(ఊర చెరువు నుండి వచ్చే కాల్వ కనుమరుగు.!)
-సంజీవని రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం
-ఇరిగేషన్ అధికారుల ఫుల్ సఫోర్ట్
-రంగారెడ్డి జిల్లా రాయికల్ లో విచిత్రం
-సహజ కాల్వపై స్లాబ్ నిర్మాణం.. ఇరువైపులా వెంచర్
-చేసేదేంలేక కాల్వను సగానికిపైగా తగ్గించి దర్జా కబ్జా
-లంచం తీసుకొని ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు
-సీఈ, ఎస్ఈ, డీఈ, ఏఈల అండదండలతో కాల్వను చంపేసిండ్రు
-నిన్న ఇరిగేషన్ శాఖలో కోట్లు కూడబెట్టి దొరికిపోయిన ఏఈ నిఖేష్
-పై స్థాయి అధికారులపైన కూడా ఈడీ, ఐటీ గురిపెట్టాలంటున్న స్థానికులు
తెలంగాణ రాష్ట్రంలో భూములు మింగేవాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యమేం లేదు. కానీ చెరువులు, కుంటలు, సహజ కాల్వలను కూడా పొతం పెట్టుడుల మనకంటే తోపు ఎవరూ లేరు. ‘అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు’ అన్నట్టు భూములకు అమ్మ అయ్య ఉండరు కాబట్టి.. వాటిని ఏం చేసినా అడిగే వాడు లేడు కదా… నోరు తెరిచి మాట్లాడావు కాబట్టి ఇష్టారీతిన చెరువులు, సహజ నదులు, కాల్వలను కబ్జా చేసుడు పనిగా పెట్టుకుంటున్నరు అక్రమార్కులు. దీనికి అధికారులు నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటున్నది. ‘అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు’ ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్స్, చెరువులు, కుంటలు, సహజ నదులను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అప్పనంగా అప్పగించేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ చుట్టు పక్కలా ఉన్న రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని భూముల ధరలు ఆకాశాన్నంటడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడా సెంట్ భూమి కనిపించినా కబ్జాచేస్తున్నారు.
రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందనడానికి ఇటీవల కాలంలో పట్టుబడుతున్న ఇరిగేషన్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులే నిదర్శనం. ఎవరైనా తమ పని చేయాలని గవర్నమెంట్ ఆఫీస్ కు వెళ్తే చాలు చేస్తే మాకేంటి అంటూ డైరెక్ట్ డిమాండ్ చేస్తున్నారంట. ఇందులో భాగంగానే 10వేల నంచి లక్ష రూపాయల వరకు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోతున్నారు. నిన్న రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో వరుస రైడ్స్ జరుగుతుండగా సుమారు రూ.300కోట్లకు పైనే ఆయన అక్రమాస్తులు బయటపడడం ఆశ్చర్యం. 2013లో నౌకర్ లోకి ఎక్కిన నిఖేష్ ఇన్ని వందల కోట్ల ఎట్లా వేనకేశాడనే దర్యాప్తు అధికారులకే అంతుచిక్కడం లేదు. ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ని కోట్లు సంపాదించాడంటే ఇంకా ఇతని పై అధికారుల ఆస్తులు ఎంత ఉంటాయోనని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన ఊర చెరువుకు సంబంధించిన కాల్వను కబ్జా చేసింది సంజీవని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ సంస్థ. గ్రామానికి చెందిన సర్వే నెం. 248/పి, 249/పి, 250, 251, 252 మరియు 257పి లలో గల దాదాపు 5ఎకరాల 13గుంటలలో లేఅవుట్ నిర్మాణం చేపట్టారు. అయితే దీని వెంట ఊర చెరువు నుంచి ప్రవహించే గొలుసు కట్టు కాల్వలను సదరు సంస్థ పొతం పెట్టింది. అట్టి గొలుసు కట్టు కాల్వలను టీఎల్పీ నెం.74/2023/హెచ్ఆర్ఓ/హెచ్1 చెరువుకు సంబంధించిన కాల్వులను కబ్జాచేసి లేఅవుట్ చేసింది. గ్రామ నక్ష ప్రకారం, రెవెన్యూ రికార్డుల ప్రకారం సుమారు 30 ఫీట్ల వెడల్పు గల సహజ కాల్వను 12 ఫీట్ల వెడల్పునకు కుదించడం గమనార్హం. ఇందుకు గాను ఇరిగేషన్ అధికారులు ఛీప్ ఇంజనీర్ ధర్మ, ఎస్ఈ రంగారెడ్డి, డీఈ కరుణశ్రీ, ఏఈ శ్రీకళలకు మాముళ్లు ముట్టజెప్పి మరీ ఎన్ఓసీ పొందడం జరిగింది.
ఇంకా ఏంటీ నీటిపారుదల శాఖ అధికారుల ఫుల్ సపోర్ట్ తో దర్జాగా ఊర చెరువు సంబంధించిన సహజ కాల్వను సగానికి పైగా కబ్జా చేయడం జరిగింది. మిగిలిన సగాన్ని కూడా బాక్స్ డ్రైన్ గా మార్చివేసి సహజ కాల్వను చంపేయడం సంజీవని ప్రాజెక్ట్స్ యాజమాన్యం వంతైంది. కాల్వకు రెండు వైపులా ఈ సంస్థ వెంచర్ ఉండడం వల్ల ఇరిగేషన్ శాఖ అధికారులను డబ్బులతో మచ్చిక చేసుకొని దర్జాగా ఎన్ఓసి పొందింది. ఇంకేంటి అండర్ గ్రౌండ్ డ్రైన్ గా ఊర చెరువు నుంచి వచ్చి కాల్వను నిర్మాణం చేశారు. ‘అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు’ ఇరిగేషన్ అధికారులు సహజ కాల్వను చంపేయడానికి ఎట్లా ఎన్ఓసీ ఇచ్చారనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. దీనిపై ‘ఆదాబ్ హైదరాబాద్’ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రాయికల్ గ్రామ పరిధిలోని ఊర చెరువుకు సంబంధించిన సహజ కాల్వను ఎట్లా బందించి చంపేస్తారని వివరణ కోరింది. ఎన్ఓసీ ఇచ్చిన ఛీప్ ఇంజనీర్, డీఈ, ఎస్ఈ, ఏఈలపై ఎంక్వైరీ చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సింది కోరడం జరిగింది.
మరోవైపు ఈ ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులపైన ఈడీ, ఐటీ అధికారులు సైతం దృష్టిసారించి వీరి అక్రమాస్తుల లెక్కలు తీయాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. మొన్న దొరికిన నిఖేష్ ఆస్తులు తెలిసి రాష్ట్రమంతా అవాక్కుతున్నందున, ఇతగాడి పై అధికారుల ఆధ్వర్యంలో నిఖేష్ లాంటి ఏఈలు ఎంతో మంది ఉంటారు.. అలాంటప్పుడు పై అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. కావున వీరి ఆస్తులు కూడా లెక్కిస్తే ఆశ్చర్యకరమైన నిజాలు తేలే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపైనా ఎంక్వైరీ జరిగేలా చూడాల్సిందిగా పలువురు మేధావులు డిమాండ్ చేస్తున్నారు.
ఇరిగేషన్ శాఖలో చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో జరిగిన మరిన్ని అక్రమ వ్యవహారాలు మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానున్నది ఆదాబ్ హైదరాబాద్..మా అక్షరం..అవినీతిపై అస్త్రం.