- ప్రభుత్వ, అసైన్డ్ భూమిపై నిర్మాణ సంస్థల పాగా
- నాటి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని కబ్జా
- పదో పరకో ఇచ్చి లాగేసుకున్న జి.అమరనాథ్ రెడ్డి
- నిర్మాణ అనుమతుల కోసం అధికారులకు ముడుపులు
- హైటెక్ సిటీకి అతి దగ్గరలో ఉండడంతో పెద్ద నిర్మాణాలు
- అపార్టమెంట్ల కట్టి కోట్లకు విక్రయిస్తున్న వైనం
- శ్రీమంజునాథ, మహాలక్ష్మి కన్సస్ట్రక్షన్ సంస్థలకు అడ్డు అదుపులేదు
- కలెక్టర్ సహా రెవెన్యూ సిబ్బంది అండదండలతో యధేచ్చగా నిర్మాణాలు
- రూ.60కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడే నాధుడు ఎవరో.?
- మాముళ్ల మత్తులో శేరిలింగంపల్లి రెవిన్యూ అధికారులు
హైదరాబాద్ నగరం బాగా కాస్లీగా తయారైంది. సిటీ చుట్టూ భూముల ధరలు పెరిగిపోయాయి. రంగారెడ్డి జిల్లా అంతటా ఖాళీ ల్యాండ్స్ దొరకడం లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంతగా పెరిగి పోయిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఐటీ హబ్ కు అతి దగ్గరలో ఉన్న శేరిలింగంపల్లి మండలం ఖానామేట్ లో అప్పటి ప్రభుత్వం 1961లో నిరుపేదలైన దళితులకు భూములు అసైన్డ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాంతానికి దగ్గరలో పెద్ద పెద్ద సాప్ట్ వేర్ కంపెనీలు రావడం.. హైటెక్ సిటీకి అతిదగ్గరగా ఉండడంతో బడా బిల్డర్లు అట్టి అసైన్డ్ భూములను కన్నుపడింది. వాటిని కాజేసేందుకు అన్ని రకాల కుట్రలకు తెరలేపారు. ఎవరికైతే ఆ భూములను సర్కారు ఇచ్చింది వారి వారసుల డేటా తీసుకొని వారికి పదో పరకో ఇచ్చి సదరు భూమిని లాగేసుకున్నారు. భూమి ధరతో సంబంధం లేకుండా వాళ్ల అవసరాలను గుర్తెరిగి డబ్బు ఆశగా చూపి కొద్ది మొత్తంలో పైసలు ముట్టజెప్పి భూమిని కొట్టేయడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖానామెట్ గ్రామానికి చెందిన కటికే రామయ్యకు అప్పటి ప్రభుత్వం అసైన్డ్ భూమి ఇచ్చింది. అయితే కటికే రామయ్యకు… కుమారులు గండయ్య, సత్తయ్య, బాలయ్య, సందులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రామయ్య కుమారులలో ముగ్గురు మరణించగా వారి వారసులు మరియు కటికె గండయ్య ఇతర చట్టబద్ధమైన వారసులు ఖానామెట్ లోని నరసింహ స్వామి దేవాలయం సమీపంలో ఇప్పటికి నివసిస్తున్నారు. వీరి ఆర్థిక పరిస్థితిని, అమాయకత్వాన్ని గమనించిన గౌతూరి అమర్నాథ్ రెడ్డి ఆర్థికంగా లబ్ధి పొందుదామనే దుర్బుద్ధితో ప్రభుత్వము నుండి అసైన్డ్ భూమి పొందిన రామయ్య కుమారుడు కటికే గండయ్య ఇతర వారసులు దాదాపు 20 మంది నుంచి భూమిని అడ్డికి పావుసేరుకు కొనుగోలు చేయడం జరిగింది. వారితో రంగారెడ్డి రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు నం.11908/2022 తో, తేది.12/7/2022 రోజున 2368 గజాల అసైన్డ్ స్థలంను పవర్ టు సెల్ ఇమ్మోవాబుల్ ప్రాపర్టీ క్రింద అమర్నాథ్ రెడ్డి రిజిస్టరు చేసుకోవడం జరిగింది. ఇదే సర్వే నంబర్ లోని మరికొంత అసైన్డ్ స్థలాన్ని దస్తావేజు నం.11909/2022 ద్వారా పీఓటీ యాక్ట్ 1977 అసైన్డ్ భూముల చట్టాలకు వ్యతిరేకంగా రిజిస్టర్ చేసుకున్నాడు.
‘ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి’ అన్నట్టు అసైన్డ్ భూములు క్రయవిక్రయాలు చట్టం ప్రకారం చెల్లుబాటు కావని తెలిసి కూడా అమర్నాథ్ రెడ్డి ప్లాన్ ప్రకారం తన మిత్రులతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకుని మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ కు అప్పగించాడు. అదేలా అంటే దస్తావేజులు నం.10907/2023, 10908/2023,10988/2023 మరియు 10999/2023 ద్వారా రిజిస్టర్ సేల్ డీడ్ మరియు రిజిస్టర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేసేశాడు. సర్వే నంబర్ 41/5, ఇంటి నెంబరు 2-41/41/5/1లో దాదాపు 3000పై గజాలలో అంటే 1183 గజాలు, 1182 గజాలు, 818 గజాలు కలిపితే మొత్తం విస్తీర్ణం దాదాపు 3180 గజాలు ఉంటుంది. ఆ తర్వాత ఈ అసైన్డ్ భూమిలో మూడు నిర్మాణ అనుమతుల కోరకు అప్లై చేశారు. అందుకోసం అధికారులు కూడా లోపాయకారి ఒప్పందం ప్రకారం ఇది అసైన్డ్ స్థలము అని తెలుపక ఇతర కారణాలతో రిజెక్షన్ లేఖ నెం. 008595//జీహెచ్ఎంసీ/4257/SLP2/2023BP,లేఖ నెం. 008742/జీహెచ్ఎంసీ/4337/ఎస్ ఎల్పీ2/2023బీపీ, లేఖ నెం.011577/జీహెచ్ఎంసీ/5700/ఎస్ఎల్పీ2/2023బీపీ ద్వారా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ వెంటనే వీరు హైకోర్టులో WP.No 31072/2023, WP.No.31064/2023, WP.No.7211/2024 పిటిషన్ వేశారు. తరువాత జరిగేది అంతా షరా మామూలే అన్నీ అనుమతులు వచ్చేస్తాయి
ఈ విషయం మనము అక్కడ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే అర్థమైపోతుంది.
‘ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు’ అధికారులు ఎంత మంది మారినా వారు పరోక్షంగా వీరికి సహకరిస్తు ఉండడం గమనార్హం. ఇక్కడ జరుగుతున్న అసైన్డ్ భూముల అక్రమాలు, ఆక్రమణలు అందులో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై, పీఓటీ చట్టాలకు వ్యతిరేకంగా అసైన్డ్ భూములలో జరుగుతున్న బాగోతంపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారి వెంకరెడ్డి దృష్టికి ఆదాబ్ ప్రతినిధి ఆధారాలతో సహా తీసుకెళ్తే దురుసుగా ప్రవర్తించారు. పీఓటీ చట్టాల ప్రకారం ఫామ్ -1, ఫామ్-2 జారీ చేసి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరగా తహసీల్దార్ నిర్లక్ష్యంగా, కోపంగా సమాధానం చెప్పారు. నేను ఆర్డీవో స్థాయి అధికారిని నాకు ఏమి చేయాలో, ఏమి చెయ్యకూడదో తెలుసు మీరు చెప్పినట్టు చేయడానికి నేను ఇక్కడ లేను, ఆ భూములు గతంలో అసైన్డ్ దారుల నుండి ప్రభుత్వం స్వాదీనం పరచుకుంది. వారికి పీఓటీ నోటీసులు ఇవ్వడం అవసరం లేదు. మాకు తెలుసు చట్టం ప్రకారం ఏమిచేయాలో అంటూ దురుసుగా మాట్లాడాడు. కాగా ఆదాబ్ ప్రతినిధి వాస్తవానికి మీరు చెప్పేదే వాస్తవం అయితే శేరీలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఖానామేట్ అసైన్డ్ సర్వే నంబర్ 41/5 మరియు ఇతర భూములు స్వాధీనం చేసుకున్న రెస్యూమ్ పిటిషన్స్ కు సంబంధించిన పత్రాలు ఉన్నాయా.? ప్రభుత్వ రికార్డులు, ధరణిలో అసైన్డ్ దారుల పేర్లు ఎందుకు కొనసాగుతున్నాయి.? ఎందుకు రెవిన్యూ అధికారులు రికార్డుల్లో అసైన్డ్ దారుల పేర్లు తొలగించి ప్రభుత్వ భూమి అని నమోదు చేయలేదని ప్రశ్నించాడు. అదేవిధంగా మరికొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అసైన్డ్ దారుల పేర్లను అవకాశంగా మలచుకుని వారి వారసులు ద్వారా అక్రమ దస్తావేజులు సృష్టించి వేళ కోట్ల రూపాయల విలువజేసే ప్రభుత్వ భూములను దోచేస్తు అందులో అక్రమ అపార్ట్ మెంట్లు నిర్మిస్తూ ఒక్కో 3బీ.హెచ్.కే కోటి రూపాయలకు పైగా విక్రయిస్తు ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ అసైన్డ్ భూములలో మంజునాథ్ మరియు మహాలక్ష్మి నిర్మాణ సంస్థ ద్వారా కోట్ల రూపాయలు అర్జిస్తుంటే అధికారుల చర్యలు ఏవి..? ఈ ప్రశ్నలకు అధికారుల నుండి ఎలాంటి సమాధానం ఉండదు. అసలు అధికారులు కూడా అధికార గర్వము పక్కన పెట్టాలి ప్రజలు చెల్లించే పన్నుల రూపంలో వచ్చే ఆదాయం నుండే అధికారులకు వేతనాలు చెల్లింపులు జరుగుతాయి. అదీ గుర్తెరిగి అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటు ప్రజల, ప్రభుత్వ ఆస్తులను బాధ్యతతో కాపాడాలి కదా. వేళ కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఖానామేట్ అసైన్డ్ భూములు కాపాడాలనే విషయములో అధికారులకు చిత్తశుద్ధి ఉంటే స్థానికుల నుండి సమాచారం తీసుకుంటే తప్పు ఏముంది. ప్రభుత్వ అధికారులు అంటే ప్రజల సేవకులు అని మరచి అంతా తమకే తెలుసు తాము చేప్పిందే చట్టం, చేసిందే శాసనం అన్నట్లుగా గర్వపాడుతున్నారు. ఖానామేట్ లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములను కాపాడ లేఖ పరోక్షంగా వారికీ సహకరిస్తూ ప్రభుత్వా అధికారులు చోద్యం చూస్తున్నారు.
గతంలో కొన్ని నెలల కింద ఇదే తహశీల్దార్ ఖానామేట్ సర్వే నంబర్ 41/7 అసైన్డ్ భూమికి సంబంధించిన విషయంలో ప్రజలు, స్థానికుల సమాచారం పట్టించుకోకుండా ల్యాండ్ ఎన్క్రొచ్ మెంట్ క్రింద నోటీసులు జారీచేసి హైకోర్టు ముందు తలదించుకునేంతపనైంది. ఇది గమనిస్తే అధికారులు ఉద్దేశ పూర్వకంగానే అసైన్డ్ భూముల ఆక్రమణ దారులకు సహకరిస్తున్నారని తెలుస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల సలహానా లేక తన ఉపాయమో తెలియదు కానీ మంజునాథ మరియు మహాలక్ష్మి సంస్థ అమర్నాథ్ రెడ్డి అసైన్డ్ భూములు మాయం చేసే పని వేగం పెంచాడు. ఇప్పటికైనా ప్రజల పన్నుల నుండి వేతనంగా పొందే అధికారులు ప్రజలకు చెందాల్సిన వేళ కోట్ల రూపాయల విలువైన ఖానామేట్ అసైన్డ్ ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంపై దృష్టి సారించాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డిఓరాజేంద్రనగర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ లు అసైన్డ్ భూములను పీఓటీ యాక్ట్ 1977 ప్రకారం నోటీసులు జారీచేసి కాపాడాలని, ఖానామేట్ అసైన్డ్ భూములకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్న వాటిలో కౌంటర్లు వేసి ఆ భూములు ప్రభుత్వ పరం చేయుటకు ప్రయత్నం చేయాలని ప్రజలు అంటున్నారు. అలాగే మంజునాథ నిర్మాణ సంస్థ & మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ వారు అసైన్డ్ వారసుల నుండి అక్రమంగా పొంది అసైన్డ్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీవో రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ లు రెవిన్యూ చట్టాలు, పీఓటీ యాక్ట్ 1977 ప్రకారం మంజునాథ నిర్మాణ సంస్థ & మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టకపోవడమే రెవిన్యూ అధికారులపై అనేక అనుమానాలకు తావిస్తుంది. వీరికి ఆధారాలతో సహా అనేక ఫిర్యాదులు అందినా చర్యలు మాత్రం శూన్యం. ఇదే అసైన్డ్ స్థలం కాకుండా గతంలో కూడా కటికే రామయ్య వారసుల వద్ద నుండి సర్వే నంబర్ 41/5లో దాదాపు 3000 గజాలపైగా స్థలం ఇదే విధంగా అమర్నాథ్ రెడ్డి, మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బొంతూ రామోహన్ భార్య బొంతు శ్రీదేవి తీసుకోవడం ఆ స్థలంలో అప్పటి బీఆర్ఎస్ పార్టీ అండదండలతో అపార్ట్ మెంట్లు నిర్మించి వాటిని ప్రస్తుతం వరకు విక్రయించడం ద్వారా కొన్ని కోట్ల రూపాయలను వారు ఆర్జించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాపమా లేక ప్రస్తుత ప్రభుత్వం అలసత్వమా అర్థం కానీ పరిస్థితి.
ఖానామేట్ లోని కోట్ల రూపాయలు విలువ చేసే అసైన్డ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం, కోర్టు కేసుల్లో సరైన ఆధారాలతో అఫిడవిట్లు సమర్పించకపోవడం, అసైన్డ్ భూముల్లో తెచ్చిన స్టేలపై స్టే వెకేట్ పిటీషన్లు వేయకపోవడం చూస్తుంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుండి తహసిల్దార్ వరకు అవకతవకలకు పాల్పడ్డారని అనే అనుమానాలకు బలం చేకూరుతుంది. ఇప్పటికైనా జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిజాయితి గల అధికారులు, రెటైడ్ జడ్జితో విచారణ జరిపిస్తే దాదాపు ఖానామెట్ లోని 2500 కోట్ల రూపాయలపైగా విలువైన ప్రభుత్వ ఆస్తులు, భూములు కాపాడాలని పలువురు మేధావులు కోరుతున్నారు.