Monday, March 31, 2025
spot_img

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

Must Read
  • జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
  • 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
  • 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
  • కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానంలో సిఎం రేవంత్‌

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేయాలన్న కుట్రలో కేంద్రం ఉందని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు ఇందుకు దోహదపడుతోందన్నారు. దీనిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, కేవలం రాష్ట్రం యూనిట్‌గా మాత్రమే సీట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్టాల్రు నష్టపోతాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 శాతం 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల‌ను నియంత్రించడానికి నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రం వినియోగించుకుంటోంది. రాజకీయాలకు అతీతంగా దీనిపై ఒకే మాటపై నిలబడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అందుకే ఇవాళ సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టాం అని సీఎం పేర్కొన్నారు. డీలిమిటేషన్‌ వల్ల జనాభా నియంత్రణ శాపం కాకూడదన్నారు. డీలిమిటేషన్‌ వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకూడదని, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలన్నారు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలన్నారు. అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతనే లోక్‌సభ సీట్ల పునర్విభజన చేయాలని సీఎం పేర్కొన్నారు. పునర్విభజన పారదర్శనకంగా జరగాలి. జనాభా నియంత్రణ శాపం కాకూడదు. జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదని అన్నారు.. దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి కూడా పునర్విభన 25 ఏండ్లు వాయిదా వేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే ఆలోచన సరికాదు. కేంద్రమే నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి అంటున్నారు. కేంద్రానికి తెలంగాణసభ నుండి తీర్మానం చేసి పంపాలని నిర్ణయం తీసుకున్నామని శాసనసభలో సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు తెలపాలని అన్నారు.

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం చెడిపోతుందని ఆనాడు ఇందిరా గాంధీ భావించారు. అందుకే చట్టాన్ని సవరించి పునర్విభజన చేశారు. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ చర్చకు రావడంతో దక్షిణాదిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని సిఎం రేవంత్‌ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల‌కు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయి. ఇకపోతే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలను పునర్విభజన చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మనపై వివక్ష చూపుతోందని 11 ఏళ్లుగా ఈ అంశాన్ని తొక్కిపెట్టిందని అన్నారు. 2026 జనాభా లెక్కింపు తర్వాతే చేపడతామని ఆనాడు పార్లమెంట్లో తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగాన్ని సవరించి 2011 జనభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను 83 నుంచి 90కి పెంచారు. సిక్కింలో 2018లో కేబినెట్‌ రిజల్యూషన్‌ పాస్‌ చేసి ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన పక్రియ కొనసాగిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ప్రజల ముందుంచేందుకే సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టామని సిఎం అన్నారు. రాజకీయాలకు అతీతంగా పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిద్దాం. అవసరమైతే పోరాటబాట పడుదాం. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, కెకెల ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తాం. ఈ సమావేశానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. నిజానికి డీలిమిటేషన్‌పై గందరగోళం నెలకొందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ డీలిమిటేషన్‌పై సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించ బోమని తీర్మానం చేశామని, జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను దివంగత ప్రధాని వాజ్‌పేయీ కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు. డీలిమిటేషన్‌పై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కొందరు అంటున్నారని, జనాభా నియంత్రణపై కేంద్ర ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదన్నారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అందరూ ఒకే మాటపై ఉండాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనే కొనసాగించాలి. అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించబోమని తీర్మానం చేశారు. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్‌ను వాజ్‌పేయీ కూడా వ్యతిరేకించారు. 24 శాతం ప్రాతినిధ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి 36 శాతం పన్నులు కడుతున్నాయి. కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు చాలా తక్కువ వస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌కు మాత్రం కేంద్రం పన్నుల్లో ఎక్కువ వాటా ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Latest News

నిశ్చితార్థం అయిన తర్వాత బట్టతల ఉందని పెళ్లికి నిరాకరణ

మనస్తాపంతో యువకుడి బలవన్మరణం నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లికి యువతి నిరాకరించడంతో యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ జీఆర్పీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS