ఈసారి ఐపీఎల్‌మాచ్‌ల్లో విభిన్నమైన, ఆసక్తికరమైన విషయం కనిపించింది. మ్యాచ్ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లే కాదు, ఒక అందమైన రోబోటిక్ కుక్క కూడా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రివల్యూషన్ నెక్ట్స్ లెవల్ కు చేరుకుంది. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బీసీసీఐ ముందుందని మరోసారి నిరూపించుకుంది. ఐపీఎల్ నయా ఎడిషన్ లో రోబోటిక్ డాగ్ ను పరిచయం చేసింది బీసీసీఐ. చూడటానికి కుక్క ఆకారంలో ఉన్న ఈ రోబోకు హైక్వాలిటీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. ఆటలోని వైవిధ్యమైన విషయాలను ప్రెజెంట్ చేస్తూ ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇస్తోంది ఈ కెమెరా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మాజీ లెజెండరీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత డానీ మోరిసన్ ఈ రోబో కుక్కను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ వీడియోలో, రోబో కుక్క ఐపీఎల్ కవరేజ్‌లో భాగమవుతుందని మోరిసన్ చెప్పాడు. మోరిసన్ స్వరానికి రోబో ఎలా స్పందిస్తుందో వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఐపీఎల్ ఒక వీడియోను షేర్ చేసి, రోబో కుక్కకు పేరు సూచించమని విజ్ఞప్తి చేసింది. వీడియోను షేర్ చేస్తూ ఐపీఎల్ ఇలా రాసింది, “ఓహ్ వావ్! ఐపీఎల్ కుటుంబంలోకి కొత్త సభ్యుడు మన నగరానికి వచ్చాడు. అది నడవగలదు, పరిగెత్తగలదు, దూకగలదు.. మిమ్మల్ని నవ్వించగలదు. టాటా ఐపీఎల్ ప్రసార కుటుంబంలోని కొత్త సభ్యుడిని కలవండి. మా బొచ్చుగల చిన్న స్నేహితుడికి పేరు పెట్టడంలో మీరు మాకు సహాయం చేయగలరా?” అంటూ పోస్ట్ చేసింది.