డోర్ లాక్ పడడంతో ఊపిరాడక మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. బంధువుల వివాహానికి వచ్చిన వారి చిన్నారుల మృతి కలకలం రేపింది. గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు.. కారు డోర్లు లాక్ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. బంధువుల వివాహానికి వచ్చిన అక్కచెల్లెళ్ల పిల్లలు తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4).. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లారు. అయితే, కారు డోర్లు లాక్ పడటం, అది ఇతరులెవరూ గమనించకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు ఎంతసేపటికీ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి కోసం వెతికారు. చివరకు కారులో అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలను గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డోర్లు ఎలా లాక్ అయ్యాయి?ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.