిశోధనల ప్రకారం ఈ వ్యాధులపై యాంటీబాడీ స్థాయిలు పాఠశాల ప్రవేశ సమయానికి గణనీయంగా తగ్గిపోతున్నాయి. అందుకే జాతీయ టీకాల షెడ్యూల్ ప్రకారం, 6, 10, 14 వారాలలో ప్రాథమిక డోసుల తర్వాత, 16–24 నెలల మధ్య బూస్టర్ ఇవ్వడం తప్పనిసరి. అదనంగా, బాల్యంలో రెండు పాక్షిక పోలియో మోతాదులు కూడా సూచించబడినప్పటికీ, 4–6 ఏళ్లలో ఇచ్చే బూస్టర్ డోసు తరచూ విస్మరించబడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డైరెక్టర్ ఆఫ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ – అంకుర హాస్పిటల్, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ అంజుల్ దయాల్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో అడుగుపెడుతున్న దశలో పిల్లలు సామాజికంగా చురుకైన వాతావరణంలోకి వెళ్తున్నారు. ఈ దశలో, సిఫారసు చేయబడిన బూస్టర్ డోసులు వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కలిగిస్తాయి. ఇది పాఠశాలల్లో వ్యాధుల వ్యాప్తిని కూడా నివారించగలదని పేర్కొన్నారు. ఇమ్యునైజేషన్ ప్రయాణంలో 4–6 ఏళ్ల మధ్య బూస్టర్ డోసు ఒక కీలక మైలురాయి. సమయానికి టీకాలు వేయడం అనేది మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే నమ్మదగిన మార్గాల్లో ఒకటని ఆయన సూచించారు. ఇటీవలి కాలంలో పాఠశాలలు ఆరోగ్య పత్రాలను పునరుద్ధరించే ప్రక్రియను ప్రోత్సహిస్తుండటం వల్ల, ఈ బూస్టర్ డోసుల ప్రసక్తి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది తరగతిలో సమగ్ర రోగనిరోధక వాతావరణాన్ని ఏర్పరచడంలో తోడ్పడుతుంది. అంతేగాక, చిన్ననాటి టీకాల ప్రభావాన్ని కౌమారదశ వరకూ కొనసాగించడంలోనూ ఈ చర్యలు దోహదపడతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.