- ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు
- జూన్ 2 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి
- సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం
- కొత్త పోర్టల్ ప్రారంభించిన సిఎం రేవంత్
- ధరణి ఓ పీడకల లాంటిదని సిఎం విమర్శలు
ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూభారతి తసుకొచ్చింది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శిల్పకళా వేదికగా సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’భూభారతి’ పోర్టల్ ప్రారంభమైంది. తొలుత ఈ కార్యక్రమాన్ని మూడు మండలాల్లో అమలు చేయనున్నారు. జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోర్టల్ అందుబాటులోకి రానుంది. ప్రజల నుంచి అవసరమైన సూచనలు స్వీకరించి, తగిన మార్పులు చేయాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి వచ్చే స్పందన మేరకు ఈ పోర్టల్‌ను ఎప్పటికప్పుడు ఆధునీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, పొన్నం, జూపల్లి, మేయర్ గద్వాల విజయలక్ష్‌విూ పలువురు నేతలు, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాతుతూ.. ధరణి రాష్ట్ర రైతులకు ఒక పీడ కల లాంటిదని అభివర్ణించారు. ధరణి పోర్టల్‌తోనే తహసీల్దార్‌పై పెట్రోల్ పోసి హత్య చేసే పరిస్థితి తలెత్తిందన్నారు. గత 65 ఏండ్లుగా భూములకు సంబంధించిన వివరాలను రెవిన్యూ సిబ్బందే కాపాడారు.. కానీ గత బీఆర్‌ఎస్ పాలకులకు ధరణి వచ్చాకే రెవిన్యూ సిబ్బంది దొంగలుగా కనిపించారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపి వేలాది ఎకరాలను కొల్లగొట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన భూచట్టాలను ఉన్నఫళంగా తొలగించి.. ధరణి పోర్టల్ తీసుకొచ్చారని.. ధరణితో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి అన్ని వివరాలను పొందుపరిచిందని
అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున భూభారతి చట్టాన్ని 69 లక్షల కుటుంబాలకు అంకితం చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో 100 ఏళ్లు భూముల కోసమే పోరాటం జరిగిందని.. నిజాంకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటం చేశారని గుర్తు చేశారు. పాదయాత్ర సమయంలో రాష్ట్రంలోని భూసమస్యలు తెలుసుకున్నానని.. అప్పుడే ధరణి స్థానంలో కొత్త వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించుకున్నామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చాక ధరణిని బంగళాఖాతంలో వేస్తామని అనాడే చెప్పాం.. చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను తీసేసి దాని స్థానంలో భూభారతి తీసుకొచ్చామన్నారు. వివిధ రాష్ట్రాల్లో భూచట్టాలను పరిశీలించాకే భూభారతి చట్టం రూపొందించామని తెలిపారు. అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకున్నాకే దీనిని ప్రారంభించామన్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా 4 మండలాలను తీసుకున్నామన్నారు. ప్రతీ గ్రామంలో రెవెన్యూ అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే రెవెన్యూ సిబ్బంది ముఖ్యం. రెవెన్యూ సిబ్బందిని మా ప్రభుత్వం 100 శాతం నమ్ముతుందని పేర్కొన్నారు. తాము చేసే తప్పులకు రెవెన్యూ సిబ్బందిని బలి చేసే సంస్కృతికి మేం వ్యతిరేకమని స్పష్టం చేశారు. గత సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను ఎలా దూషించారో చూశాం. ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టే వ్యవహారం చేశారు. కానీ రెవెన్యూ సిబ్బంది ఆత్మగౌరవమే మా ఆత్మగౌరవమని అన్నారు. 69 లక్షల మందికి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ శాఖ రెండు కళ్లలాంటివన్నారు. మనుషులకు ఆధార్ మాదిరిగా భూములకు భూదార్ అని అన్నారు. భూమి హద్దులు నిర్ణయించేంది రెవెన్యూ సిబ్బందేనని.. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రెవెన్యూ సిబ్బంది చూసుకోవాలని సూచించారు. రైతులు పిలిచి భోజనం పెట్టి మాట్లాడేలా రెవెన్యూ సిబ్బంది తీరు ఉండాలని పేర్కొన్నారు.
రెవెన్యూ అధికారులు ప్రతి మండలంలో పర్యటించాల్సిదేనన్నారు. ఇకపోతే ప్రయోగాత్మకంగా 3 మండలాల్లో ఈ పోర్టల్‌ను అమలు చేయనున్నారు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజల నుంచి అవసరమైన సూచనలు స్వీకరించి, తగు మార్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే స్పందన మేరకు ఎప్పటికప్పుడు పోర్టల్‌ను అప్‌డేట్ చేయనున్నారు. 566 రైతువేదికలలో భూ భారతి పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. భూ భారతి అమలుకు పైలట్ ప్రాజెక్ట్ గా నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్, రంగారెడ్డి జిల్లాలోని కీసర, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇన్నాళ్లు ధరణి పోర్టల్‌లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు.. ఇకపై భూభారతి పోర్టల్‌లోనే జరగనున్నాయి. గతంలో ధరణి తీసుకొచ్చిన సమయంలో భూముల లావాదేవీలకు కొన్నిరోజుల పాటు ఆటంకం ఏర్పడగా, ఈసారి అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ప్లాన్ చేశారు. ధరణిలో ఎలాంటి సేవలు అందాయో, ఇప్పుడు అవన్నీ భూభారతిలోనూ యథావిధిగా అందనున్నాయి. భూములకు సంబంధించి తాజా సమాచారం అలాగే ఉండనుంది. ఎలాంటి మార్పులు ఉండవు.
అయితే రైతులకు అర్థమయ్యేలా ఇంతకుముందు ఉన్న 33 మాడ్యుల్స్‌ను ఆరుకు కుదించారు. యూజర్ ఫ్రెండ్లీగా వెబ్ పోర్టల్‌ను తీసుకురావడమే కాకుండా ఇతర టెక్నికల్ సమస్యలను తొలగించారు. భూభారతి చట్టాన్ని పోయినేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన గైడ్‌లైన్స్ రెడీ చేసి, ఏప్రిల్ 14 నుంచి దశలవారీగా అమలులోకి తీసుకుని వచ్చింది. చట్టంలోని అన్ని అంశాలను ఒకేసారి అమలు చేస్తే మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం.. ఒక్కొక్కటిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టంలో మొత్తం 23 అంశాలు ఉన్నాయి. ప్రతి సెక్షన్ అత్యంత కీలకంగా ఉంది. ప్రతిదీ వెబ్ పోర్టల్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ముందుగా సులువుగా ఉన్న వాటన్నింటినీ అమలు చేయనున్నారు. ఆ తర్వాత టెక్నాలజీని జోడిరచి, ఒక్కోదాన్ని అమలు చేసుకుంటూ వెళ్లనున్నారు. ఇప్పుడైతే రాష్ట్రవ్యాప్తంగా పోర్టల్ అందుబాటులోకి వస్తుంది.
ఇకపై అందులోనే భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి.. అయితే భూభారతి చట్టం అమలు, పోర్టల్ నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? అనేది తెలుసుకునేందుకు మూడు మండలాల్లో అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్ రంగారెడ్డి జిల్లాలోని కీసర, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మండలాల్లో వంద శాతం భూసమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నది. ఇంతకుముందు ధరణిలా కాకుండా రైతులు తమ భూమి వివరాలను తేలిగ్గా తెలుసుకునేలా భూభారతి పోర్టల్ రూపొందించారు.