వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన అమరవీరుల స్మారక జాతాలు మంగళవారం మదురైకు చేరుకున్నాయి. అందులో భాగంగానే జాతాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కామ్రేడ్ సింగరవేలర్ స్మారక జాతా చెన్నై నుండి మదురైలోని పార్టీ మహాసభ వేదిక వరకు కొనసాగుతోంది. సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె బాలభారతి జాతాకు నాయకత్వం వహిస్తున్నారు. దీనిలో వందలాది మంది కామ్రేడ్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ జాతా ప్రారంభం సందర్భంగా చెన్నై శివార్లలోని తాంబరంలో బహిరంగ సభ జరిగింది. విద్యార్థి అమరవీరులు సోము, సెంబు త్యాగాలను గౌరవించే జాతా తూత్తుకుడి నుండి మధురైలోని పార్టీ మహాసభ వేదిక వరకు కొనసాగింది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి సంపత్ ఈ జాతాకు నాయకత్వం వహించారు. విద్యార్థి సంఘం నేతలు, పార్టీ నాయకుల సమక్షంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కెజి భాస్కరన్‌కు జ్యోతిని అందజేశారు. సేలం జైలు అమరవీరుల స్మారక జాతా సేలం సెంట్రల్ జైలు నుండి ప్రారంభమైంది. 1946లో ఉరితీయబడిన నలుగురు యువ వస్త్ర మిల్లు కార్మికుల జ్ఞాపకార్థం కోయంబత్తూరులోని చిన్నియం పలయం అమరవీరుల జాతా మదురైలోని పార్టీ మహాసభ వేదిక వరకు కొనసాగింది. మాజీ ఎంపి పిఆర్ నటరాజన్ జ్యోతిని అందజేసిన కార్యక్రమంలో వందలాది మంది కామ్రేడ్స్ పాల్గొన్నారు. కోయంబత్తూరు జిల్లా కమిటీ కార్యదర్శి సి పద్మనాభన్, ఇతర నాయకులు హాజరయ్యారు. తిరువయారు యూనియన్ కందియూర్‌లోని వెన్మణి అమరవీరుల స్మారక జాతాకు యూనియన్ కార్యదర్శి ఎ రాజు నాయకత్వం వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి చిన్నైతో పాటు పాండియన్ తదితరులు పాల్గొన్నారు.