- యశోద హాస్పిటల్స్‌లో బ్రాండెడ్ మందుల మాయాజాలం
- జనరిక్ మందులకు బదులుగా, బ్రాండెడ్ జనరిక్స్ మందుల సిఫార్స్
- అధిక ధరల మందులు రాయాలని డాక్టర్లపై ఒత్తిడి
- ఆస్పత్రి ఫార్మసీలోనే కొనుగోలు చేయాలని హుకుం
- అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ప్రజారోగ్యశాఖ
- ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడికి గురవుతున్న ప్రజలు
- ప్రేక్షకపాత్రలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
భారతదేశం ప్రపంచానికి ఫార్మసీగా పేరుగాంచినా, మన దేశంలోని ప్రజలు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి గురవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ యశోద ఆస్పత్రి ఈ దోపిడీకి పరాకాష్టగా నిలిచిందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యం పేరుతో ఈ ఆస్పత్రి యాజమాన్యం అనుసరిస్తున్న బ్రాండెడ్ జనరిక్స్ వ్యాపార వ్యూహం ప్రజలను ఆర్థికంగా చిదిమేస్తోందని వార్త కథనాలు వస్తున్నాయి..
యశోద ఆస్పత్రిలోని అన్ని బ్రాంచ్‌లలోని డాక్టర్లు రోగులకు జనరిక్ మందులకు బదులుగా, అధిక ధరలు కలిగిన బ్రాండెడ్ జనరిక్స్ మందులను మాత్రమే సిఫార్సు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా, రోగులను ఆస్పత్రిలోని ఫార్మసీలోనే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. దీని వెనుక, ఫార్మా కంపెనీలతో యశోద యాజమాన్యం రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని, డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి అధిక ధరల మందులను రాయాలని ఆదేశిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి..
యశోద దోపిడీ విధానంపై దర్యాప్తు అవసరం
వైద్యులు దేవుళ్లతో సమానం అని నమ్మే ప్రజల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని ఈ అన్యాయానికి పాల్పడుతున్నారని విమర్శకులు అంటున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం, డాక్టర్లు రసాయన ఫార్ములా పేరు (ఉదాహరణకు, పారాసిటమాల్) మాత్రమే రాయాలి. కానీ, వైద్యులు ఈ నిబంధనలను పక్కనపెట్టి, డోలో లేదా కాల్‌పాల్ వంటి బ్రాండెడ్ మందులను సూచిస్తున్నారని సమాచారం. దీనివల్ల సామాన్య ప్రజలు చిన్నపాటి ఆరోగ్య సమస్యకు కూడా లక్షల రూపాయల బిల్లులు చెల్లించాల్సి వస్తోంది.
యశోద హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతి హాస్పిటల్ యొక్క ఇన్-పేషెంట్, ఔట్-పేషెంట్, మరియు ఫార్మసీ రికార్డులను పరిశీలిస్తే, బ్రాండెడ్ జనరిక్స్ మందులను రాసి ఎంత దోపిడీ చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు చేస్తే, ఈ దోపిడీ విధానం పూర్తిగా బట్టబయలు అవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఈ దోపిడీని అరికట్టాల్సిన వైద్య ఆరోగ్య శాఖ, ప్రజారోగ్య శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీని వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా లేదా పాలకులు కూడా ఈ దోపిడీలో భాగస్వాములా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఈ వార్త సారాంశం చెబుతోంది. ఈ అన్యాయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి యశోద హాస్పిటల్ యాజమాన్యానికి వివరణ కోరడం జరిగింది. స్పందించిన యాజమాన్యం, యశోద హాస్పిటల్స్‌లో ప్రతి డాక్టరూ ఫార్ములా పేరునే రాస్తారని, ఆసుపత్రి ఫార్మసీలోనే మందులు కొనాలని ఎలాంటి ఒత్తిడి లేదా నిబంధన లేవని స్పష్టం చేసింది. అదేవిధంగా రోగులు వ్యాధులకు సంబంధించి టెస్టులను ఏ డయాగ్నోస్టిక్స్ సెంటర్‌కు అయినా వెల్లవచ్చని తెలిపారు.
జనరిక్ మందుల తక్కువ ప్రాచుర్యం – కారణాలు, పరిణామాలు
భారతదేశం “ప్రపంచ ఫార్మసీ”గా పేరు పొందింది. అనేక అభివృద్ధి చెందిన దేశాలకు తక్కువ ధరల జనరిక్ మందులు సరఫరా చేస్తూ, అక్కడి ప్రజల ఆరోగ్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోంది. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో రెండు ప్రధాన విభాగాలు మాత్రమే ఉంటాయి – పేటెంట్ ఉన్న మందులు మరియు జనరిక్ మందులు. పేటెంట్ గడువు ముగిసిన వెంటనే జనరిక్ మందులు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. కానీ భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ మూడో ప్రత్యేక వర్గం – బ్రాండెడ్ జనరిక్స్ – బలమైన ఆధిపత్యం చెలాయిస్తోంది. అంటే, పేటెంట్ గడువు ముగిసిన మందులను కూడా కంపెనీలు తమ బ్రాండ్ పేర్లతో, అధిక ధరలకు విక్రయిస్తున్నాయి.
ద్వంద్వ ప్రమాణాలు
భారతీయ ఫార్మా కంపెనీలు అభివృద్ధి చెందిన దేశాలకు నాణ్యమైన, తక్కువ ధరల జనరిక్ మందులు ఎగుమతి చేస్తాయి. అక్కడి ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే, అదే కంపెనీలు భారతదేశంలో ఆ మందులనే బ్రాండెడ్ జనరిక్స్ రూపంలో అధిక ధరలకు అమ్ముతూ, మన ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.
లాబీయింగ్ మరియు అడ్డంకులు
జనరిక్ మందుల విస్తృత ప్రాచుర్యానికి బ్రాండెడ్ జనరిక్స్ ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఈ విభాగాన్ని తొలగించి, మార్కెట్‌ను పూర్తిగా జనరిక్ మందులకు మాత్రమే పరిమితం చేయాలని కొంతమంది నిపుణులు కోరుతున్నారు. అయితే, బలమైన ఫార్మా లాబీయింగ్ కారణంగా ఈ మార్పులు అమలులోకి రావడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.