Thursday, March 20, 2025
spot_img

ప్రభుత్వ భూముల్లో ముడుపుల‌తో నిర్మాణ అనుమతులు

Must Read
  • ఎల్.బీ. నగర్ పరిధిలో వెలుగు చూసిన అవినీతి భాగోతం
  • నాగోల్ గ్రామంలో కొత్తగా హరిపురి కాలనీ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ..
  • ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి సుమారు రూ. 10 లక్షలు అనుమతులు
  • టి.ఎస్.బి.పాస్ వెబ్ సైట్ పారదర్శకత లేకపోవడాన్ని దురదృష్టకరం..
  • దీన్ని అలుసుగా చేసుకుని లక్షలు దండుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
  • సబ్ రిజిస్ట్రార్ సైతం లక్షల్లో ముడుపుల అందుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు..!
  • ఎల్బీనగర్ జోన్ సర్కిల్ – 3 డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య నిర్ధేశకత్వంలోనే ఈ తతంగం..
  • ఎల్బీనగర్ జోన్ లో అవినీతి అక్రమాలపై ఆర్టీఐలకు, ఫిర్యాదులకు స్పందించని అధికార గణం..
  • జి.హెచ్.ఎం.సి. కమిషనర్ ఇలంబర్తి, ఈ అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలి..
  • జి.హెచ్.ఎం.సి మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైడ్రా రంగనాథ్, సీ..ఎం రేవంత్ రెడ్డి లు దృష్టి సారించాలి.

ప్రభుత్వ భూమని తెలిసే తప్పుడు దస్త్రాలు సృష్టించి యథేచ్ఛగా కబ్జాపర్వం సాగుతోంది.. ఆ తదుపరి కోర్టును తప్పుదోవ పట్టించడం కబ్జాకోరులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది.. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నా పద్ధతి మార్చుకోవడం లేదు.. డిప్యూటీ కమిషనర్ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి కబ్జాదారులకు దాసోహం అంటూ ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నాడు.. డబ్బే ప్రధానం.. ఇంకేదీ నాకు అనవసరం అంటూ సిగ్గూ, ఎగ్గూ లేకుండా తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నాడు.. తన జేబులు నిండితే చాలు.. ప్రజలు ఎన్నుకున్న, ప్రజలకోసం పనిచేస్తున్న ప్రభుత్వం ముందుచూపుతో తీసుకువస్తున్న విధి విధానాలు, చట్టాలు అంటే డోంట్ కేర్.. చివరకి కోర్టులను సైతం మభ్యపెట్టే నికృష్ట స్థాయికి దిగజారిపోతున్నారు.. ఇలాంటి అధికారులను ఊరకే వదిలేస్తే రాబోవు రోజుల్లో తొండ ముదిరి ఊసరవెల్లిలా మారినట్లు మరింత ప్రమాదకరంగా మారిపోతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు..

విశ్వనగరాల సరసన చేరుతున్న హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతూ ప్రపంచస్థాయిలో ప్రత్యేకతను సంతరించుకుంటోంది.. ఇలాంటి మహత్తరమైన తరుణంలో హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరిస్తున్న దృష్ట్యా.. ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచేందుకు.. ప్రజల కోసం భవిష్యత్తులో పార్కులు, ఆట స్థలాలు, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ భూమి ఎంతో దోహదపడుతుంది.. ఈ ప్రభుత్వ భూమి రాను రాను కనుమరుగైపోతున్న పరిస్థితి.. గత ప్రభుత్వం ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఇలా నాయకులు ఇష్టం వచ్చినట్లుగా కబ్జాలు చేసి సగం వరకు స్వాహా అనిపించారు.. ఇదే మార్గంలో ఒక రియాల్టర్ కొత్త రూటును ఎంచుకొని ఏకంగా ప్రభుత్వ భూమిలో మున్సిపల్ శాఖ నుండి సంబంధిత అధికారికి లక్షల్లో ముడుపులు వెదజల్లి నిర్మాణ అనుమతులు తీసుకొని.. పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగించి.. గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి.. ఆ గేటెడ్ కమ్యూనిటీకి తెలివిగా హరిపురి కాలనీ అని పేరు పెట్టి, ఇంటిని కోటి 50 లక్షల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది.. విస్తుపోయే వాస్తవాలు ఓసారి చూద్దాం..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్, సర్కిల్ – 3 పరిధిలోని నాగోల్ డివిజన్, సర్వేనెంబర్ 87/4, నాగోల్ విలేజ్, ఉప్పల్ మండలం.. ఇక్కడ ఇంచుమించు 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.. ఈ భూమి లావణ్య పట్టాగా నిషేధ జాబితాలో ఉంది.. కానీ ఓ అతి తెలివి కబ్జాకోరు కోర్టును ఆశ్రయించి, కోర్టును తప్పుదోవ పట్టించి, ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా మింగేద్దాం అనే ఆలోచనతో తన కుయుక్తులతో చక్రం తిప్పాడు.. అయితే కోర్టు మాత్రం కబ్జాకోరుకు అనుకూలంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు.. కాగా కోర్టులో దీనికి సంబంధించిన కేసు ఇంకా నడుస్తూనే ఉంది..

కోర్టు కేసు వివరాలు ఇలా ఉన్నాయి :
డబ్ల్యు.పీ. 45583/2016, పిట్ట హరినాథ్ రెడ్డి మరియు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్టిక్ కలెక్టర్ రంగారెడ్డి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రంగారెడ్డి, సబ్ రిజిస్ట్రార్ బైరాములగూడా, తహసిల్దారు ఉప్పల్.. మధ్య కేసు నడుస్తున్న పరిణామం నెలకొంది.. అయితే కేసు పెండింగ్ లో ఉన్న దరిమిలా కోర్టు ఎలాంటి డైరెక్షన్లు ఇవ్వకుండానే.. మున్సిపల్ అధికారులు పదుల సంఖ్యలో ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు. ఇది ఎలా సాధ్యం అయ్యింది.. పైగా ఈ లావణ్య పట్టాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి కన్విన్స్ డీడ్ మంజూరు చేయకపోవడం గమనార్హం..

జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ సర్కిల్ – 3 టౌన్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్ కుమ్మక్కై ఒక్కో నిర్మాణ అనుమతికి సుమారు రూ. 10 లక్షల చొప్పున లంచాలు తీసుకొని ఏకంగా ప్రభుత్వ స్థలంలో అనుమతులు ఇచ్చారు.

దీనికి సంబంధించిన ఆధారాలు ఒకసారి గమనిస్తే :
1) పర్మిట్ నెంబర్ : 334202/9991/జీ.హెచ్.ఎం.సి./2023
2) పర్మిట్ నెంబర్ : 334198/9995/జీ.హెచ్.ఎం.సి./2023
3) పర్మిట్ నెంబర్ : 334196/9997/జీ.హెచ్.ఎం.సి/2023
4) పర్మిట్ నెంబర్ : 334194/9998/జీ.హెచ్.ఎం.సి/2023
5) పర్మిట్ నెంబర్ : 334188/9999/జీ.హెచ్.ఎం.సి./2023
6) పర్మిట్ నెంబర్ : 334183/10001/జీ.హెచ్.ఎం.సి./2023
7) పర్మిట్ నెంబర్ : 334176/10003/జీ.హెచ్.ఎం.సి. /2023
8) పర్మిట్ నెంబర్ : 334166/10004/జీ.హెచ్.ఎం.సి./2023

కాగా ఈ విషయంపై పూర్తి ఆధారాలతో సామాజిక కార్యకర్తలు రాతపూర్వక ఫిర్యాదులు ఇస్తే.. ఫిర్యాదులను, ఆర్టిఐకి సంబంధించిన ఫైళ్లను తొక్కిపెడుతున్నాడు డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య.. ఈ విషయంపై జోనల్ కమిషనర్ ని, ఎస్టిఎఫ్.టీంని ప్రశ్నిస్తే ఏలాంటి జవాబు చెప్పకపోవడం అవినీతికి అమ్ముడుపోయారు అనడానికి నిదర్శనం.. మరి అంతులేని అవినీతికి పాల్పడ్డ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్యను నిలువరించే ఉన్నతాధికారులు గానీ, ప్రభుత్వ పెద్దలు గానే ఎవరూ లేరా..? ఒకవేళ ఉన్నా వీరంతా సదరు తిప్పర్తి యాదయ్యకు వత్తాసు పలుకుతున్నారా..? లేక వారిని యాదయ్యే తన గుప్పిట్లో పెట్టుకున్నాడా..? ఈ విషయాలు బహిర్గతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. తిప్పర్తి యాదయ్య చేస్తున్న తప్పులను, మరిన్ని విస్తుపోయే వాస్తవాలను మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

Latest News

అమరావతికి అంతర్జాతీయ సంస్థల రుణాలు

రైల్వే ప్రాజెక్ట్‌ ఖర్చు కేంద్రమే భరిస్తుంది శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS