- గండిపేట్ మండలంలో కోట్ల విలువైన భూమి కబ్జా
- కోకాపేట సర్వే నెంబర్ 100, 109లో భూ కబ్జా
- సుమారు 30 ఎకరాల భూమి మాయం
- ప్రభుత్వ భూమిని పొతం పెడుతున్న పొలిటికల్ గ్యాంగ్
- కోట్లాది రూపాయల విలువైన జాగ కొట్టేస్తున్నా అధికారుల నిర్లక్ష్య వైఖరి
- నార్సింగి మున్సిపల్ కమిషనర్ సర్కారు భూమిలో నిర్మాణ అనుమతులు
- గుట్టు చప్పుడు కాకుండా హాంఫట్ చేస్తున్న అక్రమార్కులు
- కబ్జాకోరులకు రెవెన్యూ, మున్సిపల్ అధికారుల అండ
- యధేచ్చగా బహుళ అంతస్తులు, హోటల్స్, షెడ్లు, షాపుల నిర్మాణాలు
- తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని ఆరా తీయగా పొంతన లేని సమాధానాలు
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టిసారించాలంటున్న స్థానికులు
తెలంగాణలో భూముల ధరలు పెరిగిపోవడంతో కొందరూ వాటిని పొతం పెట్టి కోట్లు గడిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో భూముల ధరలు రూ.కోట్లల్లో పలుకుతున్నాయి. రాష్ట్ర రాజధాని నగరం పరిధిలో ఏ మారుమూల ప్రాంతంలో చూసిన భూములు చాలా కాస్లీ అయిపోయాయి. ఇంకేముంది హైదరాబాద్ చుట్టు ముట్టు ఉన్న ల్యాండ్స్ పై కబ్జాకోరుల చూపు భూములపై పడింది. భాగ్యనగరం పరిధిలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, దేవాలయ భూములు సాంతం తినేస్తున్నారు. భూమి ఖాళీ కనపడితే గద్దల్లా వచ్చి వాలిపోతున్నారు. రాజకీయ, అధికార బలంతో గవర్నమెంట్ భూములను కొల్లగొడుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన సర్కారు భూములను చెరబడుతున్నారు. కోకాపేటలో కోట్లాది రూపాయలు పలుకుతుండడం, రియల్ ఎస్టేట్ బాగా పెరిగి పోవడంతో భూములను కొట్టేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సపోర్టుతో కబ్జాకోరులు భూములను చెరపడుతున్నారు. హెచ్ఎండీఏ, నార్సింగి మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే బడా బిల్డింగ్ లను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా బహుళ అంతస్తులు, హోటల్స్, షెడ్లు, షాపుల, రెస్టారెంట్‌లు, షాపింగ్ మాల్స్ నర్మించారు. మరిన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.. ఈ అక్రమ నిర్మాణాలకు, కబ్జాకోరులు అధికారులకు భారీగా లంచాలు అందజేసి ఈజీగా పని పూర్తిచేసుకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల హస్తం ఉన్నట్లు వీరి అండదండలతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

















వివరాల్లోకి వెళితే… రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ, గండిపేట్ మండలం కోకాపేట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 100లో 30ఎకరాల 25గుంటలు, సర్వే నెం. 109లో 63 ఎకరాల 37 గుంటల ప్రభుత్వ భూమి ఉండేది. సర్వే నెంబర్ 109లో కొంత భాగం హెచ్ఎండీఏ లేఅవుట్ చేసి వేలంలో విక్రయించడం జరిగింది. అయితే మిగిలిన కొంత భాగాన్ని స్థానిక రాజకీయ నాయకులు, భూ కబ్జాదారులు కబ్జా చేసేశారు. అక్రమార్కులు ప్రభుత్వ భూమిని కబ్జాచేసి బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు. అదేవిధంగా సర్వే నెంబర్ 100లో 30 ఎకరాల 25 గుంటలు మొత్తం అధికారుల అండదండలతో, మున్సిపాలిటీ పర్యవేక్షణలో యధేచ్ఛగా కబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణాలు, షెడ్లు, హోటల్స్, షాపులు, షాపింగ్‌మాల్స్, రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకొని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే వీరికి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అండగా ఉంటున్నారు. బరితెగించి ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం అవుతున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా, పైగా కబ్జాదారులకు ఫుల్ సపోర్ట్ చేస్తునట్లు బహిరంగంగానే విమర్శలు వెలువెత్తున్నాయి.
గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతుంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు, వారికి ఎలా అనుమతులు ఇచ్చారో అర్థం కానీ పరిస్థితి. ప్రభుత్వ, అసైన్డ్ భూములను మింగుతున్న కబ్జాకోరులను కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నారంటే ఇక్కడ్నే అర్థం చేసుకోవచ్చు. తప్పు చేశారని రుజువు అయినప్పటికి వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారంటే వారి వెనుక ఎంత బలం ఉందో.. ఎంత డబ్బు ముట్టిందోనన్న అనుమానాలు వస్తున్నాయి. హైదరాబాద్ లో భూముల రేట్లు బాగా ఉండడంతో ఆఫీసర్లతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని వాటిని ఆక్రమించేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను మచ్చిక చేసుకొని ఖరీదైన బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. గవర్నమెంట్ స్థలంలో నిర్మాణాలు చేస్తుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని గండిపేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి వివరణ కోరడం జరిగింది. సర్వే నెం. 100, 109లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి గురించి తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. అంతేకాకుండా తమకు స్టాప్ సరిపడా లేరు, ఇవన్నీ తమకు తెలియదన్నట్టుగా నిర్లక్ష్య వైఖరి కనబర్చడం శోచనీయం. సర్కారు ఉద్యోగులై ఉండి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ఆఫీసర్ల తీరు ఇలా ఉండడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు చొరవతీసుకొని ప్రభుత్వ భూమి రికవరీ చేయాలని, అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోకాపేట్ భూములపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి అన్యాక్రాంతం అయిన భూములను రక్షించి, అక్రమార్కులకు సహాయసహకారాలు అందించిన మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.